logo

ప్రొద్దుటూరులో అటవీ భూముల స్వాహా

అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా మారింది ప్రొద్దుటూరు అటవీశాఖ రామేశ్వరం రేంజ్‌ పరిధిలోని భూముల పరిస్థితి. అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నారు. పర్యవసానంగా అక్రమ కట్టడాలు వెలిశాయి.

Published : 06 Jun 2023 02:41 IST

219 మంది ఆక్రమణదారులుగా నిర్ధారణ
వందలాది ఎకరాల్లో యథేచ్ఛగా కట్టడాలు
న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు

గోదాము నిర్వాహకులకు నోటీసులిచ్చేందుకు వచ్చిన సిబ్బంది

అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా మారింది ప్రొద్దుటూరు అటవీశాఖ రామేశ్వరం రేంజ్‌ పరిధిలోని భూముల పరిస్థితి. అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నారు. పర్యవసానంగా అక్రమ కట్టడాలు వెలిశాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటి భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదముందని, ఆ భూములను గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఓ న్యాయవాది లోకాయుక్తను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కలెక్టరు ఉత్తర్వుల మేరకు అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్త సర్వే చేసి మొదట 974 ఎకరాలున్నట్లు గుర్తించారు. ఆ భూముల్లో 219 మంది ఆక్రమణదారులున్నట్లు నిర్ధారించారు.

* రామేశ్వరం రిజర్వు ఫారెస్టులో రామేశ్వరంలో సర్వే నెంబరు 542/1లో 299.50, మోడంమీదపల్లెలో 507లో 547, కొత్తపల్లెలో సర్వే నెంబరు 1లో 77, పోట్లదుర్తిలో 906 సర్వే నెంబరులో 109 ఎకరాలు ఉన్నాయి. ప్రాథమికంగా 974 అక్రమణలో ఉన్నట్లు గుర్తించగా క్షేత్రస్థాయిలో మరోసారి రెవెన్యూ అధికారులు సర్వే చేస్తే 1,044 ఎకరాలకు పెరుగుతుందని అటవీశాఖ ఉన్నతాధికారులు లోకాయుక్తను కోరారు.

నోటీసుల తిరస్కరణ : అటవీ భూముల్లో 219 మంది అక్రమంగా కట్టడాలు నిర్మించారు. వీటిని తొలగించి, అటవీ భూములను తమకు అప్పగించాలని కోరుతూ అధికారులు నోటీసులు ఇవ్వబోతే కేవలం 50 మంది మాత్రమే తాఖీదులు తీసుకోగా 169 మంది తిరస్కరించారు. రాజకీయ నాయకుల నుంచి అధికారులకు ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. అక్రమ కట్టడాలను కలెక్టరు వారి చేత తొలగించి తమకు అప్పగించాలని అటవీశాఖ అధికారులు లోకాయుక్తను కోరారు.
ఆక్రమణపై తుది తీర్పు నేడు: ప్రొద్దుటూరు అటవీ పరిధిలో జరిగిన ఆక్రమణలపై తీర్పు మంగళవారం వెలువడనుంది. దీనిపై లోకాయుక్త కోర్టులో వాదనలు జరుగనున్నాయని అటవీ శాఖడిప్యూటీ డీఎఫ్‌వో దివాకర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని