logo

ఇసుక క్వారీ వద్ద ఉద్రిక్తత

సిద్దవటం మండలం జంగాలపల్లె గ్రామంలోని ఇసుక క్వారీని సోమవారం తెదేపా నాయకులు, స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో తెదేపా నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది.

Published : 28 Mar 2023 03:18 IST

వాహనాలను అడ్డుకున్న తెదేపా నాయకులు

ఇసుక వాహనాలను అడ్డుకుంటున్న తెదేపా నాయకులు, ప్రజలు

సిద్దవటం, న్యూస్‌టుడే : సిద్దవటం మండలం జంగాలపల్లె గ్రామంలోని ఇసుక క్వారీని సోమవారం తెదేపా నాయకులు, స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో తెదేపా నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. జంగాలపల్లెలోని ఇసుక క్వారీతో సమీప గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, క్వారీలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు ఆరోపించారు. సోమవారం స్థానిక నేతలు, ప్రజలతో కలిసి క్వారీ వద్దకు చేరుకున్నారు. వాహనాలను అడ్డుకుని బిల్లులు చూపించాలని చోదకులను అడిగారు. కొందరు లేవని చెప్పడంతో వాహనాలను నిలిపేసి నిరసన తెలిపారు. విషయం తెలిసి ఎస్సై తులసీనాగప్రసాద్‌ అక్కడికి చేరుకున్నారు. వాహనాలను అడ్డుకోవడం తగదన్నారు. క్వారీలో అక్రమాలు జరుగుతున్నాయని, అధికారులు సమాధానం చెప్పే వరకు వాహనాలను పంపించేది లేదని బత్యాల చెంగల్రాయుడు తేల్చిచెప్పారు. దీంతో ఎస్సై, బత్యాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. అనంతరం సీఐ పురుషోత్తమరాజు వచ్చి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు తమకు సమయం ఇవ్వాలని, తర్వాత క్వారీకి అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలిస్తామన్నారు. అనుమతులు ఉంటే క్వారీలోకి వాహనాలు వెళ్లేందుకు మరో ప్రదేశం నుంచి దారి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తెదేపా నేతలు శాంతించారు. అనంతరం బత్యాల చెంగల్రాయుడు మాట్లాడుతూ విలేకరులతో మాట్లాడుతూ తాము క్వారీలోకి వెళ్లగానే చోదకులు టిప్పర్లు, లారీల నుంచి ఇసుకను కిందకు దింపేసి వెనక్కి వచ్చారన్నారు. కొందరి చోదకులను బిల్లులు చూపించాలని అడగగా లేవన్నారని చెప్పారని, కొన్ని వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా 40 టన్నుల వరకు ఇసుక లోడు చేసుకుని వచ్చాయని వివరించారు. క్వారీలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని దీనిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. తెదేపా నేతలు మోహన్‌రెడ్డి, దశరథరామనాయుడు, నాగమునిరెడ్డి, పుత్తా రామచంద్రయ్య, రాజశేఖర్‌, వీరభద్రుడు, గంజి సుబ్బరాయుడు, రామమోహన్‌, అయ్యప్ప, బాలసుబ్బయ్య, రామచంద్రయ్య, మరికొందరు పాల్గొన్నారు.

సిద్దవటం ఎస్సై తులసీనాగప్రసాద్‌, బత్యాల చెంగల్రాయుడు మధ్య వాగ్వాదం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని