logo

యువగళం.. పోటెత్తిన జనం

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రకు అశేష సంఖ్యలో జనం తరలివస్తున్నారు. తమ సమస్యలపై యువనేతకు ఏకరువు పెడుతున్నారు.

Published : 03 Jun 2023 02:33 IST

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, మైదుకూరు, చాపాడు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రకు అశేష సంఖ్యలో జనం తరలివస్తున్నారు. తమ సమస్యలపై యువనేతకు ఏకరువు పెడుతున్నారు. శుక్రవారం మైదుకూరు నియోజకవర్గంలో యువకుల కేరింతల నడుమ యువనేతకు అపూర్వ స్వాగతం లభించింది. దారిపొడవునా మహిళలు యువనేతకు హారతులు పట్టి నీరాజనాలు పలికారు. యువనేతను చూసేందుకు జనం రోడ్లవెంట బారులు తీరారు. వివిధ వర్గాల ప్రజలు పెద్దఎత్తున లోకేశ్‌కు ఎదురేగి తమ సమస్యలను విన్నవించారు. కొత్తపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర నాగులపల్లి క్రాస్‌ వద్ద మైదుకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మైదుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ నేతృత్వంలో పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు యువనేతకు ఎదురేగి స్వాగతం పలికారు. దారి పొడవునా వివిధ గ్రామాల ప్రజలు, దళితులు, రైతులు ఆయన వద్దకు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. మరో ఏడాదిలో రానున్న చంద్రన్న ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. కొత్తపల్లి క్యాంప్‌ సైట్‌లో వివిధవర్గాల ప్రముఖులతో ఆయన సమావేశమై వారి సమస్యలు విన్నారు. కొత్తపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఖాదర్‌పల్లి, చాపాడు, సీతారాంపురం, చియ్యపాడు క్రాస్‌, కేతవరం క్రాస్‌ మీదుగా విశ్వనాథపురం విడిది కేంద్రానికి చేరుకుంది.  

ప్రజల నుంచి వినతుల వెల్లువ : చాపాడుకు చెందిన రాజోలి బైపురెడ్డి మాట్లాడుతూ.. ‘నాకు 1.75 ఎకరాల పొలం ఉంది. ఆ పొలానికి పక్కనున్న వాళ్ల నుంచి సాగునీరు తీసుకుంటా. అందుకు గాను ఏటా 3 మూటలు వడ్లు ఇచ్చే వాణ్ని. సాగునీరిచ్చే వ్యక్తిని మా గ్రామంలోని వైకాపా నేతలు బెదిరిస్తున్నారు. దీంతో పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు ఇవ్వడం మానేశారు. దీంతో పసుపు, నువ్వుల పంట ఎండిపోయింది. రూ.65 వేల పెట్టుబడి, మా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. మా గ్రామంలో ఎంపీటీసీగా బీసీలకు అవకాశం వస్తే.. నిలబెట్టాం. ఈ కోపంతో నాకు సాగునీరు ఇవ్వకుండా చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

‘2001 నుంచి ఆర్‌అండ్‌బీశాఖలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పొద్దుటూరులో పని చేస్తున్నా. గతంలో పాదయాత్రలో జగన్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తానని పాదయాత్రలో మాటిచ్చారు. దీన్ని నమ్మి నాలాంటి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరూ ఓట్లేశారు. కానీ ఆ హామీని అమలుచేయలేదు. రూ.18 వేల జీతంతో కుటుంబాన్ని పోషించుకోవాలంటే కష్టంగా ఉంది. ఇద్దరు పిల్లలకు కలిపి స్కూలు ఫీజులు యేడాదికి రూ.45 వేలు అవుతున్నాయి. ఈ ఏడాది ఇంకా స్కూలు ఫీజులు పెంచుతున్నారు. కనీసం అమ్మఒడి కూడా మాకు రాదు’ అని మహేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

‘గతంలో బీసీలకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు వచ్చాయి. ఇప్పుడు అందడం లేదు. దీంతో చిన్న షాపు పెట్టుకోవాలన్నా కనీసం రూ.3 లక్షలు అవుతోంది. ఈ ప్రాంతంలో ఉన్న టెక్స్‌టైల్‌ పార్కు కూడా వినియోగంలో లేదు. టెక్స్‌టైల్‌ పార్కు వినియోగంలోకి వస్తే రకరకాల వస్త్ర వ్యాపారులు ఉత్పత్తులను ప్రదర్శనగా విక్రయించుకునే అవకాశం ఉంటుంది. లోకల్‌గా తయారు చేసిన ఉత్పత్తులకు సేల్స్‌ పెరుగుతాయి.  నాలుగేళ్లుగా సమస్యలపై నోరు మెదపడంలేదు’ అని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ కార్పొరేషన్‌లో 18 ఏళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగిగా సేవలందిస్తున్నా. మరో ఎనిమిదేళ్లలో రిటైర్డ్‌ అవుతా. కనీసం ఇప్పటి వరకు మాకు కనీసం రిటైర్‌మెంట్‌ అయ్యాక ఏం కల్పిస్తారో కూడా చెప్పలేదు. పాదయాత్ర సమయంలో మాతో జగన్‌ సమావేశమై మీరు కష్టపడండి.. మీ జీవితాల్ని నేను చూసుకుంటా అన్నారు. నాలుగేళ్లుగా మా వైపు కన్నెత్తి చూడలేదు.’ అని ఆర్‌టీపీసీ ఉద్యోగి పొట్టిబాబు విలపించారు.

విశ్వనాథపురం రైతులు సమస్యలను విన్నవించారు. వరి, పసుపు, శనగ పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నాం. పసుపు పంట వేయడానికి ఎకరాకు రూ.1.30లక్షలు ఖర్చవుతోంది.గతంలో క్వింటాలుకు రూ.8,500 వరకు ధర లభించేది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్వింటాలుకు రూ.5,500 కి మించి ధర లభించడం లేదు. కార్యక్రమంలో యువనేతలు పుట్టా మహేష్‌, రవి, జస్వంత్‌, మద్దిపట్ల సూర్యప్రకాష్‌, కేకే చౌదరి, అమరనాథ్‌రెడ్డి, రాటకొండ లక్ష్మీపతి పాల్గొన్నారు.


ఆగ్రహించిన లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, మైదుకూరు, చాపాడు: యువగళం పాదయాత్ర మార్గంలో ‘పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం’ అంటూ ప్రదర్శించిన ఫ్లెక్సీని చూసి లోకేశ్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చాపాడు పోలీసుస్టేషన్‌ సమీపానికి శుక్రవారం రాత్రి 11 గంటలకు పాదయాత్ర చేరుకోగా రహదారి పక్కన ఫ్లెక్సీ కనిపించింది. అక్కడున్న పోలీసులపై లోకేశ్‌ మండిపడుతూ.. ఫ్లెక్సీని చింపేస్తామంటూ హెచ్చరించారు. ఇలాంటి రెచ్చగొట్టే వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. ఈ తప్పుడు ఫ్లెక్సీ ఏర్పాటు, దీనికి పోలీసులు కాపలా ఉండటం లోకేశ్‌ ఆవేశానికి కారణమైంది. తీవ్ర ఆగ్రహానికి గురైన లోకేశ్‌ను తెదేపా నేత పుట్టా సుధాకర్‌యాదవ్‌ శాంతింపచేసే ప్రయత్నం చేశారు. లోకేశ్‌ దగ్గర నుంచి పోలీసులు తప్పుకొంటూ దూరంగా వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని