logo

గాలివాన బీభత్సం

రామసముద్రం మండలం కుదురుచీమనపల్లె, మాలేనత్తం గ్రామపంచాయతీల్లో గురువారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది.

Published : 03 Jun 2023 02:33 IST

నేలకూలిన కోళ్లఫారం షెడ్లు, స్తంభాలు
టమోట, బొప్పాయి తోటలకు నష్టం

రామసముద్రం, న్యూస్‌టుడే: రామసముద్రం మండలం కుదురుచీమనపల్లె, మాలేనత్తం గ్రామపంచాయతీల్లో గురువారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. రెండు గ్రామ పంచాయతీల పరిధిలో రూ.కోటికి పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కుదురుచీమనపల్లెకు చెందిన రైతు సతీష్‌రెడ్డికి చెందిన రెండు కోళ్లఫారం షెడ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మిగిలిన నాలుగు షెడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రైతు ఆదినారాయణరెడ్డికి చెందిన మూడెకరాల్లో బొప్పాయి తోట నేలకూలి కాయలు రాలిపోయాయి. రమేష్‌రెడ్డికి చెందిన పది అల్లనేరేడు చెట్లు నేలకూలాయి. రామచంద్రారెడ్డి, ఈశ్వర్‌రెడ్డికి చెందిన ఏడు చింతచెట్లు నేలమట్టమయ్యాయి. రైతు రామచంద్రారెడ్డికి చెందిన ఆరెకరాల మామిడి తోట చెట్లతో సహా నేలకూలిపోయింది.

మాలేనత్తం గ్రామ పంచాయతీలోని మూగఎరప్పల్లెకు చెందిన వెంకటేష్‌రెడ్డి, సంజీవరెడ్డికి చెందిన రెండు విద్యుత్తు నియంత్రికలు నేలకూలాయి. విద్యుత్తు స్తంభాలు విరిగిపోయాయి. మాలేనత్తం, సింగింవారిపల్లె, కొండూరు, చింపరపల్లె గ్రామాల్లో వీధి దీపాలు పూర్తిగా పాడైపోవడంతో అంధకారంలో మగ్గుతున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 20 ఎకరాల్లో టమోట తోటలు నేలకొరిగి కాయలు రాలిపోయాయి. నేలకూలిన కోళ్లఫారం షెడ్లను శుక్రవారం తహసీల్దార్‌ దైవరాజన్‌ పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేయాలని పశువైద్యాధికారిణి దివ్యను ఆదేశించారు. దెబ్బతిన్న టమోట, బొప్పాయి తోటలను పరిశీలించి పంట నష్టంపై నివేదికను తయారు చేయాలని సంబంధిత అధికారులను కోరారు. వీరివెంట  వైస్‌ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, ఆర్‌ఐ.నాగరాజు, గ్రామరెవెన్యూ అధికారులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని