logo

పులివెందులలో పేలిన తూటా!

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐపై ఆరోపణలు చేసిన పులివెందులకు చెందిన భరత్‌కుమార్‌ యాదవ్‌ ఆదే సాకుతో పోలీసుల నుంచి తుపాకీ లైసెన్స్‌ తెచ్చుకోవడం సర్వత్రా  చర్చనీయాంశమైంది.

Updated : 29 Mar 2023 06:09 IST

దిలీప్‌ను తుపాకీతో కాల్చి చంపిన భరత్‌కుమార్‌యాదవ్‌
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మహబూబ్‌బాషా
భరత్‌కు గన్‌ లైసెన్స్‌ జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు
ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, పులివెందుల, కడప నేరవార్తలు, వేంపల్లె

వేంపల్లె ఆసుపత్రిలో దిలీప్‌ మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐపై ఆరోపణలు చేసిన పులివెందులకు చెందిన భరత్‌కుమార్‌ యాదవ్‌ ఆదే సాకుతో పోలీసుల నుంచి తుపాకీ లైసెన్స్‌ తెచ్చుకోవడం సర్వత్రా  చర్చనీయాంశమైంది. పులివెందుల్లో అల్పాహారశాలను నడుపుతూ జీవనం సాగిస్తున్న వ్యక్తికి పోలీసులు ఏ విధంగా తుపాకీ లైసెన్స్‌ ఇచ్చారనే దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివేకా హత్య కేసు నుంచే పులివెందులలో పేరు తెచ్చుకున్న భరత్‌కుమార్‌ యాదవ్‌ తుపాకీ ఉందన్న కారణంతో దందాలు.. సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోవడం, ఇతరత్రా లావాదేవీల్లో తలెత్తిన విభేదాలతో మంగళవారం దిలీప్‌ అనే వ్యక్తిని తుపాకితో కాల్చి చంపడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గ కేంద్రం పులివెందుల పట్టణానికి చెందిన భరత్‌కుమార్‌ యాదవ్‌ గతంలో యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరిగా పనిచేశాడు. స్థానిక ఆర్టీసీ బస్టాండు ఎదురుగా అల్పాహారశాలను నడుపుతున్నాడు. 2019, మార్చిలో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య అనంతరం అతని పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అది కూడా సీబీఐ విచారణ అనంతరం ఇతడి పేరు వార్తల్లో బాగా  వినిపించింది. తరచూ మీడియా సమావేశాలు నిర్వహించి సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడటం చేసేవాడు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న డ్రైవరు దస్తగిరిని సీబీఐ అధికారులు 2021, మార్చిలో దిల్లీకి విచారణకు పిలిచారు. ఆ సమయంలోనే మరో నిందితుడు శివశంకర్‌రెడ్డి సూచన మేరకు భరత్‌కుమార్‌యాదవ్‌ కూడా దిల్లీకి వెళ్లాడు. దస్తగిరితోపాటు వారంరోజులు దిల్లీలోనే ఉన్నాడు. దస్తగిరిని సీబీఐ ప్రశ్నించే విషయాలను తెలుసుకుని శివశంకర్‌రెడ్డికి చేరవేయడం భరత్‌కుమార్‌ యాదవ్‌ పని. దిల్లీ నుంచి దస్తగిరి తిరిగొచ్చిన అనంతరం అతడిని మరోసారి భరత్‌కుమార్‌ యాదవ్‌ కలిసి వైకాపా ముఖ్య నేతల పేర్లు చెప్పవద్దని, నీకు ఏం కావాలన్నా వారు చూసుకుంటారని భరోసాతో కూడిన బెదిరింపులకు దిగినట్లు దస్తగిరి సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు భరత్‌కుమార్‌యాదవ్‌ను కడపకు పిలిపించి ప్రశ్నించి అతడి వాంగ్మూలం నమోదు చేశారు.


సునీల్‌కుమార్‌యాదవ్‌కు సమీప బంధువు

వివేకా హత్య కేసులో ఏ-2 నిందితుడు సునీల్‌కుమార్‌యాదవ్‌కు సమీప బంధువైన భరత్‌కుమార్‌యాదవ్‌  మీడియా ముందు అనేకసార్లు సీబీఐ  అధికారులపై విమర్శలు చేయడమే కాకుండా పులివెందుల వైకాపా నేతలకు అనుకూలంగా మాట్లాడారు. వివేకా కేసు విచారణ అంశాన్ని సాకుగా చూపి తనకు తుపాకీ లైసెన్స్‌ కావాలని పోలీసులకు గతేడాది దరఖాస్తు చేసుకున్నాడు. అతని దరఖాస్తును స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు తిరస్కరించారు. వైకాపా ముఖ్య నేతల పలుకుబడితో. తుపాకీ లైసెన్స్‌ పొందినట్లు  సమాచారం.


దందాలు... దారుణాలు

భరత్‌కుమార్‌యాదవ్‌ తుపాకీతో పులివెందుల చుట్టుపక్కల ప్రాంతాల్లో భూదందాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.  రెండు నెలల కిందట తన అల్పాహారశాల పక్కన ప్రహరీ విషయంలో తుమ్మలపల్లికి చెందిన విశ్వనాథరెడ్డి, ప్రసాద్‌రెడ్డి కుటుంబాన్ని బెదిరించాడు.  కడప నగరంలోనూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పులివెందుల ప్రాంతంలో మట్కా జూదం నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో అప్పు తీర్చలేదనే కారణంతో మంగళవారం దిలీప్‌పై, అడ్డొచ్చిన మహబూబ్‌బాషాలపై తుపాకీతో కాల్పులు జరపడం.. వారిలో దిలీప్‌ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వేంపల్లె ప్రభుత్వాస్పత్రిలోని దిలీప్‌ మృతదేహాన్ని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. దిలీప్‌ బంధువులు వేంపల్లె ప్రభుత్వాసుత్రికి చేరుకుని బోరున విలపించారు. పట్టణ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.  


వడ్డీ డబ్బులివ్వలేదనే కాల్చి చంపాడు
- భాను, దిలీప్‌ భార్య

నల్లపురెడ్డిపల్లెకు చెందిన నాకు పులివెందులకు చెందిన దిలీప్‌తో రెండేళ్ల కిందట వివాహమైంది. మాకు అయిదు నెలల పాప ఉంది. నా భర్త మాంసం దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రెండేళ్ల కిందట నా భర్త దిలీప్‌ భరత్‌కుమార్‌యాదవ్‌ వద్ద రూ.50 వేలు అప్పు తీసుకున్నారు. ఈ మొత్తానికి వడ్డీ డబ్బులివ్వలేదన్న కారణంతో తుపాకీతో నా భర్తను కాల్చిచంపారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో నా భర్తకు ఫోన్‌చేసి ఇంటికి రాలేదని అడగ్గా డబ్బుల విషయమై భరత్‌తో గొడవైందని, తుపాకీతో కాల్చాడని చెప్పారు. మాకు ఆస్తి ఉంది.. మా అత్త కువైట్‌లో ఉంటుంది. అతడి వద్ద తీసుకున్న అప్పు చెల్లించేవాళ్లం. ఇవన్నీ గుర్తించకుండా భరత్‌కుమార్‌యాదవ్‌ నా భర్తను చంపి నన్ను, నా బిడ్డను అనాథలుగా చేశాడు.


ఆ గొడవతో నాకేమి సంబంధం లేదు
 - రాగిపాటి మహబూబ్‌బాషా, బాధితుడు  

భరత్‌కుమార్‌ యాదవ్‌, చింతకుంట దిలీప్‌ మధ్య డబ్బుల వ్యవహారంలో జరిగిన గొడవతో నాకెలాంటి సంబంధం లేదు. వారిద్దరూ ఘర్షణ పడుతున్న క్రమంలో భరత్‌కుమార్‌ యాదవ్‌ తుపాకీతో కాల్పులు జరపగానే దిలీప్‌ కుప్పకూలిపోయాడు. ఇదేంటని నేను అడిగేలోపే చంపేస్తానంటూ తుపాకీ చూపగానే భయంతో పారిపోయే ప్రయత్నించాను. ఆలోపలే కాల్పులు జరపడంతో నా చేయి, తొడ వెనుక భాగంలో గాయాలయ్యాయి. కాల్పుల విషయమై అడిగినందుకు నాపై దాడి చేయడం దారుణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని