logo

పేదల ఆశలను చిదిమేసిన రాచబాట

ఒంటిమిట్ట మండలంలో సొంతిల్లు లేని పేదలు ఇంటి స్థలాలివ్వాలని ఆరేళ్ల కిందట రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు.

Updated : 02 Jun 2023 06:31 IST

అయిదేళ్ల కిందట ఇంటి పట్టాల పంపిణీ
అనంతరం జాతీయ రహదారికి అప్పగింత
 ప్రత్యామ్నాయ స్థలాలివ్వని యంత్రాంగం
అధికారుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణ

కడప  - రేణిగుంట జాతీయ రహదారి నిర్మాణానికి కేటాయించిన ఇంటి స్థలాలు

సొంత గూడు లేని నిరుపేదలకు అయిదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం ఇంటి పట్టాలు పంపిణీ చేసింది. పక్కాగృహాలు మంజూరు చేస్తామని ప్రజాప్రతినిధులు వాగ్దానం చేశారు. సొంతింటి కల సాకారం చేయనున్నట్లు అధికారులు సైతం ప్రకటించడంతో గూడు గోడు నుంచి ఉపశమనం లభిస్తుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. కేటాయించిన స్థలంలో నూతనంగా జాతీయ రహదారి నిర్మిస్తారని తెలియడంతో లబ్ధిదారుల నోట మాట రాలేదు. ప్రత్యామ్నాయంగా స్థలాలిస్తామని మూడేళ్ల కిందట అధికారులు ప్రకటించినా ఇంతవరకు అతీగతీ లేదు.  


న్యూస్‌టుడే, కడప: ఒంటిమిట్ట మండలంలో సొంతిల్లు లేని పేదలు ఇంటి స్థలాలివ్వాలని ఆరేళ్ల కిందట రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలించి అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఒంటిమిట్ట రెవెన్యూ గ్రామ పరిధిలోని నర్వకాటిపల్లె-కొత్తమాధవరం గ్రామాల సరిహద్దులో ప్రభుత్వ భూమి సర్వే సంఖ్య 2049లో 428.36 ఎకరాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ పేదలకు ఇంటి జాగాలివ్వాలని నిర్ణయించారు. ఒక్కో లబ్ధిదారుకు తొలుత రెండు సెంట్లు ఇవ్వాలని అనుమతి ఇచ్చి అనంతరం ఒకటిన్నర సెంటుకే పరిమితం చేశారు. రహదారుల నిర్మాణానికి 1.77 ఎకరాలు, ఇంటి స్థలాలకు 3.69 ఎకరాలివ్వడానికి ముందుకొచ్చి మొత్తం 246 ప్లాట్లు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో 93 మంది, చెంచుగారిపల్లెలో ఏడుగురు, నర్వకాటిపల్లెలో 30 మంది, కొత్తమాధవరంలో 66, కొండమాచు పల్లెలో 27 మందికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉందని తేల్చారు. మొత్తం 223 మంది లబ్ధిదారులకు 2018లో అప్పటి ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. ఇంటి పట్టాలొచ్చాయన్న ఆనందం మున్నాళ్ల ముచ్చటగా మారింది.
అదిగో... ఇదిగో అంటూ కాలయాపన: కడప-రేణిగుంట మార్గంలో నూతనంగా నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో పేదలకు ఇచ్చిన 96 ప్లాట్లలో కొత్తగా రాచబాట వేయాలని ప్రతిపాదించారు. ఇక్కడ సర్వే చేసి రహదారి నిర్మాణానికి ఇవ్వాలని ఎన్‌.హెచ్‌ఏఐ. ఇంజినీర్ల నుంచి మూడేళ్ల కిందటే ప్రతిపాదనలందాయి. రెవెన్యూ అధికారులు మాత్రం ప్రత్యామ్నాయంపై దృష్టిసారించ లేదు. అప్పటి నుంచి ఇతర ప్రాంతంలో పట్టాలివ్వాలని పేదలు అడుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. ఇదిగో...అదిగో కాలయాపన చేస్తున్నారు.
జగనన్న కాలనీ లబ్ధిదారులపై ఉదారత: సర్వే సంఖ్య-2049లో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 183 మందికి ఇంటి స్థలాలు కేటాయించి పక్కాగృహాలను మంజూరు చేయాలని మూడేళ్ల కిందట నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 2020లో పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఈ ప్రాంతంలోనూ జాతీయ రహదారి నిర్మాణంలో 100 ప్లాట్లు కోల్పోవాల్సి వస్తుందని గుర్తించిన అధికారులు వెంటనే ప్రత్యామ్నాయంగా సమీపంలో 2218 సర్వే సంఖ్యలో 2.90 ఎకరాలు కేటాయించి జగనన్న కాలనీ లబ్ధిదారులపై ఉదారత చూపారు. ఇక్కడ ప్రస్తుతం పక్కాగృహాలు నిర్మిస్తున్నారు. అదే 2018లో పట్టాలు ఇచ్చిన వారిలో జాతీయ రహదారి నిర్మాణంలో స్థలాలు కోల్పోతున్న వారికి ఇంతవరకు స్థలాలు చూపకపోవడంపై పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ప్రత్యామ్నాయంగా కేటాయిస్తాం

కడప-రేణిగుంట జాతీయ రహదారి నిర్మాణంలో స్థలాలు కోల్పోయేవారికి ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇవ్వడానికి చర్యలు తీసుకొంటాం. ఎంతమంది నష్టపోతారనే సమాచారం సేకరించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు న్యాయం చేస్తాం.

పి.ధర్మచంద్రారెడ్డి, ఆర్డీవో, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని