logo

నత్తే నయం!

వైయస్‌ఆర్‌ జిల్లాలో 557 గ్రామ పంచాయతీలు, ఆవాస ప్రాంతాలు 1,954 ఉన్నాయి. 3,46,851 కుటుంబాలు నివాసం ఉండగా ఇప్పటికే 3,20,757 కుటుంబాలకు కుళాయి వసతి కల్పించారు.

Updated : 27 Mar 2023 06:37 IST

మంజూరైన పనులు 910... పూర్తయినవి 92
ఇదీ జల్‌జీవన్‌ మిషన్‌ ప్రగతి తీరు
న్యూస్‌టుడే, కడప

ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరంలో జేజేఎం పథకం కింద ఏర్పాటు చేసిన మోటారు

వేసవి కాలం వచ్చేసింది. గ్రామీణ గడపలో తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. పల్లె గొంతుక తడారిపోతోంది. ప్రతి గడపకు రక్షిత నీరు సరఫరా చేయడానికి కుళాయి వసతి కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న జల జీవన్‌ మిషన్‌ పథకంలో చేపట్టిన పనులు మూడడులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రగతి చూస్తే నత్తే నయం అన్నట్లు నిదానంగా జరుగుతున్నాయి. జిల్లా స్థాయి అధికారులు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంతో గుత్తేదారులు కూడా పెద్దగా ముందుకు రావడం లేదు.  

వైయస్‌ఆర్‌ జిల్లాలో 557 గ్రామ పంచాయతీలు, ఆవాస ప్రాంతాలు 1,954 ఉన్నాయి. 3,46,851 కుటుంబాలు నివాసం ఉండగా ఇప్పటికే 3,20,757 కుటుంబాలకు కుళాయి వసతి కల్పించారు. ఇంకా 26,094 ఇళ్లకు రక్షిత జలాల సరఫరా వ్యవస్థ లేదు. జల జీవన్‌ మిషన్‌ పథకంలో ఇప్పటికే ఉన్న పథకాల విస్తరణ, బలోపేతం చేయడం, కొత్తగా మరికొన్ని సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. కొత్తగా గొట్టపు బావుల తవ్వకం, మోటార్లు, పంపులు, స్టార్టర్లు కొనుగోలు, ఎక్కడైనా నీటి సరఫరా చేసే గొట్టాలు దెబ్బతింటే మార్పు చేయడం, పైపులైను విస్తరణ, నీటి నిల్వ కోసం ట్యాంకుల నిర్మాణం వంటి పనులు చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా చూస్తే 910 పనులు చేయాలని గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులు పరిపాలన అనుమతులిచ్చారు. బీ రూ.అయిదు లక్షల లోపు ఉన్న వాటిని నామినేషన్‌ విధానంలో, రూ.అయిదు లక్షలకు పైగా విలువ ఉన్న వాటికి గుత్తపత్రాలు ఆహ్వానించారు. వీటి విలువ రూ.104.02 కోట్లు కాగా, ఇప్పటికే రూ.3.78 కోట్లు విలువ చేసే 92 పనులు పూర్తి చేశారు. మరో 205 చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందుకోసం రూ.34.66 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇంకా 328 చోట్ల (అంచనా రూ.53.85 కోట్లు) చేయడానికి అధికార పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గుత్తేదారులు ముందుకు రాలేదు. వర్షాభావంతో 2019, 2020లో భూగర్భ జలాలు తరిగిపోవడంతో ఆయా గ్రామాల్లోని నాయకుల ద్వారా ట్యాంకర్లు ఏర్పాటు చేసి రవాణా చేసి గ్రామీణుల దప్పిక తీర్చారు. ఇప్పటికీ చాలామందికి బిల్లులు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా జేజేఎంలో చేయాలని అడుగుతుంటే పెద్దగా స్పందన లేదు.ముందస్తుగా రూ.11.91 కోట్లకు అనుమతిచ్చినా 285 పనులను రద్దు చేశారు. ఇప్పటి వరకు చేసిన వాటికి రూ.7.88 కోట్లు వెచ్చించారు. బీ ఒంటిమిట్ట మండలంలో 52 పనులు రూ.3.73 కోట్లతో చేయాల్సి ఉంటే కేవలం ఒక్క చోట మాత్రమే పూర్తి చేశారు. మరో ఏడు చోట్ల వివిధ దశల్లో ఉన్నాయి. బీ సిద్దవటం మండలంలో 14 పనులకు రెండే చేపట్టారు. బీ చక్రాయపేట మండలంలో 70 పనులకు రూ.2.46 కోట్లతో అనుమతిచ్చారు. ఆ తర్వాత ఏమైందో తెలియదుగానీ రద్దు చేశారు. బీ ఖాజీపేట మండల పరిధిలో 101 పనులకు రూ.3.75 కోట్లు వెచ్చించాలని ఉన్నత స్థాయిలో ఆమోదం తెలిపారు. ఇక్కడ కేవలం మూడు పనులు పూర్తవ్వగా వీటి విలువ రూ.5.86 లక్షలు. ఇంటింటికీ రక్షిత నీరు ఇవ్వాలనే జల స్ఫూర్తి సాకారం ఎప్పటికీ సాకారం అవుతుందో అధికారులకే తెలియాలి.


పనులు వేగవంతం చేస్తాం
- వెంకటేశ్వర్లు, ఈఈ, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గడపకు తాగునీటి కుళాయి వసతి కల్పించాలని జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం కింద పనులకు అనుమతిచ్చాం. కొన్నిచోట్ల చురుగ్గా జరుగుతున్నాయి. మరి కొన్ని పల్లెల్లో కొంత నెమ్మదించాయి. ఇప్పటికే చేపట్టిన వాటికి బిల్లులు రాలేదని కొంతమంది నిదానంగా చేస్తున్నారు. త్వరలో నిధులు విడుదల కానున్నాయి. మంజూరు చేసిన పనులన్నీ వేగవంతం చేసి ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్రణాళికను రూపొందించాం. క్షేత్రస్థాయిలో తరచూ పరిశీలిస్తున్నాం. కొన్నిచోట్ల అవసరం లేదని గుర్తించి రద్దు చేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని