logo

మరువలేని మహానాయకుడు!

ఉమ్మడి   కడప జిల్లాతో ప్రత్యేక  అనుబంధం ఉమ్మడి కడప జిల్లాతో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుకు ప్రత్యేక అనుబంధం ఉంది.

Updated : 28 May 2023 04:54 IST

ఎన్టీఆర్‌ చేతులమీదుగా  అభివృద్ధి పనులు
ఉమ్మడి   కడప జిల్లాతో ప్రత్యేక  అనుబంధం

ఉమ్మడి కడప జిల్లాతో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుకు ప్రత్యేక అనుబంధం ఉంది. చలనచిత్రాల చిత్రీకరణకు పలుమార్లు ఆయన పర్యటించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరం ప్రచారంలో భాగంగా ఎన్నోమార్లు విచ్చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కరవు సీమలో సాగునీటి బెంగ తీర్చాలని ‘తెలుగు గంగ’కు శ్రీకారం చుట్టారు. తరతరాలుగా తిష్ఠవేసిన క్షామాన్ని శాశ్వతంగా తరిమికొట్టాలని గాలేరు-నగరి సుజల స్రవంతి పథకానికి పచ్చజెండా ఊపారు. దుర్భిక్ష ప్రాంతంలో దేదీప్యమానంగా వెలుగుదివ్వెల కాంతులు ప్రకాశిస్తున్నాయంటే అది ఆయన ప్రసాదించిన వరమే. నేడు ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

న్యూస్‌టుడే, కడప, జమ్మలమడుగు, పులివెందుల, రైల్వేకోడూరు, మైదుకూరు

* మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లోని 12 మండలాల్లో 1.77 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలనే జలస్ఫూర్తితో తెలుగుగంగ పథకానికి నాలుగు దశాబ్దాల కిందట రూపకల్పన చేశారు. పనులకు 1983,  ఏప్రిల్‌ 27న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నందమూరి తారకరామారావు, ఎంజీ రామచంద్రన్‌ శంకుస్థాపన చేశారు. శ్రీశైలం జలాశయం నీటిని పోతిరెడ్డిపాడు నీటి నియంత్రణ కేంద్రం నుంచి వెలుగోడు జలాశయానికి తరలించి అక్కడి నుంచి జిల్లాకు తీసుకురావాలని ప్రతిపాదించారు. అనంతరం తమిళనాడు రాష్ట్రం చెన్నై నగర ప్రజలకు రక్షిత జలాలు సరఫరా చేయాలనేది పథకం ముఖ్యోద్దేశం.

* కరవుకు శాశ్వత పరిష్కారం చూపాలనే సదాశయంతో ‘గాలేరు-నగరి సుజల సవ్రంతి’ పథకానికి మూడున్నర దశాబ్దాల కిందట ముందుకొచ్చారు. శ్రీశైలం జలాశయానికి చేరే మిగులు వరద జలాలను 38 టీఎంసీలను తీసుకొచ్చేవిధంగా అనుమతిచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఆదేశాలతో 1988, సెప్టెంబరు 22న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం శంకుస్థాపన చేశారు. జిల్లాలో తొలి విడతలో 35 వేల ఎకరాలు, రెండో విడతలో 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో అయిదు లక్షల మందికి తాగునీరందించాలన్నది పథకం ప్రధాన ఉద్దేశం.

* శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మంస్వామి చరిత్ర  చిత్రీకరణకు తొలిసారి జిల్లాలోని బ్రహ్మంగారిమఠంతోపాటు సమీప గ్రామాలకు వచ్చారు. రైల్వేకోడూరు మండలంలో ఉద్యాన మొక్కల పెంపకం కేంద్రంలోనూ చిత్రంలోని ఓ పాటను చిత్రీకరించారు. ఈ చిత్రం అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే.

జమ్మలమడుగులో అశేషజనవాహిని మధ్య ప్రసంగిస్తున్న ఎన్టీఆర్‌

తెలుగుగంగ పథకం నిర్మాణ పనులకు బి.మఠంలో 1983, ఏప్రిల్‌ 27న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్టీఆర్‌, ఎంజీ రామచంద్రన్‌లు ఆవిష్కరించిన శిలాఫలకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు