logo

ప్రొద్దుటూరు.. పసుపుదండు హుషారు!

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 112వ రోజు బుధవారం ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా మహిళలు, యువకులు, వృద్ధులు యువనేతకు నీరాజనాలు పట్టారు.

Published : 01 Jun 2023 04:42 IST

నారా లోకేశ్‌కు నాయకులు, కార్యకర్తల ఘన స్వాగతం
దారి పొడవునా నీరాజనాలు పలికిన మహిళలు, యువత
సమస్యలు పరిష్కరించాలని వివిధ వర్గాల నుంచి వినతులు
ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు గ్రామీణ, ప్రొద్దుటూరు వైద్యం

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 112వ రోజు బుధవారం ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా మహిళలు, యువకులు, వృద్ధులు యువనేతకు నీరాజనాలు పట్టారు. పార్టీ నేతలు, కార్యకర్తలు గజమాలతో సత్కరించి ఆనందంతో కేరింతలు కొట్టారు. దేవగుడి సుంకులాంబ ఆలయం వద్ద విడిది కేంద్రం ప్రాంగణంలో చేనేత కార్మికులతో సమావేశమైన లోకేశ్‌ వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రారంభించిన పాదయాత్ర చౌడూరు వద్ద ప్రొద్దుటూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఇక్కడ తెదేపా జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులురెడ్డి, వీరశివారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, నాయకులు సీఎం సురేష్‌, ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి యువనేతకు ఎదురేగి స్వాగతం పలికారు. వివిధ సామాజిక వర్గాల నుంచి సమస్యలపై ఆయనకు వినతులు సమర్పించారు. పత్తిపంట విత్తనాలు నాణ్యత లేక దిగుబడులు పడిపోవడంతో తీవ్రంగా నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. దీనిపై స్పందించిన లోకేష్‌ తెదేపా అధికారంలోకి వచ్చాక పత్తి రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కమీషన్ల కోసం నాసిరకం విత్తనాల మాఫీయాలో అధికార పార్టీ నాయకులు భాగస్వాములుగా ఉన్నారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నాసిరకం విత్తనాలు, పురుగు మందుల మాఫీయాపై ఉక్కుపాదం మోపి ఏపీ సీడ్స్‌ ద్వారా నాణ్యమైన విత్తనాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

చేనేత కార్మికుల నుంచి సమస్యల వెల్లువ... శంకరాపురం చేనేత కార్మికులు వృత్తి పరమైన సమస్యలను పరిష్కరించాలని యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌కు వినతిపత్రం సమర్పించారు. గత తెదేపా పాలనలో అమలైన వివిధ సంక్షేమ పథకాలు, రాయితీలు, రుణాలు ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడంతో అర్ధాకలికి గడుపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు, ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించాలన్నారు. వైకాపా పాలనలో బీసీలపై అనేక దాడులు జరుగుతున్నాయని, నందం సుబ్బయ్య దారుణంగా హత్య చేసినట్లు గుర్తు చేశారు. ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి చేనేతలను ఆదుకోవాలని వారంతా విన్నవించారు.

ఇసుక దందాపై ఫిర్యాదులు... పెద్దశెట్టిపల్లెలోని పెన్నానది నుంచి పెద్ద ఎత్తున తవ్వేస్తున్న ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించి అధికార పార్టీ నాయకులు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు స్థానికులు వినతిపత్రం అందజేశారు. దీంతో ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాల్లోని పలు గ్రామాలకు నీటి ఎద్దడి నెలకొందన్నారు. నరసింహాపురం వద్దకు చేరిన లోకేశ్‌ను పలువురు ఎమ్మార్పీఎస్‌ నేతలు కలిసి ఎస్సీ వర్గీకరణ, సంక్షేమ, ఆర్థిక అభివృద్ధి కోసం న్యాయం చేయాలంటూ వినతిపత్రం అందజేశారు.  

తెదేపా శ్రేణుల్లో జోష్‌... ప్రొద్దుటూరులోకి అడుగు పెట్టిన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర...తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. మండల పరిధిలోని ఆయా గ్రామాల నాయకులు తమ వర్గీయులతో వెళ్లి బ్రహ్మరథం పట్టారు. శంకరాపురం, పెద్దశెట్టిపల్లెలో మహిళలు మంగళహారతులు ఇచ్చారు. పాదయాత్రలో తితిదే పాలక మండలి మాజీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, నాయకులు బోడేల బాబుల్‌రెడ్డి, కోగటం వీరప్రతాప్‌రెడ్డి, మధుసూదన్‌, ఆసం రఘురామిరెడ్డి, నంద్యాల కొండారెడ్డి, మల్లేల లక్ష్మీప్రసన్న, చెమికల పురుషోత్తమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని