logo

అంతటా అన్యాయం.. కావాలి మీ సాయం

ఇలాంటి సమస్యలు కోకొల్లలుగా యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ ఎదుట బాధితులు ప్రస్తావించి బోరుమన్నారు. వీరిని ఓదార్చి ఆదుకుంటామనే భరోసా ఇచ్చి ముందుకు సాగారు.

Updated : 26 May 2023 03:33 IST

పాదయాత్రలో లోకేశ్‌తో బాధితుల నివేదన
సావధానంగా వింటూ ఓదార్చిన యువ నేత
గ్రామాల్లో అడుగడుగునా మహిళలు హారతులు
ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే జమ్మలమడుగు, పెద్దముడియం

మ్మలమడుగు నగర పంచాయతీ రెవెన్యూ సెక్షన్‌లో పన్నులు వసూలు చేసే విభాగంలో 20 ఏళ్లుగా పొరుగుసేవల కింద పని చేస్తున్నాను.. వయసురీత్యా మూడేళ్ల కింద ఉద్యోగాన్ని నా కుమారుడికి ఇచ్చారు. గతంలో పులివెందులలో నాగమ్మ హత్య కేసులో న్యాయం చేయాలని దళిత సంఘాలు చేపట్టిన నిరసనలో నేను పాల్గొన్నానని నా కుమారుడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని కలిసి అన్యాయం గురించి చెబితే వైకాపా కండువా వేసుకుని దళిత ఉద్యమాల్లో పాల్గొనకుండా ఉంటే ఉద్యోగం ఇస్తామన్నారు. నేను ఆ పని చేయకపోవడంతో నా కుమారుడుని ఉద్యోగంలో చేర్చుకోలేదు.

బిర్రు నెల్సన్‌ కుమార్‌, జమ్మలమడుగు


గండికోట ప్రాజెక్టు కింద నిర్వాసితులకు కాలనీలు ఏర్పాటు చేశారు. మ్యాపింగ్‌లో పేర్లు లేవని కొందరికి స్థలాలివ్వలేదు. అందులో మిగిలిన ప్లాట్లు సర్పంచి లక్ష్మీనారాయణరెడ్డి విక్రయించుకున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెట్టిస్తానని బెదిస్తున్నారు. నాకున్న 15 ఎకరాల భూమి ముంపునకు గురైంది. మూడెకరాల్లో వరి నాటాను. చేతికి వచ్చిన పంటను కోసుకుంటామన్నా అధికారులు అంగీకరించడంలేదు. రూ.3 లక్షలు విలువ చేసే మోటారు, పైపులు, సామగ్రిని ముంపు నీటిలో కోల్పోయాను. మాకు చెప్పకుండా నీళ్లు వదలడంతో పంటతో పాటు మోటార్లు మునిగిపోయాయి.  

రామసుబ్బారెడ్డి, ఎర్రగుడి, కొండాపురం మండలం


నీరు-చెట్టు కింద తెదేపా హయాంలో చెక్‌ డ్యాంలు, కాలువల్లో పూడికతీతకు సుమారు రూ.కోటి విలువైన పనులు చేశాను. రూ.60 లక్షలు వరకు బిల్లులొచ్చాయి, ఇంకా రూ.40 లక్షలు పెండింగ్‌ పెట్టి వైకాపా ప్రభుత్వం వేధిస్తోంది. 12 శాతం వడ్డీతో బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా స్పందన లేదు. రూ.2 వడ్డీకి తెచ్చి పనులు చేశాను. అప్పు తీర్చడానికి 8 ఎకరాల భూమిని అమ్మాను. లావనూరులో దుకాణ సముదాయాన్ని సైతం విక్రయించాను, ఇప్పుడు పిల్లల్ని సైతం చదివించలేకపోతున్నాను.

నాగిరెడ్డి, లావనూరు, కొండాపురం మండలం


లాంటి సమస్యలు కోకొల్లలుగా యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ ఎదుట బాధితులు ప్రస్తావించి బోరుమన్నారు. వీరిని ఓదార్చి ఆదుకుంటామనే భరోసా ఇచ్చి ముందుకు సాగారు. పల్లె ప్రాంతాల్లో పేరుకుపోయిన సమస్యలను ప్రజలు ప్రత్యేకించి మహిళలు ప్రస్తావించారు. ఎక్కడ చూసినా తండోపతండాలుగా లోకేశ్‌కు ఎదురేగి రాతపూర్వకంగా విన్నవించారు. గురువారం ఉదయం పెద్దముడియం మండలం ఎన్‌.కొట్టాలపల్లె శివారులో విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్ర పెద్దపసుపుల మీదుగా జమ్మలమడుగు బైపాస్‌ రోడ్డుకు చేరుకుంది. పెద్దపసుపుల గ్రామంలో జనం రహదారుల వెంబడి బారులు తీరడమే కాక భవనాలపై నిలబడి యువనేతకు అభివాదం చేశారు. పెద్దపసుపుల ఎస్సీ కాలనీలో ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాదయాత్ర దారిలో వివిధ గ్రామాల ప్రజలు, ఎస్సీలు, మైనార్టీలు యువనేతను కలిసి సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. మరో ఏడాదిలో రానున్న చంద్రబాబు ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. 110వ రోజు యువనేత లోకేశ్‌ 12.3 కి.మీ.,నడిచారు. ఈ నెల 30న జమ్మలమడుగులో బహిరంగ సభ జరగనుంది. అనంతరం ప్రొద్దుటూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించ నుంది. పాదయాత్రలో లోకేశ్‌న కలిసిన ప్రజలు.. పెద్దముడియంలో జూనియర్‌ కళాశాల, కల్యాణ మండపం, మైనార్టీలకు షాదీఖానా నిర్మించాలని కోరారు. పెద్దపసుపుల చావిడి వద్ద గ్రామస్థులు లోకేశ్‌తో మాట్లాడుతూ గ్రామంలో తాగునీరు, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, శనగ రైతులకు మద్దతు ధర క్వింటాకు  రూ.6,500 ఇప్పించాలని, పంట కాలువలు పూడికతో నిండిపోయాయని, చెరువు చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని, జమ్మలమడుగు నుంచి పెద్దపసుపుల వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నారు. జమ్మలమడుగు బైపాస్‌లో మైనార్టీలు లోకేశ్‌ను కలిసి సమస్యలను విన్నవించారు. పేద మైనార్టీల కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలని కోరారు. ప్రత్యేక శ్మశానవాటిక, ఉర్దూ పాఠశాల నిర్మించాలని, దుల్హన్‌ పథకాన్ని అందరికీ అందించాలన్నారు. బీడీ కార్మికులకు కాలనీలు ఏర్పాటు చేసి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించాలని కోరారు. ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటు చేసి వడ్డీలేని రుణాలు ఇప్పించాలన్నారు.


దుల్హన్‌ పథకంలో షరతులన్నీ తొలగిస్తాం

వైకాపా ప్రభుత్వంలో మైనార్టీలు వివక్షకు గురవుతున్నారని లోకేశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీలకు చెందాల్సిన రూ.5,400 కోట్ల సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లించడం, రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్‌ బోర్డు ఆస్తులను వైకాపా నాయకులు అన్యాక్రాంతం చేస్తున్నారని విమర్శించారు. నరసరావుపేటలో మసీదు స్థలం కబ్జాను అడ్డుకున్న ఇబ్రహీంను దారుణంగా నరికి చంపారని ఆరోపించారు. పేద ముస్లింల వివాహానికి కానుకగా ఇచ్చే దుల్హన్‌ పథకాన్ని అడ్డగోలు నిబంధనలతో నీరుగారుస్తున్నారని, తెదేపా హయాంలో 32,722 మందికి రూ.163.61 కోట్లు అందజేస్తే వైకాపా ప్రభుత్వంలో ఊరికి ఒకరిద్దరు కూడా అర్హత సాధించలేకపోతున్నారని విమర్శించారు. ‘తెదేపా అధికారంలోకి రాగానే దుల్హన్‌ పథకంలో వైకాపా పెట్టిన షరతులన్నీ తొలగిస్తాం. ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటు చేసి మైనార్టీలకు ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తాం. జమ్మలమడుగు మైనార్టీలకు కమ్యూనిటీ హాలు, ఉర్దూ పాఠశాల, ప్రత్యేక శ్మశానవాటిక నిర్మిస్తాం. అర్హత ఉన్న బీడీ కార్మికులకు ఉచితంగా పక్కా ఇళ్లను కట్టించి ఇస్తాం. రాజోలి ప్రాజెక్టును 2.95 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించి నిర్వాసితులకు పరిహారం ఇస్తాం. రైతులు పండించే ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం’ అని హామీలు ఇచ్చారు. పాదయాత్రలో నేతలు శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి, భూపేష్‌రెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, పుత్తా చైతన్యరెడ్డి, రితీష్‌రెడ్డి, గోవర్థన్‌రెడ్డి, హరిప్రసాద్‌, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నరసింహులునాయుడు, అమరనాథ్‌రెడ్డి, సీఎం సురేష్‌, శివనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని