logo

చెరువు కాలువ పూడ్చి ఆక్రమణ

పీలేరు పట్టణంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. అధికారం ఉన్నవారు ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారు.

Published : 27 Mar 2023 06:05 IST

కల్వర్టు దిగువన మట్టి

పీలేరు, న్యూస్‌టుడే : పీలేరు పట్టణంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. అధికారం ఉన్నవారు ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికులు ఫిర్యాదు చేస్తున్నా అధికారులు తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారు. స్థిరాస్తి వ్యాపారులు ఆక్రమించిన స్థలాన్ని ఏకంగా ప్లాట్లు వేసి విక్రయించేస్తున్నారు. పీలేరు పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో తిరుపతి మార్గంలోని కొత్తచెరువు కాలువ ఆక్రమణకు గురవుతోంది. ఎగువ ప్రాంతంలోని గుట్టలపై కురిసిన వర్షపునీరు కాలువ ద్వారా కొత్తచెరువుకు వెళ్లేవి. చెరువులో నీళ్లుంటే ఆయకట్టుకు సాగునీటి సమస్య ఉండేదికాదు. స్థిరాస్తి వ్యాపారులు పట్టాభూములను కొనుగోలు చేసి చదును చేసేటప్పుడు, గుట్టల పక్కన రాళ్లను తొలగించి పట్టాభూమిలో కలిపేసి విక్రయించేస్తున్నారు. దీంతో చెరువుకు వచ్చే కాలువ నీటి ఒరవడి తగ్గింది. కాలువ కల్వర్టు పక్కన రెండు వైపులా నీటి మడుగులు ఉండేవి. మట్టితో పూడ్చివేయడంతో వాటి జాడ కనిపించడం లేదు. నీటిమడుగులున్న స్థలం ప్రభుత్వ బంజరు అన్న విషయం స్థానికులకు తెలిసినా స్థిరాస్తి వ్యాపారులు పట్టా భూముల దస్తావేజులు చూపించి పక్కనున్న ప్రభుత్వ భూమి మాదే అని వాదిస్తున్నారు. కల్వర్టుకు ఇరువైపులా రూ.కోటి విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించి మట్టి తోలారు. ఇటీవల స్థిరాస్తి వ్యాపారుల మధ్య విభేదాలు రావడంతో ఆక్రమణ విషయం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ అధికారులు వెళ్లి అడ్డుకున్నారు. కల్వర్టుకు రెండు వైపులా ఉన్న 0.58 సెంట్ల ప్రభుత్వ భూమితో పాటు పక్కన ఉన్న పట్టా భూమిలోనూ ఆక్రమణలు తేలే వరకు ఎవరూ ప్రవేశించరాదని అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు మాయమైంది.


ఫిర్యాదు చేస్తే అడ్డుకుంటాం
- జి.రవి, తహసీల్దార్‌, పీలేరు

తిరుపతి మార్గంలోని కల్వర్టుకు రెండు వైపులా ఉన్న కాలువ స్థలం ప్రభుత్వానికి చెందిందని గుర్తించాం. పూర్తి స్థాయిలో సర్వే చేయాల్సి ఉంది. ఇందులో సాంకేతిక సమస్యలు ఉన్నందున ఇతరులు ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటాం. ఆక్రమణల విషయంలో ఎవరైనా సమాచారం ఇస్తే తక్షణం స్పందిస్తాం.          

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని