logo

రాష్ట్రంలో దళితులకు రక్షణేదీ?

బహుళార్ధ పశువైద్యశాల డీడీగా పనిచేస్తున్న అచ్చెన్న మృతిపై అనుమానాలున్నాయని, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని అప్పగించారని...

Published : 27 Mar 2023 06:09 IST

ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులతో మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ

అరవిందనగర్‌, చిన్నచౌక్‌ (కడప), న్యూస్‌టుడే : బహుళార్ధ పశువైద్యశాల డీడీగా పనిచేస్తున్న అచ్చెన్న మృతిపై అనుమానాలున్నాయని, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని అప్పగించారని, అసలు వీడియో తీశారోలేదో కూడా తెలియడం లేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. తక్షణమే రీపోస్టుమార్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదివారం కడపకు వచ్చిన ఆయన, పలు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలిసి అచ్చెన్న మృతిపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తినే హత్య చేశారని, ఇక సామాన్య దళితుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నిందితులకు బెయిల్‌ రాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా పాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ చేపట్టాలన్నారు. అచ్చెన్న కుటుంబ సభ్యులు ఎవరెవరిపై ఫిర్యాదు చేశారో వారందరినీ విచారణ చేయాలని కోరారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఉన్నత స్థానంలో ఉన్న దళిత అధికారికి న్యాయం జరగలేదన్నారు. సోమవారం అన్నమయ్య జిల్లా ఎస్పీ, వైద్యులను కలిసి మరిన్ని వివరాలు సేకరిస్తామని, తర్వాత ఇందులో ఎవరెవరి హస్తం ఉందో నిగ్గు తేల్చుతామని స్పష్టం చేశారు. డాక్టర్‌ అచ్చెన్న కుటుంబ సభ్యులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారం ఉద్యోగ అవకాశం కల్పించాలని, కోటిరూపాయల పరిహారాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెల్లించాలని మందకృష్ణ డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి, బీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున, ఎస్టీ ఉద్యోగుల సంఘం నేతలు డాక్టర్‌ శివానాయక్‌, రామ్మూర్తినాయక్‌, ఎమ్మార్పీఎస్‌ జిల్లా కన్వీనర్‌ మాతయ్య, వీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నెం చిన్నసుబ్బయ్య తదితరులతో ఆయన మాట్లాడారు.

అఖిలపక్ష నేతల ఆందోళన : కడప గ్రామీణ : వీపీసీ డీడీ అచ్చెన్న మృతిపై మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు చంద్ర, చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో దళిత అధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింతే సరైన చర్యలు లేవని విమర్శించారు. ఈ నెల 12వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు 14న ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. తన కింద పనిచేసే అధికారులను డీడీగా అచ్చెన్న సరెండర్‌ చేస్తే ఉన్నతాధికారులు తిరిగి అదే స్థానంలో విధులు నిర్వర్తించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడమే కాక అచ్చెన్ననే సస్పెండ్‌ చేయడం ఏమిటని ప్రశ్నించారు. దళిత వైద్యుడు సుధాకర్‌ అధికారుల వేధింపులు తాళలేక గుండెపోటుతో మృతి చెందిన ఘటన మరువక ముందే మరో అధికారి మృతి చెందడం చూస్తే దళితులకు రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు, ఏఐటీయూసీ నాయకులు నాగసుబ్బారెడ్డి, వేణుగోపాల్‌, బాదుల్లా, చంద్రశేఖర్‌, బీసీ ఐక్యవేదిక జాతీయ నాయకులు మల్లికార్జున, బీఎస్పీ నాయకులు గురప్ప, ఆప్‌ నేత శ్రీనివాసులు, లోక్‌సత్తా నాయకులు కృష్ణ, జనసేన నాయకుడు గౌస్‌బాషా, హేతువాద సంఘం నాయకుడు సీఆర్‌వీ ప్రసాద్‌రావు, ఎంఆర్‌ఎఫ్‌ నాయకులు దస్తగిరి, రైతు సంఘం నాయకుడు దస్తగిరిరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని