logo

నిబంధనాలు... సామాన్యులే సమిధలు

మదనపల్లె - బెంగళూరు ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే ప్రైవేటు బస్సులు కనీస నిబంధనలు పాటించడం లేదు. వీటిపై అధికారులు దృష్టి సారించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

Updated : 28 May 2023 04:56 IST

వరుస రహదారి ప్రమాదాలతో బెంబేలు
భద్రతా చర్యలు పాటించని ప్రైవేటు వాహనదారులు

ఇటీవల మదనపల్లె మండలం కూకటిమానుగడ్డ వద్ద బోల్తా పడిన ప్రైవేటు బస్సు

న్యూస్‌టుడే, మదనపల్లె నేరవార్తలు, పట్టణం : మదనపల్లె - బెంగళూరు ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే ప్రైవేటు బస్సులు కనీస నిబంధనలు పాటించడం లేదు. వీటిపై అధికారులు దృష్టి సారించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్క బస్సులో నిబంధనల ప్రకారం కాకుండా 80 నుంచి 90 మంది ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. వీటిపై సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. మదనపల్లెకు చెందిన ఓ ప్రైవేటు బస్సు పోలీసులు ఏర్పాటు చేసిన వన్‌ వే నిబంధనలు సైతం పాటించకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సాధరణంగా 50 నుంచి 55 మందిని మాత్రమే ఎక్కించాల్సి ఉండగా మదనపల్లె -బెంగళూరు రహదారిలో వెళ్తున్న వాహనాలు ఇవేవీ పాటించడం లేదు. దీంతో ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణనష్టంతోపాటు పెద్ద సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు.

జిల్లాలో 108 బ్లాక్‌స్పాట్లు

గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా పోలీసు అధికారులు ఇటీవల జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించి అత్యధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వాటిని బ్లాక్‌స్పాట్లుగా నిర్ణయించారు. జాతీయ రహదారులపై 69, రాష్ట్ర రహదారులపై 39 ప్రమాదకర ప్రాంతాలున్నట్లు గుర్తించారు. వీటిలో ఒక్క మదనపల్లె డివిజన్‌లో 30కి పైగా బ్లాక్‌స్పాట్లు ఉండడం గమనార్హం. మదనపల్లె డివిజన్‌లో ఎక్కువ సంఖ్యలో మలుపులు ఉండటం కూడా ప్రమాదాలకు ప్రధాన కారణం.

* మదనపల్లె మండల పరిధిలోని నవోదయ పాఠశాల సమీపంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే మినీ ప్రైవేటు బస్సు బోల్తాపడి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో 22 మంది గాయపడ్డారు. బస్సు డ్రైవరు తాను నడపకుండా కండక్టరుకు బస్సును ఇవ్వడం, అతను బస్సును వేగంగా నడపడంతో ప్రమాదం జరిగిందని అధికారుల విచారణలో తేలింది.

* గతేడాది డిసెంబరులో శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకుని తిరిగి హిందూపురానికి వెళ్తున్న ప్రైవేటు బస్సు మదనపల్లె మండలం తట్టివారిపల్లె బైపాస్‌ రోడ్డులో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో బస్సు డ్రైవరు దుర్మరణం పాలవ్వగా, 28 మంది గాయాలపాలయ్యారు. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి రెఫర్‌ చేశారు. డ్రైవర్‌ వాహనాన్ని వేగంగా నడుపుతూ నిద్రపోవడంతోనే ప్రమాదం జరిగింది.

* మదనపల్లె మండలం బెంగళూరు రోడ్డులోని కూకటిమానుగడ్డ వద్ద ప్రైవేటు బస్సు కారును ఢీకొట్టి రోడ్డుపక్కన లోతట్టు ప్రాంతంలోకి పడిపోయింది. ప్రమాదంలో 63 మంది ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించగా వీరిలో ఏడుగురు తీవ్ర గాయాలపాలవ్వగా, మిగిలినవారికి రక్తగాయాలయ్యాయి. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమైంది.

పైప్రమాదాలన్నీ అతివేగం, వాహన డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే జరిగాయి. రెండేళ్లలో 8 చోట్ల బస్సు ప్రమాదాలు జరగ్గా అందులో 120 మంది వరకు క్షతగాత్రులయ్యారు. ఆరుగురు మృత్యువాతపడ్డారు.

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

మదనపల్లె డివిజన్‌లో ఇటీవల పలు ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసు, రవాణా, రోడ్లు భవనాలశాఖలతో కలిసి ప్రమాదాలకు గల కారణాలపై సర్వే నిర్వహించారు. ప్రమాదాల నివారణకు ఐరన్‌ సైడ్‌ వాల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. ప్రమాదకర మలుపుల్లో పొదలను తొలగించడంతో పాటు సూచికలు ఏర్పాటు చేస్తున్నాం. నిబంధనలకు మించి ప్రయాణికులను తరలించే వారిపై తనిఖీలు నిర్వహించి అవసరమైతే వాహనాలను జప్తు చేయడంతో పాటు పర్మిట్లు రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తరచూ బెంగళూరు, పుంగనూరు రోడ్డులోనే ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేశాం. ఎవరైనా నిబంధనలు పాటించకుంటే కఠినంగా వ్యవహరిస్తాం.

కేశప్ప, డీఎస్పీ, మదనపల్లె

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని