logo

ఆకాశాన్నంటిన బహుళంతస్తుల అక్రమాలు

వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని నగర, పురపాలక సంస్థల పరిధిలో బహుళంతస్తుల నిర్మాణాల అక్రమాలు ఆకాశాన్నంటుతున్నాయి.

Published : 31 Mar 2023 02:12 IST

చర్యలు చేపట్టని పట్టణ ప్రణాళిక విభాగం
న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు పట్టణం

ప్రొద్దుటూరులో నోటీసులిచ్చిన భవనం

వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని నగర, పురపాలక సంస్థల పరిధిలో బహుళంతస్తుల నిర్మాణాల అక్రమాలు ఆకాశాన్నంటుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మిస్తున్నా సచివాలయ వార్డు ప్లానింగ్‌ కార్యదర్శులు నోటీసులకే పరిమితమవుతున్నారు. ఇలాంటి నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక విభాగంలోని కీలకాధికారులు, పాలనాధికారులు, అధికార పార్టీలోని కొందరు నాయకులు ప్రోత్సాహం అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైయస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు పట్టణంలో బహుళంతస్తుల నిర్మాణాలు ఇష్టానుసారంగా జరుగుతున్నాయి. వార్డు సచివాలయ ప్లానింగ్‌ కార్యదర్శులు నోటీసులిచ్చినా నిర్మాణాలు ఆగకపోవడం గమనార్హం. రహదారి విస్తీర్ణాన్ని బట్టి బహుళంతస్తులను నిర్మించాలన్న నిబంధన క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. 18 మీటర్ల ఎత్తులో నిర్మాణాలు జరిపితే ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు తెలిపారు. అదనపు నిర్మాణానికి భవన యజమాని ప్రయత్నించినా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు భవన క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్‌) కింద దరఖాస్తు చేయమని టౌన్‌ప్లానింగ్‌ అధికారులే ఆ భవన యజమానులకు సూచిస్తుండడం గమనార్హం. ఇక్కడ వైఎంఆర్‌కాలనీ సాయికుటీర్‌ రోడ్డు, 4వ సచివాలయ పరిధిలో, మడూరుకాలువ దారిలో ఓ నిర్మాణంలో నిర్దేశించిన ప్లానింగ్‌ కన్నా ఒక అంతస్తును అధికంగా నిర్మిస్తున్నారు. వీటికి నోటీసులను జారీ చేసినట్లు ఆ వార్డు ప్లానింగ్‌ కార్యదర్శి తెలిపారు. వైఎంఆర్‌కాలనీలో సాయిబాబా దేవాలయం సమీపంలో అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదని ఇటీవల జరిగిన ప్రొద్దుటూరు కౌన్సిల్‌ సభా భవనంలో పట్టణ ప్రణాళికాధికారిని సభ్యులు ప్రశ్నించారు. సెట్‌బ్యాక్‌ లేని వాటికి అదనపు అంతస్తు నిర్మిస్తున్నా ఎందుకు చర్య చేపట్టలేదని కౌన్సిల్‌ సైతం ప్రశ్నించింది. ఇదే అంశంపై ఇటీవల జరిగిన సమావేశంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని పట్టణ ప్రణాళికాధికారిని ప్రశ్నించగా నోటీసులు జారీ చేశామని జవాబిచ్చారు.  ఈ అదనపు అంతస్తుకు భవన యజమాని విజయ వాడ టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు టీడీఆర్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు  ఓ అధికారి చెప్పారు.

* అన్నమయ్య జిల్లా మదనపల్లె పురపాలక సంఘంలో సొసైటీ కాలనీ, రామిరెడ్డిలేఅవుట్‌, రెడ్డప్పనాయుడు కాలనీ తదితర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా బహుళంతస్తులు నిర్మిస్తున్నారు. ఈ పురపాలకలో అన్ని నిర్మాణాలను కలిపి 150 మందికి నోటీసులను జారీ చేశారు. కడప నగర పాలక సంస్థలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.


నిబంధనల మేరకే నిర్మించాలి
- దేవికుమారి, ఆర్జేడీ, పట్టణ ప్రణాళిక విభాగం, అనంతపురం

బహుళంతస్తుల భవన నిర్మాణాలు నిబంధనల మేరకు చేపట్టాలి. 300 చదరపు మీటర్ల స్థలంలోపు రెండంతస్తుల కట్టడం ఉండాలి. అదనంగా భవనాన్ని నిర్మించకూడదు. ప్రస్తుతం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ విభాగాధికారులు ఈ నిబంధనలను పరిశీలిస్తున్నారు. ఆ అధికారులు, కమిషనర్లు నోటీసులిచ్చినా నిర్మిస్తుంటే వాటిని తొలగించాలి. బీపీఎస్‌ పథకం ప్రస్తుతం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని