logo

మత్తుపదార్థాల రహిత జిల్లాగా మార్చాలి : కలెక్టర్‌

జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశించారు.

Updated : 30 Mar 2023 06:54 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయరామరాజు, పక్కన ఎస్పీ అన్బురాజన్‌, అధికారులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో మత్తు పదార్థాల నివారణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపై ఎస్పీ అన్బురాజన్‌, సెంట్రల్‌ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ మాధురితో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.  మత్తు పదార్థాలతో జరిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆశా, మహిళా పోలీసు, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తల సహకారంతో మత్తు పదార్థాల వినియోగంపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో గంగాధర్‌గౌడ్‌,  కమిషనర్‌ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌, ఆర్డీవోలు పాల్గొన్నారు. మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే మత్స్య సంపద యోజన అందేలా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. మత్స్య సంపద యోజనపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 32 మంది లబ్ధిదారులను మినీ ఫిషరీస్‌ రిటైల్‌ అవుట్‌లెట్ల ఏర్పాటుకు ఎంపిక చేశామని, మరో 15 మందిని మోపెడ్‌ విత్‌ఐస్‌బాక్స్‌ కలిగిన మూడు, నాలుగు చక్రాల వాహనాలకు ఎంపికచేసినట్లు వివరించారు. రూ.10 లక్షలు, రూ.20 లక్షల విలువ చేసే కియోస్క్‌లను ప్రారంభించనున్నామన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ డీడీ నాగలింగాచార్యులు, జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి, డీఏవో నాగేశ్వరరావు, ఎల్డీఎం దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు. జిల్లా ఆర్థిక ప్రగతికి పరిశ్రమలు ముఖ్యమని ఆ దిశగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. బుధవారం కడప కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో జిల్లా పరిశ్రమల ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలోని అన్ని సెక్టార్లకు సంబంధించి 81 యూనిట్లకు రూ.9.47 కోట్ల మేర రాయితీకి కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజరు జయలక్ష్మీ , ఏపీఐఐసీ జోనల్‌ మేనేజరు శ్రీనివాసమూర్తి, డీపీవో ప్రభాకర్‌రెడ్డి, డీసీఐ కృష్ణమూర్తి, ఎల్డీఎం దుర్గాప్రసాద్‌, పీసీబీ ఈఈ జావిద్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని