logo

హంద్రీనీవా పూడ్చేసి... మట్టినంతా దోచేసి!

వేలు కాదు... లక్షలు కాదు... కోట్ల రూపాయలు ఖర్చు చేసి తవ్విన హంద్రీనీవా కాలువను కొందరు అక్రమార్కులు తమ వ్యక్తిగత పనులకు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు.

Published : 31 Mar 2023 02:25 IST

కాలువగట్టు మీదుగా అడ్డగోలుగా రవాణా
కొరవడిన అధికార యంత్రాంగం పర్యవేక్షణ
న్యూస్‌టుడే, మదనపల్లె  పట్టణం, గ్రామీణ

గుట్టను తవ్వేసి చదును చేయడానికి తరలించిన మట్టి

వేలు కాదు... లక్షలు కాదు... కోట్ల రూపాయలు ఖర్చు చేసి తవ్విన హంద్రీనీవా కాలువను కొందరు అక్రమార్కులు తమ వ్యక్తిగత పనులకు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. కరవు ప్రాంతమైన రాయల సీమను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి ఈ ప్రాంతానికి హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణాజలాలు తరలించింది. కొంతమంది స్వార్థపరులు పది మందికి ఉపయోగపడే కాలువను ఎక్కడపడితే అక్కడ తవ్వేసి లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు.

హంద్రీనీవా కాలువ మదనపల్లె మండలం కాట్లాటపల్లె వద్ద ప్రవేశించి పట్టణ శివారు ప్రాంతం చిప్పిలి, అంకిశెట్టిపల్లె, కొత్తపల్లెను ఆనుకుని బసినికొండ పక్కగా వెళుతుంది. బసినికొండ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో 150వ మైలురాయి సమీపంలో అటవీ ప్రాంతంలో కాలువను కొందరు అక్రమార్కులు తవ్వేశారు. కాలువను తవ్వే సమయంలో అధికారులు కొన్ని సాంకేతికపరమైన జాగ్రత్తలు పరిగణనలోకి తీసుకుని నిర్మాణం చేపట్టారు. ఇలాంటి కాలువను తవ్వేసి వాహనాలు అటువైపు నుంచి ఇటువైపునకు వెళ్లే విధంగా కాలువకు అడ్డంగా రహదారి ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం కాలువ దయనీయ దుస్థితికి చేరుకుంది. వర్షాలొస్తే కాలువ మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. కాలువ పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి రహదారిని నిర్మించుకుని అక్కడ నుంచి మట్టిని యంత్రాలతో తవ్వేసి భారీ టిప్పర్లతో రవాణా చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరపరాదని కఠిన నిబంధనలున్నప్పటికీ దాన్ని పక్కనపెట్టి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. ప్రశ్నించే వారు లేకపోవడంతో కొంతమంది ప్రకృతి వనరులను నాశనం చేస్తున్నారు.

హంద్రీనీవా కాలువను పూడ్చి గుట్టలోకి నిర్మించిన రహదారి


నిర్వహణపై నిర్లక్ష్యం

హంద్రీనీవా సుజల స్రవంతి కాలువను పూర్తి చేసి మూడుసార్లు ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తరలించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఒకసారి నీటిని తీసుకురాగా. అనంతరం కాలువ పూర్తి నిరాదరణకు గురైంది. నీళ్లు విడుదల సమయంలో మాత్రమే అధికారులు కాలువ నిర్వహణపై ఆసక్తి చూపుతున్నారు. మిగిలిన సమయంలో పట్టించుకోవడంలేదు. దీంతో అక్రమార్కులు కాలువను ధ్వంసం చేసి తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు.


ఎలాంటి అనుమతుల్లేవు
- రాజగోపాల్‌, ఎస్‌ఈ, హంద్రీనీవా

హంద్రీనీవా కాలువ తవ్వుకుని రహదారి నిర్మించుకోవడానికి ఎలాంటి అనుమతులివ్వలేదు. కాలువను ఎవరైనా తవ్వినట్లయితే చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మట్టి తవ్వకాలకు అనుమతులిచ్చేది లేదు. డీఈతో క్షేత్రస్థాయిలో విచారణ చేయించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని