logo

పెన్నా... ఇసుక తవ్వకాలు ఆపేనా?

ఇసుక... అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. అధికార పార్టీ నేతల అండతో కొందరు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పెన్నానది నుంచి భారీ ఎత్తున ఇసుక తరలిపోతున్నా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 29 Mar 2023 06:08 IST

గడువు ముగిసినా కొనసాగుతున్న అక్రమ రవాణా
నాయకుల అండతో చెలరేగిపోతున్న అక్రమార్కులు
న్యూస్‌టుడే, సిద్దవటం, కడప

జంగాలపల్లె వద్ద పెన్నాలో యంత్రంతో ఇసుక తవ్వకాలు

సుక... అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. అధికార పార్టీ నేతల అండతో కొందరు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పెన్నానది నుంచి భారీ ఎత్తున ఇసుక తరలిపోతున్నా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దవటం మండలం జంగాలపల్లె గ్రామసమీపంలోని పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో రహదారి ప్రమాదాలు జరుగుతుండడంతో సిద్దవటం మండలం జంగాలపల్లె గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. తెదేపా, జనసేన పార్టీల నాయకులు ప్రజల పక్షాన నిలిచి వాహనాలు అడ్డుకున్నారు. జంగాలపల్లె గ్రామసమీపంలోని పెన్నానదిలో ఏడాది కిందట అధికారికంగా ఇసుక క్వారీ ప్రారంభమైంది. ఆరంభం నుంచి క్వారీలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలొచ్చాయి. నదిలో సుమారు 15 అడుగుల లోతు వరకు యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపారు. లారీల్లో 30 టన్నులకుపైగా ఇసుక నింపి ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు ఆరోపణలున్నాయి. క్వారీ గడువు గతేడాది డిసెంబరులోనే ముగియడంతో గుత్తేదారు తవ్వకాలు నిలిపేసి వెళ్లిపోయారు. అనంతరం అధికార పార్టీ మండల నాయకులు రంగంలోకి దిగారు. యథావిధిగా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ప్రతి రోజూ సుమారు వంద టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం. పొలాలకు, తాగునీటి పథకాలకు సమీపంలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బిల్లులు, అనుమతుల్లేకుండానే వాహనాల్లో ఇసుక తరలిస్తున్నారు. ఈ నెల 21న స్థానిక మహిళలు కూలీ పనులకు ఆటోలో వెళ్తుండగా వేగంగా వస్తున్న ఇసుక టిప్పర్‌ ఢీకొంది. ప్రమాదంలో పలువురు మహిళలు గాయపడ్డారు. వీరిలో ఓ మహిళ కాలును వైద్యులు తొలగించారు. ఇసుక కోసం వచ్చే వాహనాలతో ప్రమాదాలు జరుగుతుండడంపై ప్రజలు ఆందోళన బాట పట్టారు.

ఇసుకలోడుతో వస్తున్న వాహనం


తెదేపా, జనసేన నాయకుల ఆందోళన

జనసేన పార్టీ యువ నాయకుడు అతికారి దినేష్‌కుమార్‌ స్థానికులతో కలిసి ఆందోళన చేశారు. ఇసుక తవ్వకాలను నిలిపేయాలని డిమాండు చేశారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు స్థానిక నాయకులు, గ్రామస్థులతో కలిసి పెన్నాను పరిశీలించారు. బిల్లులు చూపించాలని టిప్పర్లు, లారీల చోదకులను కోరగా లేవని సమాధానం చెప్పారు. క్వారీకి అనుమతి లేదనే అనుమానాలు కలుగుతున్నాయని నాయకులు స్పష్టం చేశారు. రెండు నెలల కిందటే క్వారీ గడువు ముగిసిందని, అయినప్పటికీ ఇసుక అక్రమ రవాణా జరుపుతుండడం దారుణమంటూ వాహనాలను అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పెన్నా వద్దకు రావడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. క్వారీకి అనుమతులు ఉన్నాయా లేవా అనేది విచారిస్తామని సీఐ చెప్పడంతో ఆందోళన విరమించారు.


గడువు ముగిసింది
- వెంకటేశ్వరరెడ్డి, డీడీ, గనులశాఖ

జంగాలపల్లె గ్రామంలో ఇసుక క్వారీ గడువు గతేడాది డిసెంబరుతో ముగిసింది. ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతి లేదు. ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే నివారించేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు చర్యలు తీసుకోవాలి.


చర్యలు తీసుకుంటాం
- ఉరుకుందమ్మ, సీఐ, ఎస్‌ఈబీ, సిద్దవటం

సిద్దవటం ఎస్‌ఈబీ పరిధిలో ఉండే మండలాల్లో ఇసుక అక్రమ రవాణా జరగకుండా నిఘా ఉంచాం. జంగాలపల్లెలోని పెన్నాలో గతంలో క్వారీకి అనుమతి ఉండేది. ప్రస్తుతం అనుమతి ఉందా లేదా అన్నది పూర్తి సమాచారం లేదు. సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకుని అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని