logo

రిజిస్ట్రేషన్లు ఇక భారమే!

స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ప్రత్యేక రివిజన్‌ పేరుతో ప్రజలపై మోయలేని భారం మోపడానికి సిద్ధమైంది. పెరిగిన మార్కెట్‌ విలువలు జూన్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

Published : 01 Jun 2023 04:42 IST

ఆస్తుల విలువ పెంపుదలపై ప్రత్యేక రివిజన్‌
20 శాతం ప్రాంతాల్లో మార్కెట్‌ ధరల పెంపు
న్యూస్‌టుడే, కడప సంక్షేమం

స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ప్రత్యేక రివిజన్‌ పేరుతో ప్రజలపై మోయలేని భారం మోపడానికి సిద్ధమైంది. పెరిగిన మార్కెట్‌ విలువలు జూన్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలోని గరిష్టంగా 20 శాతం గ్రామాల్లో ఆస్తుల విలువలను 30 శాతం నుంచి 60 శాతం వరకు పెంచారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో ఎక్కడ అధికంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాల్లోనే ఆస్తుల విలువలు పెంచనున్నారు. జాతీయ రహదారుల పక్కన, రహదారుల కూడళ్ల సమీపంలోని ఆస్తుల విలువలకు అధికారులు రెక్కలు తొడిగారు. కడప నగరపాలక సంస్థ పరిధిలో రామరాజుపల్లి, చెమ్ముమియాపేట, పాలెంపల్లి తదితర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌ ఛార్జీల భారం పెరగనుంది. గురువారం నుంచి ఆస్తుల మార్కెట్‌ విలువలు పెరగనున్న నేపథ్యంలో బుధవారం నగర పరిధిలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు క్రయవిక్రమయదారులతో కిక్కిరిసిపోయాయి. సర్వర్లు మొరాయించడంతో కొంత సేపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.

అంతా రహస్యమే

ఆస్తుల మార్కెట్‌ ధరల పెంపుపై స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖాధికారులు అత్యంత గోప్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలోని ఆస్తుల విలువ పెంపుపై ఆ కార్యాలయం సబ్‌రిజిస్ట్రార్‌ ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. ఈ ప్రతిపాదనలను జేసీ ఆమోదించాలి. ప్రతిపాదనలు పంపినప్పటి నుంచి వాటిని ఆమోదించే వరకు జిల్లా రిజిస్ట్రార్‌, ఇతర ముఖ్య అధికారుల కమిటీ ధరల పెంపుపై సమావేశాలు నిర్వహిస్తారు. సబ్‌రిజిస్ట్రార్లు చేసిన ప్రతిపాదనలకు వారు సవరణ చేయొచ్చు. ఈ ప్రక్రియ గతంలో పారదర్శకంగా జరిగేది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లశాఖ అధికారులు మార్కెట్‌ ధరల పెంపుపై పెదవి విప్పడం లేదు. సబ్‌రిజిస్ట్రార్లు మార్కెట్‌ విలువల పెంపుతో సంబంధం లేదని చెబుతున్నారు. మొత్తం జిల్లా రిజిస్ట్రార్‌ పరిధిలోనే ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. గురువారం నుంచి కొత్త మార్కెట్‌ ధరలు అమలు చేస్తారా లేదా అన్న అంశంపై కూడా అధికారులు సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. మార్కెట్‌ ధరల పెంపుపై జిల్లా రిజిస్ట్రార్‌ చెన్న కేశవరెడ్డిని వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆయన సమాధానం ఇవ్వలేదు. ఈ విషయమై స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ డీఐజీ శివరాం మాట్లాడుతూ జూన్‌ 1వ తేదీ నుంచి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆస్తుల మార్కెట్‌ విలువలు పెరగ నున్నట్లు తెలిపారు. వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో గరిష్టంగా 20 శాతం ప్రాంతాలకు మించకుండా ఆస్తుల క్రయవిక్రయాలు అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసినట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని