logo

నిర్లక్ష్యం ఖరీదు రూ.9 లక్షలు!

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ప్రతి రూపాయి దుర్వినియోగం కాకుండా కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేక చట్టాలతో నిర్వహిస్తోంది.

Published : 01 Apr 2023 02:39 IST

ప్రజా ధనంపై బాధ్యతారాహిత్యం
గడ్డకట్టిన 200 సిమెంటు బస్తాలు
న్యూస్‌టుడే, చాపాడు

ఎన్‌.ఓబాయపల్లె పాఠశాల గదిలో గడ్డ కట్టిన సిమెంటు బస్తాలు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ప్రతి రూపాయి దుర్వినియోగం కాకుండా కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేక చట్టాలతో నిర్వహిస్తోంది. ఏటా వెచ్చించే నిధులకు జవాబుదారీ కోసం సామాజిక తనిఖీ నిర్వహణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో బయటపడిన దుర్వినియోగ నిధులపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వారి పనితీరుకు అద్దం పడుతోంది. ప్రజాధనంపై బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం గమనార్హం. ఇటీవల చాపాడు మండలంలో నిర్వహించిన సామాజిక తనిఖీలో నిధుల దుర్వినియోగం వెలుగుచూసింది. నాలుగేళ్ల క్రితం రామసుబ్బమ్మకొట్టాలుకు వెళ్లే దారిలో పంచాయతీరాజ్‌ కింద సిమెంటు రహదారి పనులు చేపట్టారు. ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అంతలోనే పీఎంఎస్‌వై నిధులతో తారురోడ్డు నిర్మాణం చేపట్టారు. సిమెంటు రోడ్డు పేరుతో ప్రారంభించిన పనికి ఉపాధిహామీలో గతేడాది రూ.8.94 లక్షలు బిల్లులు చేసినట్లు సామాజిక తనిఖీలో తేలింది. పనులకు సంబంధించి ఎలాంటి రికార్డులు తమకు చూపలేదని, వర్కు ఐడీ వేరుగా ఉందని, పని ఫొటోలు లేవని డీఆర్పీ అధికారుల ఎదుట ప్రస్తావించారు. సంబంధిత పనులకు సామాజిక తనిఖీ పూర్తి కాకుండానే, దానిపై తారు రోడ్డు ఎలా వేస్తారని పీడీ యదుభూషణ్‌రెడ్డి పంచాయతీరాజ్‌ ఏఈని ప్రశ్నించారు. అంతేకాకుండా పూర్తిగా రికవరీకి సిఫారసు చేస్తున్నట్లు రాశారు.

బాధ్యత నాదికాదంటే నాదికాదు

ఎన్‌.ఓబాయపల్లె పంచాయతీలో సిమెంటు రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీలో 200 బస్తాలు సిమెంటు తోలారు. స్థానిక ప్రాథమిక పాఠశాల గదిలో భద్రపరిచారు. చాలా రోజులు కావడంతో గడ్డకట్టి పనికిరాకుండా పోయాయి. మార్కెట్‌లో బస్తా సిమెంటు రూ.350 ధర పలుకుతోంది. వేరొక పనికి వినియోగించి ఉంటే నష్టం జరిగేది కాదని పీడీ సభలో ప్రస్తావించారు. దీనిపై పంచాయతీరాజ్‌ ఎస్‌ఈకి నివేదిస్తున్నానని, అక్కడే సంజాయిషీ ఇచ్చుకోమని ఆయన ఏఈకి సూచించారు. సిమెంటు బస్తాల విషయమై ఏఈ ఈశ్వరయ్యను వివరణ కోరగా ఆ సమయంలో తాను ఇక్కడ ఇంజినీరుగా పనిచేయలేదని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని