logo

పది పరీక్షలకు సన్నద్ధం

జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలల్లో 29,003 మంది విద్యార్థులు పదోతరగతి విద్యనభ్యసిస్తున్నారు.

Published : 30 Mar 2023 04:25 IST

కడప గాంధీనగర్‌ నగరపాలక ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులు

 న్యూస్‌టుడే, కడప విద్య: జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలల్లో 29,003 మంది విద్యార్థులు పదోతరగతి విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. విద్యాశాఖ జిల్లా అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో జనవరి నుంచి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. రోజూ ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకూ అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. సబ్జెక్టు ఉపాధ్యాయులను నిర్దేశిత సమయాల వారీగా పదోతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో జిల్లా విద్యాశాఖాధికారులు ముందుకెళ్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్లు పరీక్షలకు దూరమైన విద్యార్థులు, గత విద్యా సంవత్సరం నుంచి పరీక్షలు రాస్తున్నారు. గతంలో 11 పరీక్షలు నిర్వహించేవారు. కరోనా సమయంలో ఆ పేపర్లను ఏడింటికి కుదించారు. ఏడు పేపర్లలో సైన్స్‌ను ఫిజికల్‌ సైన్స్‌, నేచురల్‌ సైన్స్‌ కింద నిర్వహించేవారు. రెండు పేపర్లను ఒకే పేపర్‌గా చేస్తూ ఆరు పరీక్షలకు కుదించారు. గతేడాది 71.03 శాతం ఫలితాలొచ్చాయి. ఈ ఏడాది రాష్ట్రంలో ప్రథమస్థానం సాధించాలని ముందస్తు ప్రణాళిక రూపొందించి అమలు చేసినట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. విద్యార్థులు పరీక్షలు రాయడానికి జిల్లా వ్యాప్తంగా 146 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కేంద్రాల్లో బల్లల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని, ఇతర అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెబుతున్నారు.


ఉత్తమ ఫలితాల సాధనకు చర్యలు  - రాఘవరెడ్డి, డీఈవో

పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాం. జనవరి నుంచి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలవుతోంది. సబ్జెక్టు ఉపాధ్యాయులు వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నమూనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని