logo

ఎన్నాళ్లు విస్తరిస్తారు?

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన అనంతరం కడప నగరంలో మొదలుపెట్టిన మొట్టమొదటి అభివృద్ది కార్యక్రమం కలెక్టర్‌ కార్యాలయ రహదారి విస్తరణ పనులు.

Published : 28 May 2023 04:22 IST

పనులు ప్రారంభించి నాలుగేళ్లు...సీఎం ఆరంభించి రెండేళ్లు!
ఇదీ కడప కలెక్టరేట్‌ రహదారి తీరు

అసంపూర్తిగా కలెక్టరేట్‌ రహదారి విస్తరణ పనులు

న్యూస్‌టుడే, కడప నగరపాలక, ఈనాడు, కడప : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన అనంతరం కడప నగరంలో మొదలుపెట్టిన మొట్టమొదటి అభివృద్ది కార్యక్రమం కలెక్టర్‌ కార్యాలయ రహదారి విస్తరణ పనులు. నాలుగేళ్ల కిందట మొదలుపెట్టిన పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉండడం గమనార్హం. కలెక్టర్‌ కార్యాలయం (మహవీర్‌ ) కూడలి నుంచి ప్రభుత్వ సర్వజనవైద్యశాల రైల్వే వంతెన వరకు గల ప్రధాన రహదారిని దాదాపు 100 అడగులకు విస్తరించాలని 2019లో నిర్ణయించారు. ఆగమేఘాలపై విస్తరణ పనులు ప్రారంభించారు. ఆర్ట్స్‌ కళాశాల నుంచి రిమ్స్‌ వైపు వెళ్లే మార్గంలో దాదాపు 300 మీటర్ల విస్తరణ పనులు, కళాశాల వద్ద నిర్మించాల్సిన భారీ కల్వర్టు పనులు పూర్తి కాకపముందే రోడ్డును ప్రారంభించాలని నిర్ణయించారు. పనులు పూర్తి కాకుండానే 2021, జులైలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతులమీదుగా ప్రారంభించారు. దాదాపు రూ.85 కోట్లతో పనులను చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రహదారిని ప్రారంభించి వెళ్లిన అనంతరం కొన్ని నెలల వరకు మిగిలిన పనుల వైపు అధికారులు కన్నెత్తి చూడలేదు. ఎట్టకేలకు కొన్ని నెలల కిందట కల్వర్టు నిర్మాణాన్ని పూర్తి చేశారు. 300 మీటర్ల పొడవున గల రహదారి విస్తరణ పనులు మాత్రం ఇంతవరకు మొదలుపెట్టలేదు. రహదారిని విస్తరించడానికి భారీ చెట్లను తొలగించాల్సి ఉండగా, ఇందుకు అటవీశాఖాధికారుల నుంచి అనుమతించాల్సి ఉంది. దీంతో ఈ ప్రక్రియ ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. రైల్వే వంతెన నుంచి మహవీర్‌ కూడలి వరకు తిన్నగా ఉన్న రాజమార్గం 300 మీటర్ల వరకు వచ్చే సరికి సింగిల్‌ లైన్‌గా మారడంతో వాహనచోదకులు తరచూ ప్రమాదాలకు  గురవుతున్నారు. రూ.85 కోట్ల వ్యయంతో చేపట్టిన రహదారి విస్తరణ పనులను పూర్తి చేయకపోవడంపై నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై రహదారులు, భవనాలశాఖ అధికారులు మాట్లాడుతూ 300 మీటర్ల పరిధిలోని చెట్ల తొలగింపునకు అనుమతులొచ్చాయని, వీటిని తొలగించడానికి వేలంపాట పూర్తి చేశామన్నారు.  దీని పరిధిలో 265 మీటర్ల మేర మురుగుకాలువ నిర్మాణం, ప్రహరీ నిర్మాణం పూర్తయిందన్నారు. త్వరలోనే రహదారి విస్తరణ పనులు పూర్తి చేస్తామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని