logo

యూజీడీ... ప్రగతి తడబడి!

భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ (యూజీడీ) నగర, పురపాలక సంస్థలకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వ్యవస్థ! భూగర్భ మురుగునీటి పారుదల లేదంటే ఆ నగరాలు అభివృద్ధిలో బాగా వెనకబడినట్టే.

Published : 03 Jun 2023 02:33 IST

రూ.100 కోట్ల విలువైన పనులు నిరుపయోగం
న్యూస్‌టుడే, నగరపాలక, కడప

భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ (యూజీడీ) నగర, పురపాలక సంస్థలకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వ్యవస్థ! భూగర్భ మురుగునీటి పారుదల లేదంటే ఆ నగరాలు అభివృద్ధిలో బాగా వెనకబడినట్టే. యూజీడీ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 2007లోనే కడప నగరపాలక సంస్థకు యూఐడీఎస్‌ఎస్‌ఎంటీ పథకం కింద రూ.72 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టిన పనులతో కడప నగరంలో వీధివీధినా గుంతలు మిగిలాయి తప్పితే మురుగునీటి పారుదలకు పరిష్కారం మాత్రం దొరకలేదు. 2008 నుంచి 2018 వరకు వివిధ దశల్లో చేపట్టిన పనుల్లోని లోపాలు సవరించడానికి మొదలు పెట్టిన వాటిల్లో అయిదేశ్లలో 5 శాతం మాత్రమే జరిగాయి. అసంపూర్తిగా ఉన్న పనులను చేపట్టడానికి ఏ ఒక్క గుత్తేదారు ముందుకురాకపోవడంతో యూజీడీ వ్యవస్థ నిరుపయోగంగా మారింది.

డప నగరంలోని భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనుల నుంచి రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గుత్తేదారు సంస్థను తప్పించే నాటికి మిగిలిన పనులను పూర్తి చేయడానికి 2017, ఆగస్టులో టెండర్లు పిలిచారు. నగరంలోని నాలుగు జోన్లలో 88.72 కిలోమీటర్ల మేర గొట్టాల ఏర్పాటు, ఎస్టీపీ పంప్‌హౌస్‌లో అసంపూర్తి పనులు పూర్తి చేయడం, 223 కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేసిన పైపులైన్‌ను పరీక్షించడం, పూడిక  తొలగించి శుద్ధి చేయడం తదితర పనులను గుత్తేదారు చేయాల్సి ఉంది. ఈ పనులను రూ.30.66 కోట్లతో పూర్తిచేసేందుకు కరీంనగర్‌కు చెందిన శ్రీసాయి కన్‌స్ట్రక్షన్స్‌ ముందుకొచ్చింది. అనంతరం 2018, ఆగస్టులో ప్రజారోగ్య సాంకేతికశాఖ గుత్తేదారుతో ఒప్పందం చేసుకుంది. 2020, ఫిబ్రవరిలోగా సంస్థ పనులు పూర్తి చేయాల్సిన నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం రివర్స్‌ టెండర్ల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనిపై జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 25 శాతం లోపు మాత్రమే జరిగిన పనులు నిలిచిపోయాయి. అప్పటికి సాయి కన్‌స్ట్రక్షన్‌ 5 శాతం పనులను మాత్రమే పూర్తి చేసింది. ఇందుకు గానూ ఆ సంస్థకు రూ.1.54 కోట్లు చెల్లించాల్సి ఉంది. గుత్తేదారు చేపట్టిన పనులు ఈ దశలోనే నిలిచిపోయాయి. పనులను ఏ రకంగానూ ముందుకు తీసుకుపోయే మార్గం కనిపించకపోవడంతో నిలిపేయాలని ప్రజారోగ్యసాంకేతిక శాఖాధికారులు అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారు.

ముందుకు రాని గుత్తేదారులు

యూజీడీ అసంపూర్తి పనులను పూర్తిచేసేందుకు అంచనా వ్యయాన్ని సవరించి అమృత్‌పథకం కింద ఇటీవల పలుమార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులెవరూ ముందుకు రాలేదు. యూజీడీ నెట్‌వర్క్‌లో ఇప్పటి వరకు 223 కిలోమీటర్ల మేర పైపులైన్‌ వేశారు. మరో 88 కిలోమీటర్ల మేర పైపులైన్‌ వేస్తే నగరంలోని అత్యధిక ప్రాంతాలకు యూజీడీ కనెక్టివిటీని ఇవ్వొచ్చు. బిల్లులు సకాలంలో చెల్లించరన్న భయం, ప్రజాప్రతినిధులను సంతృప్తిపరచలేమన్న ఆందోళన, ప్రభుత్వం విధించే పలు రకాల నిబంధనలతో గుత్తేదారులు కనీసం కన్నెత్తి చూడడం లేదని ప్రచారం జరుగుతోంది.


అమృత్‌ పథకం కింద పనులు చేయిస్తాం

- చెన్నకేశవరెడ్డి, ఈఈ, ప్రజారోగ్య సాంకేతికశాఖ, కడప

అసంపూర్తిగా ఉన్న యూజీడీ పనులను పూర్తిచేసేందుకు అమృత్‌ పథకం కింద చేపట్టడానికి టెండర్లు పిలుస్తున్నాం. గుత్తేదారులెవరూ ఆసక్తి చూపడం లేదు. త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని