logo

కడప ముఠా... దోపిడీ బాట

లోకాయుక్త పేరుతో ఉన్నతాధికారులను బెదిరించి, నగదు గుంజుకుని మోసాలకు పాల్పడుతున్న కడప నగరానికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు బెంగళూరు నగర పడమటి విభాగం డీసీపీ కృష్ణకాంత్‌ ప్రకటించారు.

Updated : 31 Mar 2023 02:37 IST

బెంగళూరు పోలీసుల అదుపులో నిందితులు

సిద్ధాపుర పోలీసులు అరెస్టు చేసిన నిందితులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : లోకాయుక్త పేరుతో ఉన్నతాధికారులను బెదిరించి, నగదు గుంజుకుని మోసాలకు పాల్పడుతున్న కడప నగరానికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు బెంగళూరు నగర పడమటి విభాగం డీసీపీ కృష్ణకాంత్‌ ప్రకటించారు. కడపకు చెందిన నాగేశ్వరరెడ్డి, బుచ్చుపల్లి వినీత్‌కుమార్‌, శివకుమార్‌లను బెంగళూరులోని సిద్ధాపుర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు శ్రీనాథ్‌రెడ్డి కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలిస్తోంది. బెంగళూరు, హైదరాబాద్‌. అనంతపురం ప్రాంతాల్లో వీరిపై 32 కేసులు ఉన్నట్లు గుర్తించారు. కృష్ణకాంత్‌ అందించిన సమాచారం ప్రకారం.. ఈ నెల 20న కర్ణాటక పరిశ్రమల అభివృద్ధి మండలి (కేఐఏడీబీ) పట్టణ ప్రణాళిక విభాగం సంయుక్త సంచాలకుడు ఆశా సురేష్‌కు నిందితుడు నాగేశ్వరరెడ్డి మారుపేరు (అశోక్‌రావు)తో ఫోన్‌ చేశారు. తాను లోకాయుక్త అధికారినంటూ బెదిరించాడు. అక్రమ ఆస్తులు కూడపెట్టారనే ఫిర్యాదు వచ్చిందని, ఏక్షణంలోనైనా మీ ఇంటిపై దాడులు చేస్తామని హెచ్చరించాడు. దాడులు చేయకుండా ఉండాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండు చేశాడు. ఆ మాటలకు భయపడిన ఆమె నిందితులతో బేర మాడి రూ.లక్ష నగదును బ్యాంకు ద్వారా అతడి ఖాతాలో జమ చేశారు. నగదు వచ్చిన తక్షణం నిందితుడు ఫోన్‌ పని చేయకుండా బంద్‌ చేయడంతో అనుమానం వచ్చిన ఆమె సిద్ధాపుర పోలీసు ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ హనుమంత కె.భజంత్రి నేతృత్వంలో బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఆ నిందితులు ఓ రైలులో హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు సమాచారం రావడంతో సిటీ రైల్వేస్టేషన్‌లో కాపు కాశారు. అక్కడే నిందితులను అరెస్టు చేశారు. నిందితుడు నాగేశ్వరరెడ్డి కడపలోని ఓ కళాశాలలో మైనింగ్‌ డిప్లొమా పూర్తి చేసి 2007లో రైల్వేశాఖలో సెక్షన్‌ ఇంజినీరుగా చేరాడని పోలీసులు గుర్తించారు. రెండేళ్లు పని చేసిన తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగంలో చేరాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఆ ఉద్యోగానికీ రాజీనామా చేశాడు. స్నేహితులతో కలిసి నేరాలకు పాల్పడటం ప్రారంభించాడు. 2010లో అనంతపురంలో విదేశీ ట్రావెల్స్‌ టికెట్‌ బుకింగ్‌ చేస్తానని పలువురు ప్రయాణికులను మోసగించాడు. ఆ వ్యక్తిపై అనంతపురం వన్‌టౌన్‌ పోలీసు ఠాణాలో తొమ్మిది కేసులు నమోదైనట్లు డీసీపీ కృష్ణకాంత్‌ తెలిపారు. 2013లో ఏటీఎం కార్డుల పిన్‌ నెంబర్లను వినియోగదారులకు తెలియకుండా సేకరించి లక్షలాది రూపాయలు డ్రా చేసి మోసగించిన 20 కేసులు హైదరాబాద్‌ సీఐడీ విభాగం నమోదు చేసిందన్నారు. నిందితుడు నాగేశ్వరరెడ్డికి ఏడు భాషల్లో ప్రావీణ్యం ఉండటంతో బెంగళూరు నగరంలో ప్రభుత్వోద్యోగులను లక్ష్యంగా చేసుకుని లోకాయుక్త, సీఐడీ అధికారుల పేర్లతో ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడి మోసాలకు తెగిస్తున్నట్లు డీసీపీ వివరించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని