logo

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీరామనవమి పండగ వేడుకలను గురువారం నుంచి నిర్వహించాలని తితిదే అధికారులు నిర్ణయించారు.

Published : 30 Mar 2023 04:25 IST

పురుషోత్తముడి క్షేత్రం పుష్ప శోభితం
దేదీప్యంగా ఆలయ పరిసరాలు

విద్యుత్తు వెలుగుల్లో కోదండరాముడి ఆలయం

ఒంటిమిట్ట, జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీరామనవమి పండగ వేడుకలను గురువారం నుంచి నిర్వహించాలని తితిదే అధికారులు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. రామయ్య క్షేత్రాన్ని రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించారు. పుష్పాలతో తయారు చేయించి తూర్పు ద్వారం వద్ద ఏర్పాటు చేసిన శ్రీరామచంద్రుడు, హనుమాన్‌ ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ ప్రాకారం విద్యుత్తు దీపకాంతుల వెలుగుల్లో ప్రకాశిస్తోంది. భక్త సంజీవరాయస్వామి ఆలయం, అన్నప్రసాద కేంద్రం నుంచి పరిపాలన భవనం వరకు రంగురంగుల దీపాలతో అలంకరించారు. శృంగిశైలం గుట్టకు దీప కాంతుల శోభ తీసుకొచ్చారు. భక్తులకు అన్నప్రసాదం వితరణ చేయాలని భారీ ఏర్పాట్లు చేశారు.

సీతారామలక్ష్మణమూర్తులు


ఉత్సవాలు సాగేదిలా...

శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం అంకురార్పణ చేయనున్నారు. గురువారం ఉదయం సుప్రభాతం, ఆలయ శుద్ధి, అలంకరణ, ఆరాధన, అర్చన, సర్వదర్శనం, 10 గంటలకు శ్రీరామనవమి ఆస్థానం, స్నపన తిరుమంజనం, సాయంత్రం బ్రహ్మోత్సవాల నిర్వహణకు అంకురార్పణ క్రతువు జరుగనుంది. మార్చి 31న ధ్వజారోహణం, శేష వాహనం, ఏప్రిల్‌ 1న  వేణు గానాలంకారం, హంస వాహనం, 2న వటపత్రశాయి అలంకారం, సింహ వాహనం, 3న నవనీతకృష్ణాలంకారం, హనుమత్సేవ, 4న మోహినీ అలంకారం, గరుడ సేవ, 5న శివధనుర్భాణాలంకారం, గజ వాహనం, 6న రథోత్సవం, 7న కాళీయమర్ధనాలంకారం, అశ్వ వాహనం, 8న చక్రస్నానం, ధ్వజావరోహణం, 9న పుష్పయాగం, ఏకాంత సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.


కట్టుదిట్టమైన బందోబస్తు

బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐలు పురుషోత్తమరాజు, హనుమంతనాయక్‌ తెలిపారు. రామయ్య క్షేత్రం పరిసర ప్రాంతాలను బుధవారం పరిశీలించారు. భద్రత విధులు నిర్వహించడానికి వచ్చిన పోలీస్‌ అధికారులు, సిబ్బందితో హరిత కల్యాణ మండపంలో సమావేశాన్ని నిర్వహించారు. భక్తులతో గొడవ పెట్టుకోరాదని, భక్తిభావంతో సేవలందించాలని సూచించారు.


మిగిలిన పనులు పూర్తి చేయండి

సీతారాముల కల్యాణోత్సవం కోసం చేపడుతున్న ఏర్పాట్లలో మిగిలిన పనులను శరవేగంగా పూర్తి చేయాలని తితిదే ఎస్‌ఈ పి.జగదీశ్వర్‌రెడ్డి ఆదేశించారు. సీతారాముల కల్యాణ వేదిక, పరిపాలన, విశ్రాంతి భవనం, అన్నప్రసాద వితరణ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. అన్నదానం ప్రత్యేక అధికారి శాస్త్రి, ఈఈ సుమతితో చర్చించారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు.


ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవానికి అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండేలా చూడాలని జేసీ సాయికాంత్‌వర్మ ఆదేశించారు. బుధవారం కడప కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఏప్రిల్‌ 5న సీతారాముల కల్యాణం జరగనుందని, కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే అవకాశం ఉందన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రముఖులు వస్తారన్నారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. భద్రత, పార్కింగ్‌, అన్న ప్రసాదాల వితరణ, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్తు సరఫరా, ప్రథమ చికిత్స కేంద్రాలు తదితర వాటికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో గంగాధర్‌గౌడ్‌, ట్రైనీ కలెక్టర్‌ రాహుల్‌మీనా, ఆర్డీవోలు ధర్మచంద్రారెడ్డి, వెంకటరమణ, జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని