logo

విశ్వదాభిరామా... భక్తుల తిప్పలు కనుమా!

శ్రీరామచంద్రమూర్తి పాద స్పర్శతో ఏకశిలానగరి పునీతమైంది. ఆంధ్రుల భద్రాద్రిగా ఒంటిమిట్ట కోదండ రామాలయం విరాజిల్లుతోంది. అత్యంత మహిమాన్విత దివ్య క్షేత్రంగా భాసిల్లుతోంది.

Published : 07 Jun 2023 02:46 IST

విడిది భవనం సరే... సేవలేవీ?
ప్రారంభించి 14 నెలలైనా అంతే
ఊసే లేని సిబ్బంది నియామకం

ఒంటిమిట్టలో తితిదే నిర్మించిన యాత్రికుల విడిది భవనం

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: శ్రీరామచంద్రమూర్తి పాద స్పర్శతో ఏకశిలానగరి పునీతమైంది. ఆంధ్రుల భద్రాద్రిగా ఒంటిమిట్ట కోదండ రామాలయం విరాజిల్లుతోంది. అత్యంత మహిమాన్విత దివ్య క్షేత్రంగా భాసిల్లుతోంది. రామయ్య దర్శనం కోసం తరలి వచ్చే భక్తులకు కావాల్సిన వసతులు ఇప్పటికీ పూర్తిస్థాయిలో సమకూరలేదు. కీలకమైన సేవల కోసం నూతన భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చి 14 నెలలైంది. ఇంత వరకు సిబ్బంది నియామకాన్ని చేపట్టలేదు. సేవా కేంద్రాల్లో పాత సామగ్రి కుప్పగా పడేశారు. ఇది తితిదే ఉన్నతాధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒంటిమిట్ట రామయ్య క్షేత్రాన్ని సందర్శించే యాత్రికులు కాసేపు విడిది చేయడానికి నిర్మించిన భవనాన్ని తితిదే పాలకమండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి గతేడాది ఏప్రిల్‌ 1న ప్రారంభించారు. ఇప్పటికే 14 నెలల కాలం కరిగిపోయింది. ఇంత వరకు భక్తులు వేచి ఉండే భవనంలో సేవలు అందించడానికి ఇంతవరకు సిబ్బంది నియామకాలు జరగలేదు. అంతులేని కాలయాపన చేస్తున్నారు. ప్రచారార్భాటం చూస్తే అబ్బో అనాల్సిందే. సేవలు నిరాశాజనకంగా ఉంటున్నాయి.

* ఇక్కడ పర్యాటకులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా రూ.159.27 లక్షలతో భవనాన్ని నిర్మించారు. ఇక్కడ 180 మంది సేద తీరేలా పనులు చేశారు. ఆలయానికి దక్షిణ దిశలో చేపట్టాలని అయిదేళ్ల కిందట తితిదే ఉన్నత స్థాయిలో అనుమతిచ్చారు. గుత్తేదారుతో 2018 నవంబరు 10న ఒప్పందం జరిగింది. వాస్తవంగా 2019 ఆగస్టు 9 లోపు పూర్తి చేయాల్సి ఉంది. సకాలంలో చేయలేకపోయారు. కాస్త ఆలస్యంగా పూర్తి చేశారు. ఇక్కడ 524.20 చదరపు మీటర్ల వైశ్యాలంతో చేపట్టారు. రిసెప్షన్‌, తిరుమల శ్రీవారి ప్రసాదాల విక్రయం, రాములోరి దర్శన ఆర్జిత సేవా టిక్కెట్లు అమ్మకం, సమాచార కేంద్రం, భక్తుల లగేజి భద్రపరుచుకోవడానికి లాకర్‌ వసతి, స్నానపు గదులు, మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించాలని ప్రతిపాదించారు. వాస్తవంగా 2020 ఏప్రిల్‌ 7న ప్రారంభించాలని అధికారులు భావించారు. కరోనా మొదటి దశ పంజా విసరడంతో వాయిదా వేశారు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో గతేడాది ఏప్రిల్‌ 1న అందుబాటులోకి తీసుకొచ్చారు. భవనాన్ని ప్రారంభించినా సేవలు అందించడానికి సిబ్బంది ఎవర్నీ నియమించలేదు. సేవా కేంద్రాల్లో పాత సామగ్రిని తీసుకొచ్చి నింపారు.

రాత్రి వేళ... దాహం కేకలు... కడప-రేణిగుంట జాతీయ రహదారిలో ప్రయాణించే భక్తులు చాలామంది భక్తులు రాత్రివేళ ఒంటిమిట్టలో బస చేయడానికి ఆగుతున్నారు. యాత్రికులు వేచి ఉండే భవనంలో విడిది చేస్తున్నారు. ఇక్కడ తాగేందుకు గుక్కెడు నీరు దొరకడం లేదు. చుక్క జలధార అందుబాటులోక లేక దాహం కేకలతో తల్లడిల్లిపోతున్నారు. దప్పికేస్తే అన్నప్రసాదం కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఆర్వో కేంద్రానికి పరుగులు తీయాల్సి వస్తోంది. దాహమో రామచంద్రా! అంటున్నా చెవికెక్కించుకోలేదు.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
- పి.వి.నటేష్‌బాబు, డిప్యూటీ ఈవో, ఒంటిమిట్ట

ఒంటిమిట్టలో యాత్రికులు వేచి ఉండే భవనాన్ని గతేడాది ప్రారంభించారు. సేవల కోసం ఇంకా సిబ్బంది నియామకాలు జరగలేదు. ఈ సమస్యపై తితిదే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకొంటాం. భక్తులు అసౌకర్యం కలగకుండా తాగునీరు వసతి కల్పిస్తాం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని