logo

పూజలు చేస్తూ ప్రాణాలొదిలి...

తాను నిర్మించిన గుడిలో పూజలు చేస్తుండగా విద్యుదాఘాతంతో గంజికుంట చౌడమ్మ (54) మృతి చెందిన ఘటన జమ్మలమడుగు మండలం పొన్నతోట సమీపంలోని జగనన్న కాలనీలో శనివారం చోటుచేసుకుంది.

Published : 28 May 2023 04:22 IST

తాను నిర్మించిన గుడిలోనే విద్యుదాఘాతంతో మహిళ మృతి

గంజికుంట చౌడమ్మ (పాతచిత్రం)

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే : తాను నిర్మించిన గుడిలో పూజలు చేస్తుండగా విద్యుదాఘాతంతో గంజికుంట చౌడమ్మ (54) మృతి చెందిన ఘటన జమ్మలమడుగు మండలం పొన్నతోట సమీపంలోని జగనన్న కాలనీలో శనివారం చోటుచేసుకుంది. జమ్మలమడుగు పట్టణంలోని నాగులకట్ట వీధిలో నివాసం ఉంటున్న గంజికుంట చౌడమ్మ, కృష్ణయ్యలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హరికృష్ణకు ఉద్యోగం వస్తే నరసింహస్వామి గుడి నిర్మిస్తానని చౌడమ్మ మొక్కుకున్నారు. కొద్దిరోజుల్లోనే హరికృష్ణకు కోల్‌కత్తాలో బ్యాంకు ఉద్యోగం వచ్చింది. దీంతో పొన్నతోట సమీపంలోని జగనన్న కాలనీ వద్ద నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించి మొక్కు తీర్చుకున్నారు. వారంలో మూడు రోజులు ఆలయాన్ని శుభ్రం చేసి స్వామివారికి పూజలు చేసి సాయంత్రానికి ఇంటికి వచ్చేవారు. శనివారం కూడా ఆలయాన్ని శుభ్రం చేసి స్వామివారికి పూజలు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. సీఐ సదాశివయ్య, ఎస్సై సుబ్బారావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 


కూలీల ఆటోను ఢీకొన్న కారు
ఒకరి మృతి బీ 18 మందికి గాయాలు

ప్రమాదంలో నుజ్జయిన ఆటో

దువ్వూరు, న్యూస్‌టుడే : కడప-కర్నూలు జాతీయ రహదారిపై కానగూడూరు సమీపంలో శనివారం ఆటోను కారు ఢీకొన్న ఘటనలో దూదేకుల సుబ్బమ్మ(45) మృతి చెందగా, 18 మందికి గాయాలయ్యాయి. వివరాలు.. చాగలమర్రి మండలం గొడిగెనూరుకు చెందిన కూలీలు దువ్వూరు మండలం బుక్కాయపల్లెలో పనికి వెళ్లి ఆటోలో తిరిగొస్తుండగా మార్గంమధ్యలో కానగూడూరు వద్ద తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 18 మందిని 108 వాహనంలో చాగలమర్రి కేరళ హాస్పిటల్‌, ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో జి.లక్ష్మిదేవి, మహబూబ్‌బీ, బొంతల లక్ష్మిదేవి తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని