logo

పసుపు కొనుగోలుకు పిలుపు!

పసుపు పండించిన రైతులకు విపణిలో గిట్టుబాటు ధర దక్కడం లేదు. పచ్చబంగారం ధరలు పతనమైనా పాలకుల నుంచి ఎలాంటి భరోసా దక్కలేదు.

Published : 03 Jun 2023 02:33 IST

వైయస్‌ఆర్‌, అన్నమయ్యలో ఏడు కేంద్రాల ఏర్పాటు
న్యూస్‌టుడే, కడప, కడప వ్యవసాయం

సుపు పండించిన రైతులకు విపణిలో గిట్టుబాటు ధర దక్కడం లేదు. పచ్చబంగారం ధరలు పతనమైనా పాలకుల నుంచి ఎలాంటి భరోసా దక్కలేదు. గత మూడు నెలలుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా నిరాశే మిగిలింది. ఎట్టకేలకు కాస్త ఆలస్యంగానైనా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట మార్గదర్శకాలు జారీ చేసింది. పాత నిబంధనలే వర్తిస్తాయని స్పష్టం చేసింది. మూడేళ్ల కిందట క్వింటా మద్దతు ధర రూ.6,850తోనే కొనుగోలు చేయాలని తాజాగా ఆదేశించడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.  గడువు తక్కువ ఇవ్వడంపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వైయస్‌ఆర్‌ జిల్లాలో గతేడాది ఖరీఫ్‌ (2022-23)లో పసుపు పంట సాధారణ విస్తీర్ణం 8,542 ఎకరాలు కాగా, 4,122 మంది రైతులు 4,783.5 ఎకరాల్లో సాగు చేశారు. దిగుబడి 16,120 మెట్రిక్‌ టన్నులొస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని 25 మండలాల్లోని 152 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 2,362 మంది రైతులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పసుపుతీతపనులు ప్రారంభమయ్యాయి. మార్చి, ఏప్రిల్‌, మేలో కొనుగోలు చేస్తారని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. మార్కెట్లో క్వింటా ఎండు కొమ్ములకు గరిష్ఠంగా రూ.6 వేలు లోపే ధర పలుకుతోంది. చాలామంది వచ్చినకాడికి చాలన్నట్లు అమ్మేశారు. మరికొందరు ధర పెరుగుతుందని, ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆశతో నిల్వ చేసుకున్నారు. రైతుల కన్నీటి వెతలపై ‘ఈనాడు’లో ఈ ఏడాది ఫిబ్రవరి 23న ‘పసుపు.. నేలచూపులు’, ఏప్రిల్‌ 24న ‘తెల్లబోయిన పచ్చబంగారం’ శీర్షికతో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య అధికారులు మాత్రం పేర్లు నమోదు చేసుకోవాలని ప్రకటించడంతో చాలామంది ఆశతో ఆర్‌బీకేలకు పరుగులు తీశారు. ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ఈ నెల 1న ‘పసుపు రైతు గోడు పట్టదా?’ శీర్షికతో మరో కథనం ప్రచురితం కాగా, ‘ఈటీవీ- ఆంధ్రప్రదేశ్‌’లో  ‘పసుపు ధర పెంచండయ్యా’ కథనం ప్రసారమైంది. దీనిపై మార్క్‌ఫెడ్‌ అధికారులు స్పందించారు. మద్దతు ధరతో కొనాలని ఉత్తర్వులిచ్చారు. ఈ నెల 1 నుంచి 12వ తేదీ వరకు మాత్రమే కొనేందుకు అనుమతిచ్చారు. తక్కువ సమయం ఇవ్వడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గడువును పొడిగించాలని కోరుతున్నారు. సంయుక్త కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీని నియమించాలని ఉన్నత స్థాయిలో ఆదేశించారు. సిద్దవటం, పోరుమామిళ్ల, మైదుకూరు, ఖాజీపేట, జమ్మలమడుగు, పెండ్లిమర్రిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శనివారం నుంచి రైతుల నుంచి కొనేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో 5,556 మెట్రిక్‌ టన్నులు కొనాలని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి. గోనె సంచులు 77 వేలు అవసరం కాగా, ప్రస్తుతం 5 వేలు మాత్రమే సిద్ధంగా ఉన్నాయి. ఒక రైతు నుంచి 30 క్వింటాళ్లు కొనేందుకు అనుమతిచ్చారు. కొమ్ములు, దుంపలను 2:1 నిష్పత్తిలో తీసుకోనున్నారు. అన్నమయ్య జిల్లాలో 664 మంది 2,027 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని మండలాల్లో 36 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 224 మంది రైతులు ముందుకొచ్చి పేర్లు నమోదు చేసుకున్నారు. రాజంపేటలో మాత్రమే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. మరికొన్ని కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో 198 మెట్రిక్‌ టన్నులు కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని