logo

పర్యవేక్షణ లోపంతో భక్తులకు అవస్థలు

కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని తితిదే, జిల్లా అధికారులు తరచూ సమీక్ష సమావేశాలు, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Published : 31 Mar 2023 01:38 IST

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే : కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని తితిదే, జిల్లా అధికారులు తరచూ సమీక్ష సమావేశాలు, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మునుపటి లోపాలు పునరావృతం కారాదు. గత తప్పిదాలు ఈసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నత స్థాయిలో మార్గనిర్దేశం చేశారు. అయినా అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపం, పర్యవేక్షణ లేమితో సామాన్య భక్తులకు అవస్థలు తప్పడం లేదు. అధికార యంత్రాంగం తీరును సాధారణ సందర్శకులు తప్పు పడుతున్నారు. ఆలయ దర్శనం కోసం వచ్చే వారిని దక్షిణ గోపురం ద్వారం నుంచి లోపలికి క్యూలైన్ల ద్వారా పంపించాలని ప్రణాళికను రూపొందించారు. వీవీఐపీ, వీఐపీలను మాత్రమే తూర్పు గోపురం నుంచి తీసుకురావాలని నిర్ణయించారు. అయితే చాలామంది రాజగోపురం నుంచి రాములోరి సన్నిధిలోకి ప్రవేశించారు. అడ్డగోలుగా లోపలికి వస్తున్నా పెద్దగా నియంత్రించలేదు. తితిదే పరిపాలన, విజిలెన్సు, పోలీస్‌, జిల్లా అధికారుల మధ్య సమన్వయం కనిపించడంలేదు. మజ్జిగ, తాగునీరు పొట్లాలను బస్తాలకొద్దీ తెప్పించినా భక్తులకు సక్రమంగా అందజేయలేదు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వేర్వేరుగా వచ్చినప్పుడు అనుచరులు, అధికారులు భారీ సంఖ్యలో వారిని అనుసరించారు. మండల, డివిజన్‌, జిల్లా స్థాయి అధికారులు, వారి బంధువులు, మిత్రులు రావడంతో నేరుగా పంపిచారు. ఇలా చేయడంతో మిగతా వారంతా అసౌకర్యానికి గురయ్యారు. గతంలో అంకురార్పణ చేసిన మరుసటి రోజు శ్రీరామనవమి, ధ్వజారోహణం, పోతన జయంతి కార్యక్రమాలు జరిగేవి. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఒకరోజు నవమి, తర్వాత ధ్వజారోహణం నిర్వహించడంపై భక్తులు పెదవివిరుస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని