logo

ట్రూఅప్‌... కట్టాలంటే అప్పు

విద్యుత్తు తీగ తగిలితేనే మనిషికి షాక్‌ కొట్టేది... కానీ విద్యుత్తు సంస్థల తీరుతో బిల్లు ముట్టుకున్నా అంతకు మించి షాక్‌ కొడుతోంది. ఎప్పుడు ఏ రూపంలో విద్యుత్తు బిల్లులను అదనంగా వినియోగదారుని ముక్కు పిండి వసూలు చేస్తారో వారికే తెలియదు.

Published : 07 Jun 2023 02:48 IST

విద్యుత్తు బిల్లు పట్టుకుంటే షాకే!
వినియోగదారునిపై మరో భారం
యూనిట్‌కు రూ.40 పైసలు వడ్డన

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: విద్యుత్తు తీగ తగిలితేనే మనిషికి షాక్‌ కొట్టేది... కానీ విద్యుత్తు సంస్థల తీరుతో బిల్లు ముట్టుకున్నా అంతకు మించి షాక్‌ కొడుతోంది. ఎప్పుడు ఏ రూపంలో విద్యుత్తు బిల్లులను అదనంగా వినియోగదారుని ముక్కు పిండి వసూలు చేస్తారో వారికే తెలియదు. ఇబ్బడిముబ్బడిగా రకరకాల పేర్లు పెట్టుకుంటూ వినియోగదారుని జేబుకు చిల్లు పెడుతున్నాయ్‌ విద్యుత్తు సంస్థలు. ఇప్పుడు మరో బాదుడుకు సదరు సంస్థ రంగం సిద్ధం చేసింది. పేరు పాతదే అయినా విధానానికి కొత్త మార్గం అన్వేషించి వినియోగదారునిపై స్వారీ చేస్తున్నాయ్‌.

* జిల్లాలో అన్ని రకాల విద్యుత్తు సర్వీసులు కలిపి 10,84,979 ఉన్నాయి. గృహాలు, దాణిజ్యం, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు, తాగునీటి స్కీంలు, వీధి దీపాలు, తదితర సర్వీసులతో పాటు వ్యవసాయ సర్వీసులున్నాయి. అన్నమయ్య జిల్లాలో రాయచోటి, కోడూరు మినహా మిగిలిన డివిజన్లలో మరో 3,59,385 వరకు సర్వీసులున్నాయి. వినియోగం జిల్లాకు కేటాయించే లక్ష్యానికి మించి వినియోగించే పరిస్థితి ఉంది.

మరో బాదుడు: విద్యుత్తు వినియోగదారునిపై సంస్థలు మరో బాదుడుకు తెరలేపారు. ట్రూప్‌ ఛార్జెస్‌ పేరుతో ఇది వరకు వసూలు చేస్తుండేవారు. అదే పేరుతో ఇప్పుడు కొత్త విధానం తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా ఈ ఏడాది నుంచి ఏ నెల్లో కొనుగోలు విద్యుత్తు ఛార్జీలను అదే నెల లేదా మరుసటి నెల్లోనే వసూలు చేయాలని ఏపీ విద్యుత్తు (ఏపీఈఆర్సీ) నియంత్రణ మండలి ఆదేశించింది.  ప్రతి యూనిట్‌పై రూ.40 పైసలు ప్రకారం వసూలు చేసేందుకు సంస్థలు చర్యలు తీసుకున్నాయి. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన ట్రూప్‌ ఛార్జెస్‌ మే నెల బిల్లు.. అంటే జూన్‌ నుంచి వచ్చే బిల్లులో జత చేశారు. ఇది కాక సుంకం ఛార్జీలు, స్థిర ఛార్జీలు, కస్టమర్‌ ఛార్జీలతో పాటు ఎఫ్‌పీపీసీఏ పేరుతో మరో వడ్డన ఉండనే ఉంది. ఇలా అనేక విధాలుగా విద్యుత్తు వినియోగదారునిపై ఛార్జీల మీద ఛార్జీలు వేస్తూ నడ్డి విరుస్తున్నారు. ఇక వ్యవసాయ సర్వీసుల మీద కాక మిగిలిన అన్ని రకాల సర్వీసులపై ప్రతి నెలా ఇలా బిల్లులో ట్రూఅప్‌ ఛార్జీలు వేస్తారు. సాధారణంగా సంస్థలు బయట కొనుగోలు చేయాల్సిన ధరకు సుమారు రూపాయికి మించి వ్యత్యాసంతో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అందులో ఏపీ ఈఆర్సీ అనుమతించింది రూ.40 పైసలు మాత్రమే. ఇప్పుడు వేస్తున్న రూ.40 పైసల అదనపు భారం రెండు జిల్లాల్లో కొన్ని కోట్ల రూపాయలు వినియగదారులనుంచి వసూలు చేస్తున్నారు.

సంస్థ ఆదేశాల మేరకు: విద్యుత్తు కొనుగోలు ధరలో వచ్చే తేడా ఆధారంగా ట్రూప్‌ అప్‌ ఛార్జిలు వేస్తారు. గతంలో ఏడాది తరువాత వేసే వారు. ఇప్పుడు ఏనెలకానెల లేదా మరుసటి నెలకు వేస్తారు. సంస్థ నిర్ణయం ప్రకారం ఆదేశాలు అనుసరిస్తాం.

రమణ, ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని