logo

బిల్లులకు మోక్షం.. అడ్డంకి సాంకేతిక లోపం

మూడేళ్ల కిందట వర్షాభావం వెంటాడింది. భూగర్భ జలాలు పాతాళానికి వెళ్లాయి. నీటి మట్టాలు తరిగిపోయాయి. తాగునీటి గొట్టపు బావులు తడారిపోవడంతో పల్లెల్లో దాహం కేకలు మిన్నంటాయి.

Published : 07 Jun 2023 03:02 IST

జిల్లాకు రూ.2.64 కోట్లు మంజూరు
దస్త్రాలు వెలికి తీస్తున్న అధికారులు

ట్యాంకరు నుంచి నీటిని పట్టుకుంటున్న ప్రజలు (పాత చిత్రం)

కడప, న్యూస్‌టుడే: మూడేళ్ల కిందట వర్షాభావం వెంటాడింది. భూగర్భ జలాలు పాతాళానికి వెళ్లాయి. నీటి మట్టాలు తరిగిపోయాయి. తాగునీటి గొట్టపు బావులు తడారిపోవడంతో పల్లెల్లో దాహం కేకలు మిన్నంటాయి. గ్రామీణుల గొంతు తడారిపోకుండా తాత్కాలికంగా ఆయా గ్రామాల్లోని నాయకులతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు మాట్లాడి ట్యాంకర్లను ఏర్పాటు చేయించి నీరందించారు. కాసుల కష్టంతో గుత్తేదారులకు రవాణా బిల్లులు చెల్లించలేదు. నెలలకొద్దీ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా నిన్నటిదాకా నిర్వేదం మిగిలింది. ఎట్టకేలకు ప్రభుత్వం నిధులివ్వడానికి ముందుకొచ్చింది. బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో నమోదు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులందాయి. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఇంజినీరింగ్‌ అధికారులు గ్రామాల వారీగా బిల్లులను అప్‌లోడ్‌ చేసే పనిలో నిమగ్నమయ్యారు. చాలాకాలం విరామం తర్వాత పాలకులు పచ్చజెండా ఊపడంతో నీరు తోలిన నాయకులు ఊరట చెందుతున్నారు. అయితే సీఎఫ్‌ఎంఎస్‌లో సాంకేతిక సమస్యల వల్ల ఈ బిల్లులు అందుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందా? అని గుత్తేదారులు ఎదురుచూస్తున్నారు.

ఇరు జిల్లాల్లో సమస్య

* మూడేళ్ల కిందట పల్లెల్లో నీటిఎద్దడికి తాత్కాలికంగా పరిష్కారం చూపాలని ట్యాంకర్లతో రవాణా చేయించాలని గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అధికారులు నిర్ణయించారు. రాజంపేట, మదనపల్లె డివిజన్ల పరిధిలో 4,517 పనులకు అనుమతిచ్చారు. వీటి అంచనా విలువ రూ.19.01 కోట్లు. పల్లెల్లో ట్రాక్టర్ల ట్యాంకర్లను ఏర్పాటు చేయించి నీటిని సరఫరా చేశారు.

* నీటిని రవాణా చేయడానికి 2020 జూన్‌ 30వ తేదీ మునుపు ఒప్పందం జరిగిన వాటికి ఒక ట్రిప్పునకు రూ.515, జియో ట్యాగింగ్‌ యాప్‌లో నమోదు చేయడానికి రూ.4.90 వంతున ఇస్తామని నాడు ప్రకటించారు. అదే విధంగా 2020 జులై 1 తర్వాత ట్యాంకరు ట్రిప్పునకు రూ.515, జియో ట్యాకింగ్‌ చేస్తే రూ.4.75 మేర ఇచ్చేలా అనుమతిచ్చారు. చాలామంది ప్రభుత్వ కరుణ కోసం నెలలకొద్దీ నిరీక్షణ చేస్తున్నారు. డబ్బులు చెల్లించకపోవడంతో ఇంజినీర్లు, గుత్తేదారుల మధ్య తరచూ సంఘర్షణ జరుగుతోంది..

* అన్నమయ్య జిల్లాలో రూ.17.51 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ సొమ్ములు చెల్లించడానికి అంగీకరించారు. గ్రామాల వారీగా సీఎఫ్‌ఎంఎస్‌ దశ-2లో బిల్లులను నమోదు చేయాలని ఉత్తర్వులు రావడంతో ఏఈలు దృష్టి సారించారు.  వైయస్‌ఆర్‌ జిల్లాలో 192 పనులు చేయాలని రూ.2.64 కోట్లకు అనుమతిచ్చారు. ఇప్పటికీ రూ.2.43 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. మదనపల్లె డివిజన్‌లో రూ.10.90 కోట్లు అత్యధికంగా, పులివెందుల డివిజన్‌లో అతి తక్కువగా రూ.20.24 లక్షలు మాత్రమే రావాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న తాగునీటి రవాణా బిల్లులు చెల్లించాలని గత నెల 31న ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టరు కేవీవీ సత్యనారాయణ ఉత్తర్వు-2412 జారీ చేశారు.

అధికారులు ఏమంటున్నారంటే...

ఈ విషయంపై కడప డివిజన్‌ బాధ్య ఈఈ రామగోపాల్‌రెడ్డితో ‘న్యూస్‌టుడే’ చరవాణిలో మాట్లాడగా గతంలో తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా రవాణా చేసి నీరందించిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని ఉన్నత స్థాయి నుంచి ఆర్థిక అనుమతి వచ్చింది. సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు నమోదు చేస్తున్నామని చెప్పారు. వారం, పది రోజుల్లోపు రవాణాదారుల ఖాతాల్లో జమ అవుతుందని వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని