logo

ఇసుక దందా సాగిస్తున్నవారిని విడిచిపెట్టం!

‘జిల్లాలో పీలేరు నియోజకవర్గంలోని కలికిరి, వాల్మీకిపురం, కలకడ మండలాల్లో బాహుదా నది నుంచి అనుమతులకు మించి టన్నుల కొద్దీ ఇసుకను తోడేస్తున్నారు.

Published : 01 Jun 2023 04:42 IST

అక్రమ తవ్వకాలు, రవాణాను అడ్డుకుంటాం
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి

కలికిరి గ్రామీణ, కలకడ, న్యూస్‌టుడే: ‘జిల్లాలో పీలేరు నియోజకవర్గంలోని కలికిరి, వాల్మీకిపురం, కలకడ మండలాల్లో బాహుదా నది నుంచి అనుమతులకు మించి టన్నుల కొద్దీ ఇసుకను తోడేస్తున్నారు. అభం శుభం తెలియని  చిన్నారులు ఆడుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు అక్రమార్కులకే కొమ్ముకాస్తున్నారు. ఇసుక దందాకు పాల్పడుతున్నవారిని విడిచిపెట్టేది లేదు’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మహల్‌ సమీపంలోని గంగాపురం, కలకడ ఇసుక రేవులను బుధవారం ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. ఇటీవల మీటర్ల కొద్దీ ఇసుక తవ్వేయడంతో యువకుడు భార్గవ్‌ (20) నీటిలో పడి మృతిచెందాడని, అతడి ప్రాణాలకు రూ.2 లక్షలు ఖరీదు కట్టి చేతులు దులుపుకోవాలని వైకాపా నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతేడాది గుంటివీరన్నగారిపల్లె ఇసుక రేవులోని గుంతలో పడి బాలుడు ఉమర్‌ (11) మృతిచెందాడన్నారు. తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారి విస్తరణ పేరుతో బాహుదా నదిలో ఇసుకను ఇష్టానుసారంగా తవ్వేస్తూ తరలిస్తున్నారన్నారు. నదిలో రైతుల వ్యవసాయం కోసం వేసిన ఫిల్టరు బావులను సైతం తొలగించారని, ఇదేమని ప్రశ్నిస్తున్న రైతులను పోలీసుల సాయంతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు. తెదేపా అధికారంలోకి రాగానే ఇసుక దందాలపై విచారణ కమిటీని నియమిస్తామన్నారు. ఆయనవెంట కలికిరి సర్పంచి రెడ్డివారి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నాయకులు సతీష్‌కుమార్‌రెడ్డి, నిజాముద్దీన్‌, వెంకటేశ్వరరెడ్డి, మున్వర్‌బాషా, ముస్తఫా, తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు