logo

నా బిడ్డను అన్యాయంగా చంపేశారు

‘నా బిడ్డకు ఏపాపం తెలియదు.. నా బిడ్డ సొమ్మే భరత్‌కుమార్‌యాదవ్‌ తిన్నారు. అతను తుపాకీ తీసుకుని తిరిగేందుకు అధికారం ఎవరిచ్చారు? నాకు కడపుకోత మిగిల్చిన అతన్ని నడిరోడ్డులో ఉరితీయించండి జగన్‌ సార్‌’ అంటూ చింతకుంట దిలీప్‌ తల్లి మస్తానమ్మ బుధవారం విలపించారు.

Published : 30 Mar 2023 04:25 IST

దిలీప్‌ తల్లి మస్తానమ్మ ఆవేదన

విలపిస్తున్న దిలీప్‌ తల్లి మస్తానమ్మ, పక్కన కుటుంబ సభ్యులు

వేంపల్లె, పులివెందుల, న్యూస్‌టుడే : ‘నా బిడ్డకు ఏపాపం తెలియదు.. నా బిడ్డ సొమ్మే భరత్‌కుమార్‌యాదవ్‌ తిన్నారు. అతను తుపాకీ తీసుకుని తిరిగేందుకు అధికారం ఎవరిచ్చారు? నాకు కడపుకోత మిగిల్చిన అతన్ని నడిరోడ్డులో ఉరితీయించండి జగన్‌ సార్‌’ అంటూ చింతకుంట దిలీప్‌ తల్లి మస్తానమ్మ బుధవారం విలపించారు. తుపాకీ కాల్పుల్లో మృతిచెందిన దిలీప్‌ మృతదేహానికి బుధవారం వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో కడప సర్వజన ఆసుపత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. కువైట్‌లో ఉంటున్న దిలీప్‌ తల్లి మస్తానమ్మ వేంపల్లె ఆసుపత్రికి వచ్చి కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. భరత్‌కు రూ.50 వేలు ఇవ్వాలని ఫోన్‌ చేస్తే శుక్రవారం వేస్తానని కొడుకుకు చెప్పానని, అంతలోనే చంపేశారని వాపోయారు.

* పులివెందులలో ఉద్రిక్తత : భరత్‌కుమార్‌ యాదవ్‌కు ఉరిశిక్ష పడేలా చూసి, తమకు న్యాయం చేయాలని దిలీప్‌ భార్య భాను, కుటుంబ సభ్యులు పులివెందులలో ఆందోళన చేపట్టారు. శవపరీక్ష అనంతరం దిలీప్‌ మృతదేహాన్ని పట్టణంలోని నగరిగుట్టవీధిలో ఉన్న ఆయన నివాసం వద్దకు తీసుకొచ్చారు. నిందితుడి ఇంటి వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్లి ధర్నా చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు సిద్ధమయ్యారు. పులివెందుల రూరల్‌ సీఐ బాల మద్దిలేటి, ఎస్సైలు హుసేన్‌, చిరంజీవి అక్కడికి చేరుకున్నారు. పోలీసులతో బాధితులు వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. న్యాయం చేస్తామని, నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని పోలీసులు చెప్పడంతో శాంతించారు. పులివెందుల మండలం ఎర్రిపల్లె గ్రామంలో దిలీప్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని