logo

వెల్లువలా జనం.. యువనేత అభయం

‘మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు... జగనాసుర చరిత్రగా తేలిపోయింది.. సీబీఐ రా...రా... అంటూ అవినాష్‌రెడ్డిని, జగన్‌ని పిలుస్తోంది.

Updated : 06 Jun 2023 06:36 IST

బాధలు వింటూ... భరోసానిస్తూ అడుగులు
ఆలంఖాన్‌పల్లిలో 1,500 కిలోమీటర్ల శిలాఫలకం
కడప నగరంలోకి పాదయాత్ర ప్రవేశం
సొంత జిల్లాలో జగన్‌ శకం ముగిసింది
చెన్నూరు సభలో నారా లోకేశ్‌ ఆరోపణ
ఈనాడు, కడప, న్యూస్‌టుడే- చెన్నూరు

చెన్నూరు సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడుతున్న లోకేశ్‌

‘మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు... జగనాసుర చరిత్రగా తేలిపోయింది.. సీబీఐ రా...రా... అంటూ అవినాష్‌రెడ్డిని, జగన్‌ని పిలుస్తోంది. కేసుల నుంచి తప్పించుకునేందుకు సీఎం జగన్‌ దిల్లీ వెళ్లి 22 మంది ఎంపీలను తాకట్టుపెడుతున్నారు. కడప గడ్డపై యువగళం ప్రజాగర్జన చూసి జగన్‌కి నిద్రపట్టడంలేదు. నాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్చుకోలేకపోతున్నారు. నాపై కోడిగుడ్లు వేస్తే నీ కడుపు మంట తగ్గదు. దేనికీ భయపడని కుటుంబం. నీ కోడిగుడ్లకు భయపడతామా?’ అంటూ సోమవారం చెన్నూరులో జరిగిన సభలో నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఓ భూబకాసురుడని ఆరోపించారు. భూములతో పాటు ఇసుక, మట్టి, గ్రావెల్‌ దందాలకు చిరునామాగా కమలాపురాన్ని మార్చారని విమర్శించారు. పూర్వం బకాసురుడు ఊరికి ఒకరిని బలికోరినట్టుగా రవీంద్రనాథ్‌రెడ్డి.. పేదల, ప్రభుత్వ, చివరికి శ్మశాన భూముల్ని సైతం కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఆయన రవీంద్రనాథ్‌రెడ్డి కాదు.. భూబకాసురుడుగా పేరు మార్చానన్నారు. సొంత పార్టీ వాళ్లని కూడా వదిలిపెట్టకుండా దోచేయడం ఆయన నైజమని విమర్శించారు. ‘కడప నగర శివారులో రూ.200 కోట్ల విలువైన 54 ఎకరాల భూమి కబ్జా చేశారు. ఇప్పుడు వెంచర్‌ వేసి సెంటు రూ.13 లక్షల వంతున అమ్ముతున్నారు. ఆయన అనుచరుడు రాజేంద్రనాథ్‌రెడ్డి ద్వారా అమ్మే భూముల్ని ఎవరూ కొనద్దు. తెదేపా అధికారంలోకి రాగానే వెనక్కి తీసుకుంటాం. లేపాక్షి భూముల్ని కాజేయడానికి భారీ కుట్రపన్నారు. రూ.20 వేల కోట్ల విలువైన 9 వేల ఎకరాల భూమిని రూ.500 కోట్లతో కొట్టేయడానికి.. కొడుకుని డైరెక్టర్‌గా చేసి దొరికిపోయాడు. సర్వారాయ ప్రాజెక్టు సమీపంలో 400 ఎకరాలు ఆక్రమించి.. చేపల చెరువులు, పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. వల్లూరు మండలం గోటూరు వద్ద రూ.100 కోట్ల విలువైన పీర్లమాణ్యం భూముల్ని కబ్జా చేశారు. కడప నగరంలోని మామిళ్లపల్లె రెవెన్యూ పొలం సర్వే నంబరు 39, 60లో సుమారు రూ.130 కోట్లు విలువ చేసే రూ.18 ఎకరాల భూమి కబ్జా చేశారు’ అని ఆరోపించారు. ‘వల్లూరు రెవెన్యూ కార్యాలయం సమీపంలో రూ.7 కోట్లు విలువైన భూములు, కడప నగర జయరాజ్‌ గార్డెన్‌ వద్ద పేదలను బెదిరించి రూ.130 కోట్ల విలువ చేసే 18 ఎకరాలు, పెండ్లిమర్రి మండలం పొలతల పుణ్యక్షేత్రం సమీపంలో బినామీల పేర్లతో 200 ఎకరాలు, బుగ్గవంక ఆక్రమణ, కడప, కమలాపురంలో చుక్కల భూముల పేరిట వేధింపులతో రైతులు భూముల కాజేస్తున్నారు’ అని వివరించారు. ‘ఉమ్మడి కడప జిల్లాలో 20 వేల ఎకరాలను వైకాపా నేతలు కాజేశారని... తెదేపా అధికారంలోకి రాగానే సిట్‌ వేసి తిరిగి వెనక్కి తీసుకుని బాధితులకు పంచిపెడతామన్నారు. ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక కౌన్సిలర్‌ ప్రమీల, ఆమె భర్త నరేంద్ర తెదేపాలో చేరారని ఫోర్జరీ సంతకంతో కౌన్సిలర్‌ రాజీనామా చేసినట్లు రాయించి ఆమోదించారని తెలిపారు. ఆమె భర్తను హత్య కేసులో ఇరికించారన్నారు. కొప్పర్తి పారిశ్రామికవాడ ప్రయోజనం ఏమిటి?. రూ.905 కోట్లతో కమలాపురం అభివృద్ధికి వేసిన శంకుస్థాపన చేశారు... పనులు జరిగాయా?’ అని ప్రశ్నించారు. కమలాపురానికి సీఎం ఆయన మేనమామ ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు.

చెన్నూరు సభలో లోకేశ్‌, పుత్తా నరసింహారెడ్డి, చైతన్యరెడ్డి, లక్ష్మీరెడ్డి, నాయకుల విజయదరహాసం

తెదేపాలో చేరిన వైకాపా నేతలు

తెదేపాలో వల్లూరు మండలం తప్పెట్ల సర్పంచి గడికోట శాంతి, భర్త సుధాకర్‌రెడ్డి, మాజీ సర్పంచులు గాలి ప్రసాద్‌రెడ్డి, దర్శన్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు శేఖర్‌రెడ్డి, ముంతా జానయ్య, నేతలు రామసుబ్బారెడ్డి, నాగేంద్రరెడ్డి, జగన్‌, అనిల్‌, చంటికి లోకేశ్‌ పసుపు జెండాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మిట్టపల్లికి చెందిన 20 కుటుంబాలు, గంగిరెడ్డిపల్లి నుంచి 30, గోనుమాకులపల్లి నుంచి 30, ఉప్పరపల్లె నుంచి 40, తోల్లగంగనపల్లికి చెందిన 8 కుటుంబాలతో పాటు అలిదిన, పాయసంపల్లె, పడదుర్తి, చదిపిరాళ్ల, ఆర్‌ఎస్‌ నగర్‌, జేబీ నగర్‌ వాసులు తెదేపా కండువా కప్పుకున్నారు. కమలాపురం, కడప పాదయాత్రలో మాజీ మంత్రులు అమరనాథ్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, నేతలు పుత్తా నరసింహారెడ్డి, పుట్టా సుధాకర్‌ యాదవ్‌, పుత్తా చైతన్యరెడ్డి, పుత్తా లక్ష్మీరెడ్డి, కార్పొరేటర్‌ ఉమాదేవి, లక్ష్మీరెడ్డి, మన్మోహన్‌రెడ్డి, అమీర్‌బాబు, హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

మైలురాయి : ఆలంఖాన్‌పల్లి వద్ద 1500 కిలోమీటరు శిలాఫలకం ఆవిష్కరణలో నాయకులు

1,500 అడుగుల పతాకావిష్కరణ

పాదయాత్ర 1,500 కి.మీ చేరుకున్న తరుణంలో పెన్నానదిపై చెన్నూరు- కొండపేట వంతెనపై 1,500 అడుగుల యువగళం పతాకాన్ని కార్యకర్తలు, నాయకులు ప్రదర్శించారు. కార్యకర్తలతో కలిసి సెల్ఫీ దిగి యువనేత ఆనందాన్ని పంచుకున్నారు. భారీ పతాకాన్ని ప్రదర్శించిన కార్యకర్తలను ఆయన అభినందించారు.

ఆసేతు యువజనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని