logo

శిలాఫలకంతో సరి... పనులెప్పుడో మరి!

కడప అంబేడ్కర్‌ కూడలి - వైజంక్షన్‌, గోకుల్‌లాడ్జి- అన్నమయ్య కూడలి, కృష్ణా థియేటర్‌- దేవునికడప రోడ్డు నగరంలో కీలక రహదారులు.

Published : 01 Apr 2023 02:39 IST

బాధితులకు అందని పరిహారం
అవరోధంగా మారిన కోర్టు కేసులు
న్యూస్‌టుడే, కడప నగరపాలక

వైకూడలి సమీపంలో రోడ్డు విస్తరణకు ఆక్రమణల తొలగింపు (పాత చిత్రం)

కడప అంబేడ్కర్‌ కూడలి - వైజంక్షన్‌, గోకుల్‌లాడ్జి- అన్నమయ్య కూడలి, కృష్ణా థియేటర్‌- దేవునికడప రోడ్డు నగరంలో కీలక రహదారులు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించడానికి ఈ మూడు మార్గాలను విస్తరించాలని అధికార పార్టీ నాయకులు 2019 నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. 2021 జులై 9న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మూడు రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. బాధితులకు పరిహారం అందివ్వడానికి, రహదారి పనులకు రూ.300 కోట్లు మంజూరు చేశారు. ఇక పనులు పూర్తయినట్లేనని పాలకులు సంబరపడ్డారు. కానీ నేటికీ రహదారి విస్తరణ పనులు మొదలుకాలేదు. రూ.300 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా 2022 చివరి త్రైమాసికం వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. విస్తరణ పనులతో నష్టపోతున్న వారికి నగదు బదులుగా ‘టీడీఆర్‌ బాండ్లు’ ఇవ్వాలని నగరపాలక అధికారులు నిర్ణయించారు. ఈ విధానంపై బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. వారిని ఒప్పించడానికి నగరపాలక కమిషనర్‌ ప్రణాళిక విభాగం, సచివాలయ సిబ్బందితో ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. అధికారులు బృందాలుగా విడిపోయి టీడీఆర్‌ బాండ్లపై బాధితులకు అవగాహన కల్పించారు. ఆస్తులు కోల్పోతున్న వారికి కొంత నగదు, కొంత మొత్తానికి టీడీఆర్‌ బాండ్లు తీసుకోవాలని బాధితుల్ని కోరారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించాయి. 2022 నవంబరు 19న అంబేడ్కర్‌ కూడలి- వై జంక్షన్‌ రోడ్డు విస్తరణకు మొదటి టీడీఆర్‌ అందజేశారు. నవంబరు 23న ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా గోకుల్‌ లాడ్డి- అన్నమయ్య కూడలి మధ్య గల ఆస్తులకు టీడీఆర్లు స్వీకరించారు. మూడు రహదారుల్లో 197 నిర్మాణాలను తొలగించాల్సి ఉండగా 127 మంది రోడ్ల విస్తరణ పనులకు తమ అంగీకారాన్ని తెలిపారు. బాధితులకు టీడీఆర్‌తో పాటూ చెల్లించాల్సిన నగదు ఇప్పటికీ ఇవ్వలేదు.

* రాష్ట్ర ప్రభుత్వం టీడీఆర్‌ బాండ్లు తీసుకున్న వారికి నగదు చెల్లించడానికి రూ.47 కోట్లు విడుదల చేసింది. 95 మందికి పరిహారం ఇవ్వడానికి సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు నమోదు చేశారు. మూడు నెలలు దాటుతున్నా బాధితుల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. ఖాతాల్లో నగదు ఎప్పుడు జమవుతోందో అధికారులు చెప్పలేకున్నారు. దీనికితోడు కొందరు విస్తరణ పనులపై కోర్టును ఆశ్రయించారు. కోర్టు కేసులు పరిష్కారం అయ్యేది ఎన్నడన్న ప్రశ్నకు సమాధానం లేదు.

* రహదారుల విస్తరణకు నిధులు లేకపోయినా నగరపాలక అధికారులు పలుప్రాంతాల్లో నిర్మాణాలు తొలగించారు. ఈ క్రమంలో దేవునికడప రోడ్డులో ఘర్షణ చోటుచేసుకుంది. మిగిలిన ప్రాంతాల్లో బాధితులకు అధికారులకు మధ్య వాగ్వాదాలు జరిగాయి. పనులను ఎక్కడ నుంచి ప్రారంభించాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు పూర్తి చేయాలన్న అంశాలపై తగిన ప్రణాళిక లేకుండా నగరపాలక అధికారులు నిర్మాణాల తొలగింపు చేపట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

త్వరలోనే అందజేస్తాం

రహదారుల విస్తరణ పనులతో నష్టపోతున్న వారికి టీడీఆర్‌ రూపంలో కొంత, నగదు రూపంలో కొంత మొత్తాన్ని ఇవ్వడానికి సన్నాహాలు చేశాం. టీడీఆర్‌ బాండ్లు తీసుకున్న వారికి నగదు చెల్లించడానికి సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేశాం. త్వరలోనే వారి ఖాతాల్లో నిధులు జమవుతాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంటనే రోడ్ల విస్తరణ పనులు ప్రారంభిస్తాం

నాగేంద్ర, ఏసీపీ నగరపాలక సంస్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని