logo

నిమ్మ రైతు కన్నీరు

వేసవిలో నిమ్మ కాయలకు డిమాండు ఎక్కువ. గతేడాది ఒక్కో నిమ్మకాయ ధర రూ.10 పలికింది. ప్రస్తుతం డిమాండు ఉన్న తరుణంలో పేనుబంక, వేరుకుళ్లుతో చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి.

Published : 29 Mar 2023 04:03 IST

వేరుకుళ్లుతో నిలువునా ఎండుతున్న చెట్లు

న్యూస్‌టుడే, జమ్మలమడుగు: వేసవిలో నిమ్మ కాయలకు డిమాండు ఎక్కువ. గతేడాది ఒక్కో నిమ్మకాయ ధర రూ.10 పలికింది. ప్రస్తుతం డిమాండు ఉన్న తరుణంలో పేనుబంక, వేరుకుళ్లుతో చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. ఏటా ఈ-క్రాప్‌ చేయించుకుంటున్నా నష్టపోయిన వాటికి పరిహారం ఎందుకివ్వరని బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల పంటలకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టం జరిగితే ప్రభుత్వం పరిహారం ప్రకటిస్తోందని దీర్ఘకాలిక తోటలకు సైతం వర్తింపజేయాలని కోరుతున్నారు.

తెగుళ్లతో కలవరం...

నియోజకవర్గంలో జమ్మలమడుగు, మైలవరం, ముద్దనూరు, కొండాపురం తదితర మండలాల్లో నిమ్మ తోటలు విస్తారంగా ఉన్నాయి. జమ్మలమడుగు మండలం గండికోటలోనే సుమారు 20 వేల వరకు నిమ్మ చెట్లు ఉన్నాయి. రెండేళ్లుగా పేనుబంక, వేరుకుళ్లు తెగులు రైతులను కలవరపెడుతున్నాయి. ఎన్ని మందులు వాడినా అదుపులోకి రావడం లేదని రైతులు వాపోతున్నారు. కొమ్మలకు పేనుబంక వచ్చిన వెంటనే పూత రాలిపోతోందని చెబుతున్నారు. ఎండలు మండిపోతుండడంతో మార్కెట్‌లో నిమ్మ కాయలకు డిమాండు ఏర్పడింది. వెయ్యి కాయలు రూ.4 వేలు ధర పలుకుతోంది. ప్రతిరోజూ జమ్మలమడుగు ప్రాంతం నుంచి ప్రొద్దుటూరు, బెంగళూరుకు దిగుబడులు తరలిస్తున్నారు. ఇలాంటి సమయంలో వేరుకుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానశాఖాధికారులు పరిశీలించి తెగుళ్లను అరికట్టేవిధంగా సూచనలివ్వాలని కోరుతున్నారు.


వెయ్యి చెట్లు ఎండిపోయాయి
- నరసింహ, నిమ్మరైతు, గండకోట

నాకు గండికోటలో సుమారు 2 వేలకుపైగా నిమ్మ చెట్లు ఉన్నాయి. వేరుకుళ్ల్లు కారణంగా ఇప్పటివరకు వెయ్యి చెట్ల వరకు కోల్పోయాను. ఈ వేసవిలో ధర బాగుందనుకున్న సమయంలో తెగుళ్లతో చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి నష్టపోతున్న రైతులకు ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి.


ముందే గుర్తిస్తే అరికట్టవచ్చు
- భరత్‌రెడ్డి, ఉద్యానశాఖాధికారి, ప్రొద్దుటూరు

వేరుకుళ్లును ముందే పసిగడితే చెట్టు ఎండిపోకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ తెగులు ప్రారంభ దశలో ఆకులు వాడిపోతాయి ఆ సమయంలోనే ట్రైకోడెర్మావిరిడిని వంద కిలోల పశువుల ఎరువును అర కిలో ప్యాకెట్‌ను కలుపుకుని చెట్టు పాదులో వేయాలి.  పేనుబంకకు అయితే రోగర్‌ను రెండు ఎంఎల్‌ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని