logo

నేర వర్తలు

బస్సు టైరుకు గాలి నింపే క్రమంలో ప్రమాదవశాత్తు పగలడంతో పక్కనే ఉన్న యువకుడు చనిపోయిన ఘటన జమ్మలమడుగులో చోటు చేసుకుంది.

Published : 31 Mar 2023 01:57 IST

గాలి నింపుతుండగా టైరు పగిలి యువకుడి మృతి

చనిపోయిన బాలయ్య

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: బస్సు టైరుకు గాలి నింపే క్రమంలో ప్రమాదవశాత్తు పగలడంతో పక్కనే ఉన్న యువకుడు చనిపోయిన ఘటన జమ్మలమడుగులో చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు రోడ్డులోని గాలి మిషన్‌లో బాలయ్య (23) అనే యువకుడు కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. బాధితుడికి తల్లిదండ్రులు లేరు. నానమ్మ వద్ద ఉంటూ గాలి మిషన్‌ యజమాని గురుస్వామి దుకాణంలో పని నేర్చుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గురువారం సాయంత్రం టైరుకు యజమాని గాలిని నింపుతూ వేరే పనిలో నిమగ్నమై ఉండగా... సమయానికి చూసుకోక పోవడంతో ఒక్కసారిగా పేలిందని చెప్పారు. పక్కనే నిలబడి ఉన్న బాలయ్య ఆ గాలికి ఎగిరి కిందపడగా తలకు, శరీరానికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వెంటనే 108 వాహనంలో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారన్నారు. తల్లిదండ్రులు లేక పోవడంతో బంధువులు ఇంకా రాలేదని వారు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు.


చెరువులో పడి బాలుడు...

మృతి చెందిన జయంత్‌

కంటేవారిపల్లె (కురబలకోట), న్యూస్‌టుడే : మండలంలో ఎర్రబల్లి పంచాయతీ కంటేవారిపల్లె సమీపంలోని రాయునిచెరువులో పడి ప్రమాదవశాత్తు ఓ బాలుడు మృతి చెందిన ఘటన గురువారం సాయంత్రం జరిగింది. గ్రామస్థుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రంలోని ముళబాగిలుకు చెందిన జయంత్‌ (13) కంటేవారిపల్లెలోని తన చిన్నమ్మ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో చిన్నమ్మతో కలసి సాయంత్రం బోరు బావి వద్దకు వెళ్లాడు. తిరిగి చిన్నమ్మ పిల్లలతో కలసి వస్తుండగా, సమీపంలోనే చెరువు కనపడింది. అనంతరం చెరువు వద్దకెళ్లి చెరువులో ఈతకు దిగి, ఊపిరాడక మునిగి పోయాడు. ఎంతకు బాలుడు రాకపోవడంతో కంగారు పడ్డ చిన్నమ్మ పిల్లలు విషయాన్ని వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్థులతో కలసి చెరువులోకి దిగి బాలుడిని బయటకు తీయగా, అప్పటికే బాలుడు చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. బాలుడి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. అనంతరం బాలుడి శవాన్ని ముళబాగిలుకు తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై పోలీసులను సంప్రదించగా, తమకెలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.


రైల్వే వంతెన కింద గుర్తుతెలియని మృతదేహం

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: మండలంలోని తుమ్మనగుట్ట గ్రామం మల్లూరివారిపల్లె సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కింద రైల్వే ట్రాక్‌ వద్ద కుళ్లిపోయిన దశలో ఓ గుర్తు తెలియని వ్యక్తి శవం ఉన్నట్లు గుర్తించి బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగైదు రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చునని, మృతదేహంపై ఉన్న దుస్తుల వివరాలను పేర్కొంటూ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. మృతుని గుర్తు పట్టిన ఎడల మదనపల్లె డీఎస్పీ, మదనపల్లె రూరల్‌ సీఐ, బి.కొత్తకోట ఎస్సైలకు సమాచారం అందించి దర్యాప్తునకు సహకరించాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని