logo

అతివేగంతోనే ప్రమాదం!

పరిమితికి మించి ప్రయాణికులతో అతివేగంతో వస్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడడంతో 63 మంది గాయపడిన ఘటన మదనపల్లె మండలంలో గురువారం చోటుచేసుకుంది.

Published : 26 May 2023 02:15 IST

యూటర్న్‌ తీసుకుంటున్న కారును ఢీకొని బోల్తా పడిన ప్రైవేటు బస్సు
63 మంది ప్రయాణికులకు గాయాలు
క్షతగాత్రుల ఆర్తనాదాలతో  దద్దరిల్లిన మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి
న్యూస్‌టుడే, మదనపల్లె నేరవార్తలు, పట్టణం

రిమితికి మించి ప్రయాణికులతో అతివేగంతో వస్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడడంతో 63 మంది గాయపడిన ఘటన మదనపల్లె మండలంలో గురువారం చోటుచేసుకుంది. సుమారు 70 మందికి పైగా ప్రయాణికులతో బెంగళూరు నుంచి తిరుపతికి ప్రైవేటు (భారతి) బస్సు బయలుదేరింది. మదనపల్లె మండలం వేంపల్లె పంచాయతీ కూకటిమానుగడ్డ వద్దకు వచ్చేసరికి రోడ్డుపై ఓ కారు యూటర్న్‌ తీసుకోవడంతో బస్సు డ్రైవరు ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. అయితే బ్రేకు పడకపోవడంతో దూసుకొచ్చి యూటర్న్‌ తీసుకుంటున్న కారు వెనుక భాగంలో ఢీకొని రోడ్డుకు ఎడమ వైపు ఉన్న లోతట్టు ప్రాంతంలో బోల్తాపడింది. ప్రమాదంలో బస్సులోని మదనపల్లె, వాల్మీకిపురం, పీలేరు, తిరుపతి, రొంపిచెర్ల, ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. రహదారిలో ప్రయాణిస్తున్న వాహనచోదకులు వెంటనే 108, పోలీసులకు సమాచారమిచ్చారు. మదనపల్లె, వాల్మీకిపురం, కురబలకోట, రామసముద్రం నుంచి వచ్చిన 108 వాహనాల్లో హుటాహుటిన క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీటితోపాటు ఆటోలతోపాటు పలు ప్రైవేటు అంబులెన్స్‌ల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లారు.


ఏడుగురిని తిరుపతికి తరలింపు

దనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి క్షతగాత్రులందరినీ తరలించగా, వారిలో తీవ్రంగా గాయపడిన రామ్మోహన్‌ (60), కె.కృష్ణప్ప (62), ఎం.గిరీష్‌రెడ్డి (20), చందన (17), టి.లావణ్య (35), రిషిత (3), శాంతమ్మ (50)లను తిరుపతికి తరలించారు. సమీరా (45), ఆనంద్‌ (27), నరసింహులు (40), వెంకటేష్‌ (53), అమృత (28), పి.శాంతమ్మ (45), ఎస్‌.శారద (50), కృష్ణమ్మ (55), లక్ష్మీదేవి (57), సిద్దమ్మ (35), ఎన్‌.బషీర్‌ (52), రమణప్ప (32), కండక్టర్‌ జమీర్‌అహ్మద్‌ (53)లు మదనపల్లె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలినవారంతా ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారు.


ఎలా జరిగిందంటే...?

బెంగళూరుకు చెందిన విజయేంద్ర, సుచీంద్ర, రాఘవేంద్ర, నితిన్‌లు మదనపల్లె మండలం వేంపల్లెలోని చెన్నకేశవస్వామిని దర్శించుకునేందుకు కారులో వచ్చారు. వీరు వేంపల్లెకు వెళ్లే దారి కంటే ముందుకు వెళ్లిపోయి కూకటిమాను గడ్డ సమీపానికి వచ్చేశారు. దీంతో డ్రైవరుకు అనుమానం వచ్చి అటుగా వస్తున్న ఓ వ్యక్తిని వేంపల్లె చెన్నకేశవస్వామి ఆలయానికి వెళ్లే దారిని అడిగాడు. దీంతో ఆ వ్యక్తి ముందుకు వచ్చేశారని, వెనక్కు వెళ్లాలని చెప్పడంతో డ్రైవరు ఎడమవైపున ఉన్న ఖాళీ ప్రాంతంలోకి కారును రివర్స్‌ వేసుకుని ఒక్కసారిగా రోడ్డులోకి యూటర్స్‌ తీసుకున్నాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న బస్సు డ్రైవరు రాఘవ బ్రేక్‌ వేసినప్పటికి బస్సులో స్థాయికి మించి ప్రయాణికులుండటంతో అదుపు చేయలేక కారు వెనుక భాగాన్ని ఢీకొట్టి ఒక్కసారిగా ఎడమవైపు లోతట్టు ప్రాంతంలోకి దూసుకుపోయి బోల్తా పడింది. కారు చోదకుడు వాహనాల రాకపోకలు చూసుకోకుండా యూటర్న్‌ తీసుకోవడం, బస్సు డ్రైవరు అతివేగంగా వాహనాన్ని నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కారు యూటర్న్‌ తీసుకునే సమయంలో రోడ్డు చివరికి వెళ్లిపోవడంతో కారు వెనుక భాగం మాత్రమే దెబ్బతింది. అదే రహదారి మధ్యలో కారు ఉన్న సమయంలో బస్సు ఢీకొని ఉంటే భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగేదని స్థానికులు తెలిపారు. కారులో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు.


వైద్యులు, 108 సేవలు భేష్‌

ప్రమాదం జరిగిన వెంటనే 108 ఆపరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ చలపతి పరిస్థితిని అంచనా వేసి మదనపల్లె, కురబలకోట, వాల్మీకిపురం, రామసముద్రం మండలాల 108 వాహనాలను ఘటనాస్థలానికి పంపారు. అన్ని వాహనాల్లో క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో వైపు క్షతగాత్రులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ దివాకర్‌, సీనియర్‌ వైద్యులు పాల్‌రవికుమార్‌, ఆంజనేయులు, పీఎన్‌శాస్త్రి, చిన్నపిల్లల వైద్యుడు రత్నాకర్‌తో పాటు సుమారు 20 మంది వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది క్షతగాత్రులకు చికిత్స అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రి వద్దనున్న పలువురు ఆటో చోదకులు, ప్రైవేట అంబులెన్స్‌ సిబ్బంది ఘటనా స్థలం నుంచి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంతో సాయపడడంతో వారిని పలువురు అభినందించారు.


పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం

స్సు ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని మదనపల్లె ఆర్డీవో మురళి, డీఎస్పీ కేశప్ప అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్డీవో కార్యాలయంలో రోడ్డు ప్రమాదాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అదే సమయంలో బస్సు ప్రమాదం జరిగినట్లు తెలుసుకున్న వారు హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి చేరుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. బస్సు నిబంధనలకు మించి ప్రయాణికులను తీసుకొస్తున్నట్లు తెలుస్తోందన్నారు. వాహనం కెపాసిటి ఎంత.., ఎంత వేగంగా వచ్చాడు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్రంగా విచారణ చేయిస్తామన్నారు. రవాణా శాఖ అధికారులతో పాటు స్థానిక పోలీసులు విచారణ జరిపేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు బస్సులను తరచూ తనిఖీ చేసేవిధంగా చూస్తామన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి ఎవరికి ప్రస్తుతానికి ప్రాణాపాయం లేదన్నారు.


క్షతగాత్రులకు నాయకుల పరామర్శ

క్షతగాత్రులను మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్‌, షాజహాన్‌బాషా, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, మదనపల్లె పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ మనూజ, వైస్‌ ఛైర్మన్‌ జింకా  వెంకటాచలపతి, ఏపీఎండీసీ ఛైర్మన్‌ షమీమ్‌అస్లాం, జనసేన నాయకులు రాందాస్‌చౌదరి, తెదేపా, వైకాపా, జనసేన నాయకులు పరామర్శించారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎంపీ మిథున్‌రెడ్డి ఆసుపత్రి అర్‌ఎంవో డాక్టర్‌ దివాకర్‌తో ఫోన్‌లో మాట్లాడి క్షతగాత్రులందరికి మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.


ప్రమాదాలకు నిలయం కూకటిమానుగడ్డ మలుపు

బెంగళూరు రోడ్డులోని కూకటిమానుగడ్డ సమీపంలో మలుపు వద్ద తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఏడేళ్ల కిందట ఇదే ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడిన ప్రమాదంలో 30 మంది వరకు గాయపడ్డారు. రహదారులు, భవనాలు, పోలీసుశాఖల అధికారులు స్పంధించి ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సర్వత్రా కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు