logo

కోదండరామా.. మనసాస్మరామి

ఒంటిమిట్ట కోదండరామాలయంలో గురువారం శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. రామయ్య క్షేత్రం నవమి శోభతో తేజోవంతంగా ప్రకాశించింది.

Published : 31 Mar 2023 02:31 IST

జగదభిరాముడి ప్రభ... జగమంతా శోభ
పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మేడా

భక్తులకు దర్శనమిచ్చిన సీతారామలక్ష్మణమూర్తులు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే : ఒంటిమిట్ట కోదండరామాలయంలో గురువారం శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. రామయ్య క్షేత్రం నవమి శోభతో తేజోవంతంగా ప్రకాశించింది. గర్భాలయంలో సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో జయ విజయల నుంచి మహా లఘుదర్శనం కల్పించారు. నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తితిదే ఏర్పాటు చేసిన వడపప్పు, పానకం పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి సతీసమేతంగా హాజరై స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముత్యాల తలంబ్రాల తయారీ పూజల్లో వారు పాల్గొన్నారు. శ్రీవారి సేవకులు 300 మందికి పైగా హాజరయ్యారు. కోలాట బృందాల ప్రదర్శన ఆకట్టుకుంది. రంగ మండపంలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్‌ భట్టార్‌ పర్యవేక్షణలో స్నపన తిరుమంజనం క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీఈ హరినారాయణరెడ్డి, ఎస్‌ఈలు మల్లికార్జునరెడ్డి, శ్రీనివాసులు, ఈఈ వెంకట్రామయ్య, డిప్యూటీ ఈవో నటేష్‌బాబు పాల్గొన్నారు.

పట్టువస్త్రాలతో వస్తున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి,  జడ్పీ ఛైర్మన్‌ అమరనాథ్‌రెడ్డి తదితరులు


తొలిరోజు 85 వేల ప్యాకెట్లు తయారీ

కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 5న నిర్వహించే సీతారాముల కల్యాణం తిలకించడానికి తరలిరానున్న భక్తులకు స్వామివారి ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేయాలని తితిదే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈసారి 1.75 లక్షల ప్యాకెట్లు సిద్ధం చేయాలని అనుమతిచ్చారు. శ్వేత డైరెక్టరు ప్రశాంతి పర్యవేక్షణలో తితిదే యాత్రికుల వసతి భవన సముదాయంలో శ్రీవారి సేవకుల ద్వారా 85 వేల ప్యాకెట్లు గురువారం తయారు చేయించారు. ప్రతి కవరులో అక్షింతలు, కంకణం, ముత్యం వేసి నింపారు. ఈ ఏడాది గ్యాలరీలోకి వెళ్లే సమయంలోనే అన్నప్రసాదం, తాగునీటి సీసా, పసుపు, కుంకుమ, రెండు చిన్న లడ్డూలు, ముత్యాల తలంబ్రాల ప్యాకెటు ఇవ్వాలని నిర్ణయించారు.

పవిత్ర పుట్ట మన్ను తీసుకొస్తున్న అర్చకుడు రాఘవాచార్యులు


బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

వార్షిక బ్రహ్మోత్సవాలకు ఉత్సవాల నిర్వాహకుడు కల్యాణపురం రాజేష్‌ భట్టార్‌ వేడుకగా అంకురార్పణ చేశారు. గురువారం రాత్రి గణపతి పూజ, సభా అనుజ్ఞ, విశ్వక్సేన ఆరాధన, భగవత్‌ సంకల్పం, రక్షాబంధనం, పుట్టమన్ను సేకరణ, సమర్పణ, అంకురార్పణ, గరుడ ప్రతిష్ఠ, పుర్ణాహుతి పూజలు వేడుకగా జరిగాయి.


నేటి కార్యక్రమాలు

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ధ్వజారోహణం, రాత్రి ఏడు గంటలకు శేష వాహన సేవ, గ్రామోత్సవం తదితర కార్యక్రమాలుంటాయని డిప్యూటీ ఈవో పి.వి.నటేష్‌బాబు తెలిపారు.

రామయ్య దర్శనం కోసం బారులుతీరిన భక్తులు

అతివల కోలాట  ప్రదర్శన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని