logo

ఐపీఎల్‌.. బెట్టింగ్‌ల సవాల్‌

అందరూ ఎదురు చూస్తున్న ఐపీఎల్‌-16 సీజన్‌ ఘనంగా ప్రారంభం అయింది. 12 వేదికలు..58 రోజులు..74 మ్యాచ్‌లతో హోరాహోరీగా సాగనుంది.

Published : 01 Apr 2023 02:39 IST

రాజకీయ నేతలే క్రికెట్‌ బుకీలు
ప్రత్యేక స్థావరాలు...జోరుగా పందేలు
ప్రొద్దుటూరు కేంద్రంగా రూ.కోట్లల్లో టర్నోవర్‌
పోలీసుశాఖ నిఘా వైఫల్యంపై విమర్శలు

అందరూ ఎదురు చూస్తున్న ఐపీఎల్‌-16 సీజన్‌ ఘనంగా ప్రారంభం అయింది. 12 వేదికలు..58 రోజులు..74 మ్యాచ్‌లతో హోరాహోరీగా సాగనుంది. అభిమానుల సందడి ఒక ఎత్తయితే.. ధనార్జనే ధ్యేయంగా ఆడిస్తున్న క్రికెట్‌ పందేలు మరో ఎత్తు. పోలీసుల కంట పడకుండా భారీ ఎత్తున బెట్టింగ్‌ నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన బుకీలు ప్రత్యేక స్థావరాలు ఏర్పాటు చేసుకుని తమ దందాను సాగించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు బుకీల కదలికలపై నిఘా ఉంచారు. అయితే యాప్‌ల ద్వారా పందేలు జరుగుతుండటంతో బుకీలను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది.

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే - ప్రొద్దుటూరు నేర వార్తలు

క్రికెట్‌ పందేల నిర్వహణలో రాయలసీమకే ప్రధాన కేంద్రంగా ప్రొద్దుటూరు నిలుస్తోంది. ఇక్కడ అనేక మంది బెట్టింగ్‌ దందాను సాగిస్తున్నారు. జిల్లాలో ఏ ప్రాంతంలో బెట్టింగ్‌ జరిగినా అందుకు సంబంధించిన మూలాలు, టర్నోవర్‌ చివరకు వచ్చి చేరేది ప్రొద్ద్దుటూరుకు చెందిన ప్రధాన బుకీల వద్దకే. ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో పందేల నిర్వహణపై బుకీలు ప్రత్యేక దృష్టి సారించారు. బెట్టింగ్‌ ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు పలువురు వ్యక్తులు ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను రూపొందించారు. ఆ సాప్ట్‌వేర్‌ను రాష్ట్రంలోని పలువురు బుకీలకు ఇస్తున్నారు. పందేల నిర్వాహకులు ఇప్పటికే అనేక మంది యువకులను బెట్టింగ్‌ వ్యవహారంలోకి లాగినట్లు సమాచారం. 20 ఓవర్లకు జరిగే మ్యాచ్‌లో బంతి బంతికి పందేలు జరిగే అవకాశం ఉంటుంది. గెలుపు, ఓటములతో పాటు ఒక్కో ఓవర్‌లో ఎన్ని పరుగులు వస్తాయి, సిక్సర్లు, ఫోర్లు, వికెట్లు తదితర వాటిపైనా ప్రధానంగా పందేలు జరగనున్నాయి.

సిరిపురే... పుట్టినిల్లు

క్రికెట్‌్ పందేలకు పుట్టినిల్లయిన ప్రొద్దుటూరులో రాజకీయ నేతలే బుకీలుగా అవతారమెత్తారు. అందులో అధికార పార్టీకి చెందిన వారే అధికంగా ఉన్నారు. దీంతో వారిపై పోలీసులు దాడులు చేయలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణకుమార్‌ బాధ్యతలు చేపట్టిన కొత్తలో బెట్టింగ్‌ రాయుళ్లపై ప్రత్యేక నిఘా ఉంచారు. గతంలో కేసులున్న బుకీలను బైండోవర్‌ చేశారు. సబ్‌ డివిజన్‌లో సుమారు 40 మందికి కౌన్సిలింగ్‌ ఇచ్చి తహసీల్దార్‌ ఎదుట హాజరుపర్చారు. వీరిలో అధికార పార్టీకి చెందిన నేతలూ ఉన్నారు. ఒకటో ఠాణా, రెండో ఠాణాల పరిధిలోని అధికార పార్టీ కౌన్సిలర్లును స్టేషన్లకు పిలిపించిన పోలీసులు క్రికెట్‌ పందేల విషయంలో కౌన్సిలింగ్‌ నిర్వహించి హెచ్చరించి పంపారు. తర్వాత వారిపై పోలీసులు నిఘా ఉంచలేదన్న ఆరోపణలున్నాయి.

రూ.వంద కోట్ల వరకూ జూదం

ప్రొద్దుటూరులో సుమారు 30 మందికి పైగా ప్రధాన పందేల నిర్వాహకులు, మరో 70 మంది వరకూ సబ్‌ బుకీలు ఉంటారు. వీరిలో కొందరు బుకీలు తెలంగాణ, బెంగళూరు, గోవా, చెన్నై, తిరుపతి ప్రాంతాల్లో, మరికొందరు స్థానికంగానే ఉంటూ లాడ్జిలు, ఇళ్లు బాడుగకు తీసుకుని బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి ప్రొద్దుటూరుకు చెందిన బుకీల వద్ద సుమారు రూ.100 కోట్ల టర్నోవర్‌ ఉంటుందనే అంచనాలున్నాయి. ఇక్కడున్న పందెం రాయుళ్లకు వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని పులివెందుల, కడప, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, ఎర్రగుంట్ల, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, ప్రకాశం తదితర ప్రధాన ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అనేక మంది జూదగాళ్లతో సంబంధాలు ఉన్నాయి. వారికి రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో ఏళ్ల కాలంగా క్రికెట్‌ పందేలు నిర్వహిస్తున్నారు.

అప్పుల పాలవుతున్న యువత

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి జల్సా చేయాలన్న ఆలోచనతో అనేక మంది యువకులు తమ జీవితాలను అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ వలలో పడి అప్పుల పాలవుతున్నవారెందరో ఉన్నారు. చేసిన తప్పు మళ్లీ చేస్తూ నష్టపోతున్న యువత దొంగతనాలకు సైతం పాల్పడుతోంది. ఇతరత్రా వ్యసనపరులుగా మారి తప్పుదోవ పడుతున్నారు. కొందరు యువకులు ద్విచక్రవాహనాలు, బంగారం తాకట్టు పెట్టి మరీ బెట్టింగ్‌ ఆడుతున్నారు. ప్రొద్దుటూరు పట్టణం మట్టిమసీదు వీధిలో అన్నదమ్ములతో పాటు విజయనగరం వీధి, రామేశ్వరం, ఆర్ట్స్‌ కాలేజీరోడ్డుకు చెందిన బుకీలు బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. జిన్నారోడ్డుకు చెందిన మరో ఇద్దరు అన్నదమ్ములు పెద్ద ఎత్తున పందేలు జరుపుతున్నారు. వీరందరికీ ప్రముఖ రాజకీయ నేతల మద్దతు ఉంది. దీంతో తమకేమీ కాదన్న ధైర్యంతో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని