logo

ఉప్పు, మసాలా తగ్గిస్తే..దీర్ఘాయుష్మాన్‌భవ

ఎండ కారణంగా దీర్ఘకాలిక రోగులకు సైతం ఇక్కట్లు  తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికరక్తపోటు, మధుమేహంతో పాటు కిడ్నీ బాధితులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Updated : 28 May 2023 03:43 IST

ఎండ కారణంగా దీర్ఘకాలిక రోగులకు సైతం ఇక్కట్లు  తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికరక్తపోటు, మధుమేహంతో పాటు కిడ్నీ బాధితులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

* సాధారణంగా వేసవిలో 5-6 లీటర్ల నీరు తాగాలి. ఏసీ లేదా చల్లని వాతావరణంలో ఉన్నా సరే ఎక్కువ నీళ్లు తాగుతుండాలి. లేదంటే డీహైడ్రేషన్‌ బారిన పడే ప్రమాదం ఉంది. చాలా మంది కూల్‌డ్రింక్‌, జ్యూస్‌లు తాగుతుంటారు. వాటిలో ఎక్కువ ఫాస్పేట్‌ ఉండటం వల్ల శరీరంలోని నీటిని గ్రహించి మరింత డీహైడ్రేషన్‌ బారిన పడే ప్రమాదం ఉంది. కిడ్నీ రోగుల పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుందని గుర్తించాలి. ముఖ్యంగా డయాలసిస్‌పై ఉన్న రోగులు జాగ్రత్తలు పాటించాలి.

* హీమోడయాలసిస్‌ రోగులు ఎక్కువ నీళ్లు తాగకూడదు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రక్తపోటు పెరిగిపోయి అది ఇతర సమస్యలకు దారి తీస్తుంది. ఇలాంటి వారు కొంచెం కొంచెం రోజులో 1.5 నుంచి 2 లీటర్లు మాత్రమే నీటిని తీసుకోవాలి. ఒకసారి 200-300 మిల్లీలీటర్ల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. దీనికి బదులు దాహం వేసినప్పుడు ఐస్‌ ముక్క నోట్లో పెట్టుకుంటే దాహం తీరిపోతుంది. ఇంటి వద్ద పెరిటోనియల్‌ డయాలసిస్‌ చేసుకునేవారు వైద్యుల సూచనలతో సాధారణంగా నీళ్లు తాగొచ్చు.

* డయాలసిస్‌ రోగులు ఉప్పు, మసాలాలు ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి. వాటిని తినడానికి, జీర్ణం చేయడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. దీంతో మాటిమాటికి దాహం వేస్తుంది. అప్పుడు నీళ్లు తాగాలని అన్పిస్తుంది. దీంతో చాలామంది నీళ్లు ఎక్కువగా తాగి అనారోగ్యం బారిన పడుతుంటారు.

* డయాలసిస్‌ రోగులు మామిడి, కర్బూజ, అరటి తదితర పొటాషియం అధికంగా ఉండే పండ్లు కూడా తినకూడదు. దీనివల్ల కిడ్నీలపై భారం పడుతుంది. ఆపిల్‌, బొప్పాయి లాంటి పొటాషియం లేని పండ్లను తగిన మోతాదులో తీసుకోవచ్చు.

* ఎక్కువగా చల్లటి వాతావరణంలో ఉండేటట్లు చూసుకోవాలి. మధ్య మధ్యలో చల్లటి వస్త్రంతో శరీరాన్ని తడుపుకొంటూ ఉంటే మాటిమాటికి దాహం వేయదు. వీరు భోజనం చేస్తూ నీళ్లు తాగకూడదు. చివరిలో మాత్రమే తాగాలి. ఆ సమయంలోనే ఔషధాలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ వైఫల్య బాధితులు ఎండలో తిరగకుండా చూసుకోవాలి. చల్లని ప్రదేశంలో నీడపాటున ఉండేటట్లు చూసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలి.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు