logo

వీపీసీకి వివాదాల మసి

పశువైద్యంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న బహుళార్ధ పశువైద్యశాల నేడు వివాదాలకు కేంద్రబిందువైంది. ఉమ్మడి కడప జిల్లాలోని పశువుల ఆసుపత్రుల్లో వైద్యం అందించలేని జీవాలను వాటిని ఇక్కడకు పంపితే బాగుచేసి పంపేవారు.

Published : 28 Mar 2023 03:18 IST

గతేది ఆగస్టు నుంచి గొడవలు మొదలు
పరిష్కారం చూపడంలో అధికారుల చర్యలు నామమాత్రం
- న్యూస్‌టుడే, కడప గ్రామీణ, కడప నేరవార్తలు

కడప నగరంలోని వీపీసీ భవనం

పశువైద్యంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న బహుళార్ధ పశువైద్యశాల నేడు వివాదాలకు కేంద్రబిందువైంది. ఉమ్మడి కడప జిల్లాలోని పశువుల ఆసుపత్రుల్లో వైద్యం అందించలేని జీవాలను వాటిని ఇక్కడకు పంపితే బాగుచేసి పంపేవారు. అలాంటి చరిత్ర ఉన్న ఆసుపత్రి గతేడాది ఆగస్టు నుంచి వివాదాలకు కేంద్రం కావడం ప్రస్థావనార్హం. వీపీసీ డీడీగా అచ్చెన్న 2021 జూన్‌ 25న బాధ్యతలు చేపట్టారు. ఏడీలుగా సుధీర్‌నాథ్‌బెనర్జీ, శ్రీధర్‌లింగారెడ్డి, పశువైద్యులు సుభాష్‌చంద్రబోస్‌, సిబ్బంది, అటెండర్లు పనిచేస్తున్నారు. డీడీ అచ్చెన్న, ఏడీ సుధీర్‌నాథ్‌బెనర్జీ మధ్య తొలుత విబేధాలు వచ్చినట్లు సమాచారం. సెప్టెంబరులో సుధీర్‌నాథ్‌ బెనర్జీని సరెండర్‌ చేస్తూ డీడీ చర్యలు తీసుకున్నారు. నేరుగా డైరెక్టర్‌కు సరెండర్‌ చేసే అధికారం లేదంటు డైరెక్టర్‌ నుంచి తిరిగి ఉత్తర్వులు వచ్చాయి. దీంతో డీడీ మళ్లీ బెనర్జీని జిల్లా అధికారి (జేడీ) నుంచి డైరెక్టర్‌కు సరెండర్‌ చేశారు. కొన్నాళ్లకు పశువైద్యుడు సుభాష్‌చంద్రబోస్‌కు డీడీకి మనస్పర్థలు వచ్చాయి. విధులు సక్రమంగా నిర్వర్తించలేదంటూ సరెండర్‌ చేశారు. గతేడాది నవంబరులో అచ్చెన్నను సరెండర్‌ చేస్తూ డైరెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. అక్కడే పనిచేసే ఏడీ సుధీర్‌నాథ్‌బెనర్జీకి డీడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అచ్చెన్న న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టేటస్‌కో తెచ్చుకుని తిరిగి డీడీగా బాధ్యతలు చేపట్టారు. సరెండర్‌ చేస్తే జీతాలు ఇవ్వడం కుదరని కొందరికి జీతాలు నిలిపేశారు. ఫిబ్రవరి 6న సిబ్బంది లోపలికి రాకుండా గేటుకు తాళం వేయడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. రెండురోజుల తేడాతో ఏడీ శ్రీధర్‌లింగారెడ్డి, ఇద్దరు అటెండర్లను సరెండర్‌ చేస్తూ డీడీ చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు జిల్లా అధికారులు చేరవేస్తూ వచ్చారు. అధికారుల మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని పరిష్కరించడంలో విఫలమయ్యారనే అపవాదును ఉన్నతాధికారులు ఎదుర్కొంటున్నారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో త్రిసభ్య కమిటీతో కూడిన నిజనిర్ధారణ కమిటీ వచ్చి అందరి నుంచి రాతపూర్వకంగా తీసుకుని వెళ్లింది. నెల్లూరు పశువైద్యాధికారి విచారణ జరిపారు. రెండు కమిటీలు వేర్వేరుగా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. తర్వాత డీడీ అచ్చెన్నను సస్పెండ్‌ చేస్తూ మార్చి 15న ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. వీపీసీ డీడీగా జిల్లా పశుంవర్ధకశాఖ అధికారి శారదమ్మను అదనపు బాధ్యతలు తీసుకోవాలని ఆదేశాలూ వచ్చాయి. అదే నెల 12న  అచ్చెన్న అదృశ్యమయ్యారు. 14న కుటుంబ సభ్యులు అయిదుగురిపై అనుమానం ఉందని కడప ఒకటో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న గువ్వలచెరువు ఘాట్‌లో శవమై కనిపించడంతో ఆయన హత్య ఉదంతం వెలుగు చూసింది. వృత్తిపరమైన విభేదాలను వ్యక్తిగతంగా తీసుకునే వరకు పరిస్థితి దారి తీసింది. ఉన్నతాధికారులు కూర్చుని సమస్యను సర్దుబాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే వాదన వినిపిస్తోంది.

పిలిచినప్పుడు రావాల్సిందే

కడప పశుసంవర్ధకశాఖ డీడీ అచ్చెన్న హత్యకేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారించగా వారిలో సుభాష్‌చంద్రబోస్‌ హత్య చేసినట్లు రుజువు కావడంతో అతనితో పాటు మరో ఇద్దరు బయట వ్యక్తులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరో ఇద్దరు ఉద్యోగులు ఆదివారం నుంచి పోలీసుల అదుపులోనే ఉన్నారు. వారిని పోలీసులు విభిన్న కోణాల్లో విచారించి సోమవారం సాయంత్రం విడిచిపెట్టారు. తిరిగి విచారణకు పిలిస్తే తప్పనిసరిగా రావాలని చెప్పి పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని