logo

ఆస్పత్రులు కిటకిట... పరీక్షలకు కటకట

సీజనల్‌ వ్యాధులు ప్రైవేటు వైద్యశాలలకు కాసులు కురిపిస్తున్నాయి. వచ్చిన జబ్బు ఏదని తెలుసుకోవడానికి రోగులు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. హెచ్‌3ఎన్‌2 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రారంభించలేదు.

Published : 27 Mar 2023 06:18 IST

వైద్య, ఆరోగ్యశాఖలో కొరవడిన సన్నద్ధత
ప్రైవేటుకు పరుగులు తీస్తున్నరోగులు
న్యూస్‌టుడే, కడప  సంక్షేమం, మదనపల్లె వైద్యం, పీలేరు

మదనపల్లె ఆసుపత్రిలో ఔషదాల కోసం బారులు తీరిన రోగులు

సీజనల్‌ వ్యాధులు ప్రైవేటు వైద్యశాలలకు కాసులు కురిపిస్తున్నాయి. వచ్చిన జబ్బు ఏదని తెలుసుకోవడానికి రోగులు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. హెచ్‌3ఎన్‌2 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రారంభించలేదు. ఇన్‌ఫ్లుయేంజా వైరస్‌ నిర్ధారణకు అవసరమైన కిట్లు జిల్లాలకు రాలేదు. కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలను నిలిపేశారు. జ్వరాలు, ఇతర వ్యాధుల తీవ్రత పెరిగిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాలంటీర్లు, ఆశా కార్యకర్తలతో వైద్యఆరోగ్యశాఖ ఫీవర్‌ సర్వే మొక్కుబడిగా నిర్వహిస్తోంది. వాతావరణ మార్పులు, వైరస్‌ల విజృంభణతో వ్యాధులు ముసురుకుంటున్నా వైద్య, ఆరోగ్యశాఖ నిర్లిప్తంగా ఉండడం ప్రైవేటు వైద్యశాలలకు కలిసివస్తోంది.

* వ్యాధి నిర్ధారణ పరీక్షలు పూర్తి స్థాయిలో లేకపోవడం, వసతులు ఉన్నా సకాలంలో రిపోర్టులు ఇవ్వకపొవడం, ఫలితాలు వచ్చిన తర్వాత వైద్యులు అందుబాటులో లేకపోవడం, చికిత్సకు తగిన మందులు లేక బయటకొనాల్సిన పరిస్థితులు తదితర కారణాలతో రోగులు ప్రైవేటు వైద్యశాలలకు తరలిపోతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అన్నీ ఉన్నాయని అధికారులు చెబుతున్నా రోగులు మాత్రం ప్రైవేటు వైద్యశాలల్నే నమ్ముతున్నారు.

* గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పట్టణాల్లోని మురికివాడల్లో నివసించే వారు సమీపంలోని ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. సత్వర ఉపశమనం కోసం వారు స్టిరాయిడ్లు, మోతాదుకు మించి యాంటీబయాటిక్స్‌ రోగులకు ఇస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

* కొందరు రోగులు నేరుగా ఔషధ దుకాణాల నుంచి మందులు కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. ఈ తరహాలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలు జిల్లా వైద్యఆరోగ్యశాఖకు చేరే అవకాశం లేదు. గుర్తింపు పొందిన వైద్యశాలలకు వెళ్లే రోగుల వివరాలను ‘హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సిస్టం’ ద్వారా ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను విధిగా పాటిస్తున్న ప్రైవేటు వైద్యశాలలు లేవు. దీంతో జ్వరాలు, ఇతర వ్యాధుల బారినపడిన రోగుల సంఖ్య, ఏయే ప్రాంతాల్లో ఈ వ్యాధులు ఉన్నాయి, ఎలాంటి వ్యాధులు ముసురుకుంటున్నాయి అన్న విషయాలు ఆరోగ్యశాఖ దృష్టికి రావడం లేదు. దీంతో జిల్లాలో వ్యాధుల వ్యాప్తి పూర్తి నియంత్రణలో ఉందని అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు.


జ్వర పీడితులే అధికం

కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి రోజూ సుమారు 1500 మంది వరకు వైద్య సేవల కోసం వస్తున్నారు. మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. గతంలో 600 నుంచి 700 వరకు ఓపీ ఉండేది. ప్రస్తుతం ఆ సంఖ్య 800 నుంచి 900కు చేరింది. చాలా మంది జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ ఆసుపత్రికి వస్తున్నారు. ఇందులో 15 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువగా ఉన్నారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ 560 మంది అవుట్‌ పేషెంట్లు వస్తున్నారు. వీరిలో 250 మంది వరకు జ్వరపీడితులే ఉంటున్నారు. ఆసుపత్రి ల్యాబ్‌లో రోజూ 300 మందికి రక్త పరీక్షలు చేస్తున్నారు. ఎక్కువగా వైరల్‌ జబ్బులు కనిపిస్తున్నాయి.


ఫీజులపై నియంత్రణ ఏదీ?

దగ్గు, జ్వరం, జలుబు వచ్చిన వారు విధిలేక ప్రైవేటు వైద్యులను సంప్రదిస్తే సీబీపీ, ఫీవర్‌ ప్రొఫైల్‌ తదితర పరీక్షలకు సిఫార్సు చేస్తున్నారు. ఒక్కో రోగి ల్యాబ్‌ పరీక్షలకు రూ.900 మొదలుకొని రూ.1500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ల్యాబ్‌ ఫీజులపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో వైద్యులు, ల్యాబ్‌ సిబ్బంది ఇష్టానుసారం బిల్లులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ ప్రచారం చేస్తున్న స్థాయిలో సర్కారు దవాఖానాల్లో వైద్యం అందడం లేదన్నది బహిరంగ రహస్యం. జ్వరాలు, ఇతర వ్యాధుల వ్యాప్తిపై వాస్తవిక గణాంకాలు సేకరించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని జిల్లా వాసులు కోరుతున్నారు.


వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రారంభిస్తాం
- డాక్టర్‌ నాగరాజు, డీఎంహెచ్‌వో, వైయస్‌ఆర్‌ జిల్లా

హెచ్‌3ఎన్‌2, ఇన్‌ఫ్లుయేంజా వైరస్‌ నిర్ధారణ కిట్లు జిల్లాకు రానున్నాయి. కిట్లు వచ్చిన వెంటనే పరీక్షలు చేస్తాం. కొవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ వైద్యశాలలో ర్యాపిడ్‌టెస్ట్‌లు చేయడానికి చర్యలు తీసుకుంటాం. పాజిటివ్‌ వస్తే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు నమూనాలు పంపిస్తాం. డెంగీ, ఇతర జ్వరాల నిర్ధారణకు అన్ని రకాల పరీక్షలు ప్రభుత్వ వైద్యశాలల్లో అందుబాటులో ఉన్నాయి. మందుల కొరత లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని