logo

రెవెన్యూలో బదిలీలలు!

సాధారణ ఎన్నికల్లో క్రియాశీలకమైన రెవెన్యూశాఖలో భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. వైయస్‌ఆర్‌ జిల్లాలో 36 మండలాలుండగా ఏకంగా 21 చోట్ల తహసీల్దార్ల బదిలీలు జరిగాయి.

Updated : 03 Jun 2023 05:11 IST

ఈనాడు డిజిటల్‌, కడప

సాధారణ ఎన్నికల్లో క్రియాశీలకమైన రెవెన్యూశాఖలో భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. వైయస్‌ఆర్‌ జిల్లాలో 36 మండలాలుండగా ఏకంగా 21 చోట్ల తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. మరికొన్ని చోట్ల ఉప తహసీల్దార్లను బదిలీ చేశారు. ఇటీవల రెండు దశల్లో కొన్ని బదిలీలు జరగ్గా, మరోసారి తాజాగా చోటుచేసుకున్నాయి. ఏడాది కాలంలోనే మూడుసార్లు బదిలీకి లోనైన అధికారులూ ఉన్నారు. ఎన్నికల తరుణంలో జిల్లాలో అధికార వైకాపా ప్రజాప్రతినిధులు, నేతలు కార్యకలాపాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వ భూముల పందేరం, అసైన్‌మెంట్‌ కమిటీల ద్వారా లబ్ధిదారుల ప్రతిపాదనలు, గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నాల్లో చెప్పినట్లుగా వినని అధికారులను బదిలీ చేయించుకున్నారు. కొందరు అధికారులు ఎన్నికల తరుణంలో ఇష్టారాజ్యంగా పనులు చేయడానికి ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం మారే పక్షంలో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ససేమిరా అంటున్నారు. కమలాపురం మండలానికి ఏడాదిలో నలుగురు తహసీల్దార్లు పనిచేయాల్సి వచ్చింది. విజయకుమార్‌ స్థానంలో అమరేశ్వరి, ఆ తరువాత నారాయణరెడ్డి, తాజాగా అలీఖాన్‌ నియమితులయ్యారు. కమలాపురం నుంచి మూడు నెలల వ్యవధిలోనే తహసీల్దారు అమరేశ్వరి వల్లూరు మండలానికి బదిలీ జరుగగా, తాజాగా బద్వేలు ఆర్డీవో కార్యాలయానికి బదిలీ చేశారు. ఏడాదిలోనే మూడు స్థానాలు మారాల్సి వచ్చింది. భూదందాలు, ఇసుక వ్యవహరాల్లో సహాయ సహకారాలు అందించనందునే బదిలీలు జరిగినట్లు సమాచారం. ఏడాది తిరక్క ముందే సిద్దవటం తహసీల్దారు బదిలీ కోసం ఉన్నతాధికారులను వేడుకోవడంతో వల్లూరుకు బదిలీ అయ్యారు. మండలంలో నాలుగు వరుసల జాతీయ రహదారి భూసేకరణలో గతంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. వీటిని సరిదిద్దే క్రమంలో సహకరించనందున తహసీల్దారుపై ఒత్తిళ్లు పెరిగిపోవడంతో బదిలీ అనివార్యమైందనే విమర్శలున్నాయి. బ్రహ్మంగారిమఠం మండలంలో పనిచేస్తున్న ఉప తహసీల్దారు కిషోర్‌కుమార్‌రెడ్డి ఇప్పటికి ఏడాదిలోపే మూడుసార్లు బదిలీ జరిగింది. అసైన్డ్‌ భూముల విషయంలో ఇటీవల వైకాపా నేతలు అధికారిపై దౌర్జాన్యానికి దిగారు. ఈ అధికారిని తిరిగి బద్వేలు ఆర్డీవో కార్యాలయానికి బదిలీ చేశారు. బి.కోడూరులో పని చేసిన మధురవాణి వేధింపులు తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఈ స్థానంలో ఉపతహసీల్దారు విద్యాసాగర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. డీటీగా పనిచేస్తున్న జాన్సన్‌ అనతి కాలంలోనే సీకే దిన్నె, బద్వేలు, బద్వేలు ఆర్డీవో కార్యాలయం. తాజాగా బి.మఠం మండలానికి నియమితులయ్యారు. వేముల మండలంలో పనిచేస్తున్న డీటీ త్రిభువనరెడ్డిని రాజకీయపరంగా లింగాల మండలానికి బదిలీ చేశారు. ఖాజీపేట మండల తహసీల్దారు విషయంలో రాజకీయ బదిలీ జరిగింది. ఇక్కడ వంద ఎకరాల ప్రభుత్వ భూములను కాజేసే యత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందుకు అనుకూలంగా బదిలీలు చేపట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని మండలాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు దీర్ఘకాలికంగా ఒకేస్థానంలో పని చేస్తుండగా వారిని కదిలించకపోవడం విశేషం. అన్నమయ్య జిల్లాలోనూ బదిలీలకు కసరత్తు జరుగుతోంది. ఇక్కడ ఇటీవల కొన్ని బదిలీలు జరిగాయి. తహసీల్దార్లను పక్కన పెట్టి చాలా చోట్ల డీటీలకు బాధ్యతలు అప్పగించారు. డీటీల ద్వారా పనులు చక్కబెట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా కుతంత్రాలు నడుస్తున్నాయి. మరిన్ని బదిలీలు త్వరలో జరిగే అవకాశాలున్నాయి. ఇదే తరహాలో ఎంపీడీవోలు, ఇతరత్రా అధికారుల బదిలీలు చోటుచేసుకుంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని