logo

కుల వివక్షతోనే అచ్చెన్న హత్య

పశుసంవర్ధకశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ అచ్చెన్న హత్య కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ వరప్రసాద్‌ తెలిపారు.

Published : 01 Apr 2023 02:39 IST

ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ వరప్రసాద్‌

ఎస్పీ అన్బురాజన్‌, కడప ఆర్డీవో ధర్మచంద్రారెడ్డితో చర్చిస్తున్న ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ వరప్రసాద్‌

అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే : పశుసంవర్ధకశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ అచ్చెన్న హత్య కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ వరప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం వైయస్‌ఆర్‌ జిల్లా కడపకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక శాఖ జిల్లా ఉన్నతాధికారిని కుల వివక్షతో కుట్రపన్ని చంపడం దుర్మార్గమన్నారు. తనకు జరుగుతున్న అన్యాయంపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు ఉత్తరాలు రాశారని, లోకాయూక్తకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ స్పందించకపోవడంతోనే ఇలాంటి ఘటన జరిగిందన్నారు. డిపార్ట్‌మెంట్‌ అధికారులు, పోలీసుల నిర్లక్ష్యంతోనే అచ్చెన్న హత్యకు గురయ్యారని ఆరోపించారు. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు అచ్చెన్న కుటుంబీకులతో గురువారం మాట్లాడానని, వారి నుంచి పలు పత్రాలు తీసుకున్నట్లు చెప్పారు. హత్యకేసులో ముగ్గురిని అరెస్టు చేశారని, వారే కాకుండా మరింత మంది ప్రమేయం ఉన్నట్లు మాకు వినతులు వచ్చాయని, వాటిపై క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నామని చెప్పారు. వారిపైన శాఖాపరమైన, పోలీసులు విచారణ చేయాలని ఆదేశించామన్నారు. అచ్చెన్నను వివక్షతోనే హత్య చేశారని, ఇందులో అధికారుల కుట్ర కూడా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. అనంతరం ఎస్పీ అన్బురాజన్‌, కడప ఆర్డీవో ధర్మచంద్రారెడ్డిని కలిసి అచ్చెన్న హత్యకేసు విషయమై చర్చించారు. అనంతరం గువ్వలచెరువు ఘాట్‌కు వెళ్లి అచ్చెన్న హత్యకు గురైన ప్రదేశాన్ని పరిశీలించారు.

సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలి

జిల్లా సచివాలయం, నాగరాజుపేట (కడప) : పశుసంవర్ధకశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అచ్చెన్న మృతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కడపకు వచ్చిన ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ను ఐకాస నేతలు చంద్ర, హరిప్రసాద్‌, చంద్రశేఖర్‌, దస్తగిరిరెడ్డి, శంకర్‌ తదితరులు కలిశారు. అచ్చెన్న అనేక దఫాలుగా జిల్లా అధికారులతో పాటు, రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదని, ఏకంగా హత్యకు గురవడం బాధాకరమన్నారు. అసలైన దోషులను శిక్షించి అచ్చెన్న కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. తెదేపా నేతలు కొండాసుబ్బయ్య, బండి జయశేఖర్‌, జనార్దన్‌రెడ్డి, శ్రీనివాసులు తదితరులు ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ కలిసి వినతి పత్రం అందించారు. ఎస్సీలపై నిరంతరం దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని వీటిని అరికట్టాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని