logo

మైదుకూరు ఎమ్మెల్యే... ఓ భూ కబ్జాకోరు!

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కడప గడ్డపై స్వరం పెంచారు. అధికార వైకాపాపై పదునైన విమర్శలు, ఆరోపణలతో పాటు సవాళ్లు విసిరారు. అధికార పార్టీ అరాచకాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Published : 04 Jun 2023 03:19 IST

అధికారంలోకి రాగానే భూములను వెనక్కి తీసుకుంటాం
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌
ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, మైదుకూరు

బహిరంగ సభకు హాజరైన జనం

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కడప గడ్డపై స్వరం పెంచారు. అధికార వైకాపాపై పదునైన విమర్శలు, ఆరోపణలతో పాటు సవాళ్లు విసిరారు. అధికార పార్టీ అరాచకాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యువగళం పాదయాత్ర 115వ రోజు శనివారం మైదుకూరు నియోజకవర్గంలో సాగింది. యువనేత పాదయాత్రకు మైదుకూరు పట్టణం జనసంద్రంలా మారింది. మైదుకూరు శివారు విశ్వనాథపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర మైదుకూరు పట్టణానికి చేరుకుంది. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. పట్టణ వీధుల్లో యువనేతకు వివిధ వర్గాల ప్రజలు భారీగా ఎదురేగి హారతులు పట్టి అపూర్వ స్వాగతం పలికారు. మైదుకూరు నియోజకవర్గం, పురపాలక సంఘం పరిధిలో సమస్యలను ప్రజలు లోకేశ్‌ దృష్టికి తెచ్చారు. మరో ఏడాదిలో రానున్న చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు.

పాదయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తున్న నారా లోకేశ్‌

ఎమ్మెల్యేపై ఆరోపణాస్త్రాలు

మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఓ భూ కబ్జాకోరు అని నారా లోకేశ్‌ ఆరోపించారు. అభివృద్ధిని పట్టించుకోకపోగా ఆయన మైదుకూరును భూకబ్జాలు, కమీషన్లు, ఇసుక దందాకు చిరునామాగా మార్చేశాడని విమర్శించారు. దువ్వూరు మండలం చింతకుంటలో సర్వే నంబరు 1396-2లో 80 ఎకరాల భూమిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి కాజేశారని ఆరోపించారు. దువ్వూరు మండలం ఎర్రబెల్లికి చెందిన అక్బర్‌ బాషా భూమిని నకిలీ పత్రాలతో సృష్టించి ఆక్రమించేయగా బాధితుడు సెల్ఫీ వీడియోతో ఆత్మహత్యాయత్నం చేశాడని వివరించారు. ఎర్రబల్లెకు చెందిన పాశం లక్ష్మీ నరసింహకు చెందిన సర్వే 612లో రెండెకరాల విస్తీర్ణాన్ని ఎమ్మెల్యే బామ్మర్ది నారాయణరెడ్డి పేరుపై తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఆరోపించారు. బాధితుడికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినా ఇప్పటివరకు ఆ భూమిని తిరిగి అప్పగించలేదని వివరించారు. ఖాజీపేట, మైదుకూరు, చాపాడు మండలాల్లో అసైన్‌మెంట్‌ కమిటీల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా భూములు కొట్టేయడానికి వ్యూహ రచన చేశారని విమర్శించారు. రాజోలి ఆనకట్ట ఎత్తిపోతల పథకం తదితర పనులకు దక్కించుకున్న గుత్తేదారుల నుంచి భారీగా కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. చివరకు ఆటవీ భూముల్ని సైతం కాజేశారని.. వీటిపై పుట్టా సుధాకర్‌ యాదవ్‌ న్యాయ పోరాటం చేశారని ప్రశంసించారు. నంద్యాలంపేటలో సర్వే నంబరు 506బిలో 104 ఎకరాల భూమి అక్రమంగా ఆక్రమించి ఇనుప కంచె వేశారని, న్యాయస్థానంలో విచారణ అనంతరం ఆరు నెలల్లోపు భూమిని స్వాధీనం చేసుకోలేదన్నారు. చాపాడు మండలం వెదురూరులో 12 ఎకరాల్లో ఇసుక తవ్వకానికి అనుమతులు తీసుకుని వైకాపా నేతలు వంద ఎకరాల్లో ఇసుక తవ్వేశారన్నారు.  మైదుకూరుకు సీఎం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు.

నిరుద్యోగ భృతిపై  పాదయాత్రలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న యువకులు

లోకేశ్‌ ఎదుట సమస్యల వెల్లువ

* గతేడాది 8 ఎకరాలు అరటితోట సాగు చేశా. రూ.12 లక్షలు పెట్టుబడి అయింది. గెలలు మాత్రం చెట్లకే ఉన్నాయి. ధర లేకపోవడంతో కోస్తే ఖర్చులకు కూడా రావని వదిలేశా. ఇల్లు కట్టుకోవడానికి ఇసుక కూడా అందుబాటులో ఉండటం లేదు’ అని చాపాడుకు చెందిన చెన్నారెడ్డి వివరించారు.

* మైదుకూరుకు చెందిన షేక్‌ హబీదా మాట్లాడుతూ ‘నాలుగు నెలల కింద నా కూతురికి వివాహం చేశా. దుల్హన్‌ కింద ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేశాను.  అప్పును తీర్చేందుకు చీటీలు కడుతున్నా. నాకు భర్త లేడు. కనీసం తండ్రి లేని కూతుళ్లకైనా నిబంధనలు సడలించి దుల్హన్‌ అమలు చేస్తే బాగుంటుందని కోరారు.

* వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ..‘నేను పాత ఇనుము కొనుగోలు చేసి వ్యాపారం చేస్తుంటా. రెండేళ్ల కింద వైకాపా నేతలు వచ్చి నా దుకాణం తొలగించారు. నేను కొనుగోలు చేయని ఇనుమును కొనుగోలు చేశానని బెదిరించారు. అవసరమైతే సీసీ కెమెరాలు చెక్‌ చేసుకోండని చెప్తే.. ఏంట్రా చూసేదని దౌర్జన్యం చేశారు.వైకాపా నేతలు కాలువల్లో పూడిక తీయకుండా బిల్లులు తీసుకున్నారు. దాన్ని ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టినందుకు నా కాలు విరగ్గొట్టారు. నాపై దాడి జరిగిందని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కేసు పెడితే.. తిరిగి నాపైనే కేసు పెట్టి జైల్లో పెట్టారు’ అని విలపించారు.

* విమల మాట్లాడుతూ ‘పింఛను ఇవ్వకుండా ఇచ్చినట్లు రాసుకున్నారు. నా భర్త చనిపోయి మూడేళ్లయింది. నాకు రేషన్‌ కార్డు లేదు. పింఛను రెండేళ్లుగా వస్తున్నట్లుగా పుస్తకంలో రాశారు. నాకు ఇంటి పట్టా కూడా ఇవ్వలేదు. సెంటు స్థలం పట్టా వచ్చిందని సచివాలయం పుస్తకంలో రాశారు’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

నేటి పాదయాత్ర కార్యక్రమాలు : మైదుకూరు నియోజకవర్గంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు భూమయ్యగారిపల్లి విడిది కేంద్రంలో బలిజ సామాజిక వర్గ ప్రతినిధులతో ముఖాముఖి.

* సాయంత్రం 4 గంటలకు భూమయ్యగారిపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని