logo

జిల్లా నేతలకు లోకేశ్‌ క్లాస్‌

తెదేపా జిల్లా నేతలకు నారా లోకేశ్‌ క్లాస్‌ తీసుకున్నారు. పార్టీపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నా... అదే వేగంతో జనంలోకి ఆశించినంతగా చొచ్చుకెళ్లడంలేదని అభిప్రాయపడ్డారు.

Published : 04 Jun 2023 02:57 IST

ఈనాడు డిజిటల్‌, కడప: తెదేపా జిల్లా నేతలకు నారా లోకేశ్‌ క్లాస్‌ తీసుకున్నారు. పార్టీపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నా... అదే వేగంతో జనంలోకి ఆశించినంతగా చొచ్చుకెళ్లడంలేదని అభిప్రాయపడ్డారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారనే ఎదురు చూసే ధోరణి సరికాదని.. మీరు స్వతహాగా అధికార పార్టీపై పోరాడే విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రొద్దుటూరు వ్యవహారంలో నేతలు ముందుగా తగువిధంగా స్పందించి ఉంటే వైకాపా ఫ్లెక్సీలు వెలిసేవి కావని, అనంతరం కూడా గట్టిగా ఎదుర్కోలేదనే నేతల వద్ద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన రెండు దఫాలుగా నేతలతో సమావేశమై నేతల పనితీరుపై సమీక్షించారు. విశ్వనాథపురం విడిది కేంద్రంలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి బాధ్యతలు చూస్తున్న మాజీ మంత్రులు అమర్‌నాథరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తదితరులతో భేటీ అయ్యారు. శనివారం రాత్రి పాదయాత్ర ముగింపు సందర్భంగా భూమయ్యగారిపల్లె వద్ద మరోమారు నేతలు కలవగా పలు అంశాలపై లోకేశ్‌ మాట్లాడారు. పాదయాత్రకు జిల్లాలో విశేష స్పందనను మీరే చూస్తున్నారు..కదా అంటూ జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరులో బహిరంగ సభలు విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే తీరుపై జనం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, బాధితుల తరఫున పోరాడుతూ మన్ననలు పొందాలని సూచించారు. మీరూ.. సందర్భాన్ని బట్టి అధికార పార్టీ అరాచకాలను ఎత్తి చూపాలని.. అందరూ స్వరాన్ని పెంచాలని ఆదేశించారు. పార్టీ అధికారంలోకి వచ్చే విషయంలో ఎలాంటి సందేహం లేదని, కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని.. ఇకపై తరచూ నేతల పనితీరును సమీక్షించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తాను ఉన్నంత వరకే హడావుడి చేసి వెళ్లకుండా పాదయాత్ర అనంతరం కూడా అదే ఒరవడిని కొనసాగించాలని సూచించారు. జిల్లాలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడానికి వ్యూహ రచన చేయాలని, ఇందుకు తన వంతు అన్ని రకాలుగా అండగా ఉంటాననే భరోసా ఇచ్చారు. జిల్లా అభివృద్ధి, ప్రజల కోసం చేపట్టనున్న వివిధ కార్యక్రమాలను జిల్లా సరిహద్దులు దాటకముందే రూట్‌మ్యాప్‌ ఇస్తానని,  దీన్ని జనంలోకి తీసుకెళ్లాలనే సంకేతాలిచ్చారు. యువతకు ప్రాధాన్యమిస్తామన్నట్లుగానే జమ్మలమడుగు నుంచి భూపేష్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు సూత్రప్రాయంగా తెలిపారు. ప్రొద్దుటూరు నుంచి ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి అవకాశం ఇస్తున్నట్లుగానే చెబుతూ మరింతగా పనితీరు మెరుగుపర్చుకోవడం, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని గట్టిగా సూచించారు. మైదుకూరు అభ్యర్థిగా పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేరును ఇది వరకే పార్టీ అధినేత చంద్రబాబు అంతర్గతంగా ఖరారు చేశారు. కమలాపురం విషయంలోనూ పుత్తా నరసింహారెడ్డిపై పార్టీ సానుకూలంగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. కడపపై కూడా త్వరలో స్పష్టత ఇచ్చే దిశగా పార్టీ కసరత్తు చేస్తోంది. పాదయాత్ర అనంతరం అభ్యర్థులందరూ నిత్యం ప్రజల్లో ఉండాలని, మేం పడుతున్న కష్టాన్ని తెలుసుకుని ఆ మేరకు మీ స్థాయిలో చొరవ తీసుకోవాలని లోకేశ్‌ స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు పనితీరు కొలమానంగా ఉంటుందని తేల్చి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని