logo

హత్య కాదు... రోడ్డు ప్రమాదం

ఈ నెల 23న ప్రొద్దుటూరు మండలం అమృతనగర్‌లో చనిపోయిన వ్యక్తిది హత్య కాదని.. రోడ్డు ప్రమాదమని సీఐ యుగంధర్‌ తెలిపారు.

Published : 28 Mar 2023 03:14 IST

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీఐ యుగంధర్‌, పక్కన ఎస్సై సంజీవరెడ్డి, సిబ్బంది

ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఈ నెల 23న ప్రొద్దుటూరు మండలం అమృతనగర్‌లో చనిపోయిన వ్యక్తిది హత్య కాదని.. రోడ్డు ప్రమాదమని సీఐ యుగంధర్‌ తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు. గ్రామీణ ఠాణాలో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన కురవ రాముడు (42) ఈ నెల 22న జాతర సందర్భంగా కుటుంబ సమేతంగా అమృతనగర్‌లోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. అదే రోజు రాత్రి బయటికి వెళ్లిన రాము 23వ తేదీ తెల్లవారుజామున అమృతనగర్‌లోని 18వ వీధిలో శవమై కనిపించారు. గుర్తుతెలియని వ్యక్తులు తన భర్తను చంపారని మృతుడి భార్య జ్యోతి గ్రామీణ ఠాణాలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మండల పరిధిలోని నాగాయపల్లెకు చెందిన ట్రాక్టర్‌ చోదకుడు తలారి గురుప్రసాద్‌, ట్రాక్టర్‌ యజమాని తలారి బాలుడు, చెన్నమరాజుపల్లెకు చెందిన పాలంపల్లి చిన్న పోలయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. ముగ్గురు నిందితులు 23వ తేదీ తెల్లవారు జామున కుందూ నది నుంచి నల్లమట్టి తీసుకెళ్తుండగా అమృతనగర్‌ వద్దకు రాగానే ట్రాక్టర్‌ అదుపు తప్పి, అక్కడే ఇసుకపై నిద్రిస్తున్న రాముడిపై వాహన చక్రాలు ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు దర్యాప్తులో తేలిందని సీఐ తెలిపారు.  నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని