logo

తాగునీరందిస్తే... కన్నీరు మిగిల్చారు!

మూడేళ్ల కిందట వర్షాభావం వెంటాడింది. కరవు కేక ప్రతిధ్వనించింది. భూగర్భ జలాలు పాతాళానికి చేరాయి. పుడమి ఒడిలో నీటిమట్టాలు తరిగిపోయాయి.

Published : 28 Mar 2023 03:18 IST

తాగునీటి సరఫరా బకాయిలు వైయస్‌ఆర్‌ జిల్లాలో రూ.3.11 కోట్లు, అన్నమయ్యలో రూ.17.51 కోట్లు
నిధుల్లేక గత మూడేళ్లుగా చెల్లింపుల్లో ఎడతెగని జాప్యం
ట్యాంకర్లతో రవాణా చేసినా తప్పని నిరీక్షణ
- న్యూస్‌టుడే, కడప, రాజంపేట గ్రామీణ

ఒంటిమిట్ట మండలం నర్వకాటిపల్లెలో ట్యాంకరు నుంచి నీటిని పట్టుకుంటున్న ప్రజలు (పాత చిత్రం)

మూడేళ్ల కిందట వర్షాభావం వెంటాడింది. కరవు కేక ప్రతిధ్వనించింది. భూగర్భ జలాలు పాతాళానికి చేరాయి. పుడమి ఒడిలో నీటిమట్టాలు తరిగిపోయాయి. గొట్టపుబావులు నోరెళ్లబెట్టాయి. గ్రామీణ గడపలో తాగేందుకు గుక్కెడు నీరు దొరకలేదు. ఊరూరా దాహం కేకలు మిన్నంటాయి. బిందెడు నీటి కోసం కడివెడు కన్నీటి కష్టాలు వెంటాడాయి. చాలా దయనీయ పరిస్థితి నెలకొంది. దాహార్తి సమస్యకు తాత్కాలిక ఉపశమనం కల్పించాలని, ప్రత్యామ్నాయంగా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసి జలఘోష వెతలను దూరం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికార యంత్రాంగం మాటలు నమ్మి స్థానిక నాయకులు తాగునీటి రవాణా చేయడానికి ముందుకొచ్చారు. వీరికి మూడేళ్లయినా బిల్లులు చెల్లించలేదు. నిధుల్లేక చెల్లింపుల్లో అంతులేని జాప్యం జరుగుతోంది. జిల్లాల నుంచి ప్రతిపాదనలు వెళ్లినా పద్దు రాకపోవడం గమనార్హం.  

వైయస్‌ఆర్‌ జిల్లాలో 2019, 2020లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వరుణ కరుణ కురవలేదు. కొన్ని మండలాల్లో కరవు కేక ప్రతిధ్వనించింది. భూగర్భ జలాలు రానురాను తరిగి పోయాయి. గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ, పంచాయతీల పర్యవేక్షణలో ఏర్పాటుచేసిన గొట్టపుబావులు ఎండిపోయాయి. పల్లెల్లో జలఘోషతో ప్రజలు అల్లాడిపోయారు. నీటి కోసం పడరాని పాట్లు పడ్డారు. సమస్యను అధిగమించేవిధంగా 2019, నవంబరు నుంచి 2020, డిసెంబరు వరకు 13 నెలలపాటు జిల్లాలోని 40 శాతానికి పైగా గ్రామాల్లో ట్యాంకర్లతో తాగునీటిని రవాణా చేసి ప్రజల దప్పిక తీర్చారు. ఒక ట్యాంకరులో నాలుగు వేల లీటర్ల నీరుంటుంది. ఒక ట్రిప్పునకు రూ.515 చెల్లించాలని రాష్ట్ర ఉన్నతాధికారులు అనుమతిచ్చారు. జిల్లాలో ఇప్పటికే రూ.3.11 కోట్ల మేర బిల్లుల బకాయిలు రావాల్సి ఉంది. ఒంటి మిట్ట మండలం నర్వకాటిపల్లె, కోనరాజుపల్లె, గంగపేరూరు, చింతరాజుపల్లె పంచాయతీల్లో కొన్ని గ్రామాలకు ట్యాంకర్లతో తాగునీరందించారు. రాష్ట్ర విపత్తుల ఉపశమన పద్దు (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) రూ.41.15 లక్షలు రావాల్సి ఉంది. జమ్మలమడుగు నియోజకవర్గం నియోజకవర్గంలో రూ.30 లక్షలు రావాల్సి ఉంది. కడప డివిజన్‌కు రూ.240 లక్షలు విడుదల చేయాల్సి ఉంది. బిల్లులు చెల్లించాలని గత మూడేళ్లుగా తాగునీటి సరఫరా విభాగం అధికారుల చుట్టూ నాయకులు, గుత్తేదారులు తిరుగుతున్నారు. అదిగో ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఇదిగో బిల్లు తీసుకోండి అంటూ ఊరించే మాటలతో ఇంజినీర్లు కాలయాపన చేస్తున్నారు. ఇంతవరకు అతీగతి లేదు. 15వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించాలని భావించారు. ఈ నిధిపై ప్రభుత్వం కన్నేసి విద్యుత్తు బిల్లుల చెల్లింపులకు లాగేసుకుంది. ఘన వ్యర్థ పదార్థాల కేంద్రాల్లో పనిచేస్తున్న క్లాప్‌ మిత్రులు, క్లాప్‌ షెడ్డులకు వేతనాల కొంతమేర ఇచ్చారు. చిన్న పంచాయతీల్లో ఖజానా ఖాళీ అయింది.

అన్నమయ్య గోడు వినేదెవరు?

అన్నమయ్య జిల్లాలో 4,517 పనులకు రూ.17.51 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికీ ఎలాంటి కదలిక లేదు. ఎప్పుడు విడుదల చేస్తారనేది ఎవరు కూడా స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. ఇంకెన్నేళ్లు పడిగాపులు కాయాలని పల్లె గొంతుక తడారిపోకుండా నీరు రవాణా చేసిన గుత్తేదారులు ప్రశ్నిస్తున్నారు. రాజంపేట డివిజన్‌లో రూ.145.26 లక్షలు, రైల్వేకోడూరు రూ.461.58 లక్షలు, రాయచోటి రూ.26.49 లక్షలు, లక్కిరెడ్డిపల్లె రూ.28.07 లక్షలు, మదనపల్లె రూ.200.69 లక్షలు, పీలేరు రూ.152.72 లక్షలు, వాల్మీకిపురం రూ.266.45 లక్షలు, తంబళ్లపల్లె డివిజన్‌లో రూ.470.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. మూడేళ్లుగా నిరీక్షణ చేసినా పాలకుల నుంచి ఎలాంటి భరోసా లభించలేదు, మండల, జిల్లా పరిషత్తు సమావేశాల్లోనూ చర్చిస్తున్నా చలనం లేదు. స్థానిక ప్రజాప్రతినిధుల విన్నపాలను ఎవరు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎంతోమంది అప్పులు పాలైనా పట్టించుకునే వారు కరవయ్యారు. మా గోడు వినేదెవరు అని చోటా నాయకులు ఆక్రోశిస్తున్నారు.


నిధులు రాగానే చెల్లిస్తాం

అన్నమయ్య జిల్లాలో 2019, 2020లో వర్షాభావంతో తాగునీటి బోర్లు ఎండిపోయాయి. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్పట్లో ట్యాంకర్లు ఏర్పాటు చేసి నీటిఎద్దడి ఉన్న పల్లెలకు రవాణా చేశారు. జిల్లాకు రూ.17.50 కోట్ల మేర బిల్లుల బకాయిలు రావాల్సి ఉంది. ఉన్నత స్థాయి నుంచి అనుమతి రాగానే రవాణాదారులకు బిల్లులు చెల్లించడానికి చర్యలు తీసుకుంటాం.

 ప్రసన్నకుమార్‌, ఎస్‌ఈ, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ, అన్నమయ్య జిల్లా


ప్రతిపాదనలు పంపించాం

తాగునీటి ఎద్దడి నెలకొనడంతో ప్రత్యామ్నాయంగా ట్యాంకర్లతో తాగునీరు రవాణా చేయించారు. ఇప్పటికే కొంతమందికి బిల్లులు చెల్లించాలనికి నిధులు విడుదల చేశారు. ఇంకా మరికొందరికీ ఇవ్వాల్సిన మాట వాస్తవమే. ట్యాంకర్ల రవాణాదారులకు పూర్తిస్థాయిలో డబ్బులు ఇవ్వడానికి నిధులివ్వాలని ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. అనుమతి రాగానే చెల్లించడానికి చర్యలు తీసుకుంటాం.  

వెంకటేశ్వర్లు, ఈఈ, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ, కడప డివిజన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని