కడప గడప పసుపు మయం
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర జన ప్రభంజనంలా సాగింది. కడప గడపకు పసుపు రాసినట్లు తెలుగు దండు వెల్లువలా కదలిరావడంతో నగరం బంతిపూలవనంలా మారింది.
అడుగడుగునా లోకేశ్‌కు నీరాజనం
సమస్యలు ఏకరువు పెట్టిన జనం
నేడు మిషన్ రాయలసీమపైౖ ముఖాముఖి
కడప బిడ్డకు.. గడ్డకు వందనం : నమస్కరిస్తున్న లోకేశ్
ఈనాడు, కడప, న్యూస్‌టుడే, జిల్లా సచివాలయం: ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర జన ప్రభంజనంలా సాగింది. కడప గడపకు పసుపు రాసినట్లు తెలుగు దండు వెల్లువలా కదలిరావడంతో నగరం బంతిపూలవనంలా మారింది. మంగళవారం 118వ రోజు యువగళం పాదయాత్ర పుత్తా ఎస్టేట్ నుంచి ప్రారంభం కాగా.. దారి పొడవునా జనం పోటెత్తారు. యువనేత కోసం కడప ప్రజలు రోడ్లవెంట బారులు తీరడంతో నగరం కిక్కిరిసిపోయింది. అడుగడుగునా కడపలో యువనేతకు జనం నీరాజనాలు పట్టారు. పాదయాత్ర ప్రారంభంలో యాపిల్ పండ్లతో తయారు చేసిన గజమాలను వేసి ఘనంగా సత్కరించారు. దారిపొడవునా హారతులిస్తూ నీరాజనాలు పట్టారు. లోకేశ్‌ని చూసేందుకు మహిళలు, యువత, వృద్ధులు భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి అభివాదం చేశారు. వివిధ వర్గాల ప్రజలు లోకేశ్‌ని కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికి పోటీపడ్డారు. అందరి సమస్యలు ఓపికగా విని అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తామనే భరోసా ఇచ్చారు. దారిపొడవునా మహిళలు, నిరుద్యోగులు, వ్యాపారులు, మైనార్టీలు, భవన నిర్మాణ కార్మికులు, బ్రాహ్మణులు ఇలా పలు వర్గాల ప్రజలు కలిసి సమస్యలను విన్నవించారు. మంగళవారం లోకేశ్ 7.4 కి.మీ దూరం నడిచారు. ఇప్పటి వరకు యువగళం పాదయాత్ర 1,516.8 కి.మీ. మేర పూర్తయింది.
* కడప పార్లమెంట్ ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి నరసింహ మరణించగా.. వారి కుటుంబాన్ని తెదేపా ఆదుకుంది. తమకి అండగా నిలిచిన లోకేశ్‌ని పాదయాత్రలో కలిసి కృతజ్ఞతలు తెలిపింది. నరసింహ కుటుంబం విరాళంగా ఐటీడీపీ రూ.2 లక్షలు, స్థానిక నాయకులు రూ.2 లక్షలు, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రూ.5 లక్షలు కలిపి మొత్తం రూ.9 లక్షలు సాయంగా అందించారు. నరసింహ భార్యకి ఉద్యోగం, కూతురిని చదివించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
* కడప నగరానికి చెందిన సింగం నాగరాజు మాట్లాడుతూ... నా భార్య పారిశుద్ధ్య కార్మికురాలు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపాకి ఓటు వేయలేదని ఉద్యోగం నుంచి తీసేశారు. ఉద్యోగంలో ఉండాలంటే వైకాపాకి ఓటు వేయాలని బెదిరించారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు బెంగళూరు వలస వెళ్లామని గోడు వెల్లబోచుకున్నారు.
* పులివెందులకు చెందిన మునెమ్మ మాట్లాడుతూ... నా కొడుకుని హత్య చేయడంతో పాటు నా ఆస్తి లాక్కుని వైకాపా నాయకులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
* నగరంలో యూజీడీ పనులు 16 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో అన్ని సందుల్లో మురుగునీరు పారుతోంది. సీసీరోడ్లు పూర్తిస్థాయిలో నిర్మించలేదు. మంచినీరు రెండు రోజులకు ఒకసారి మాత్రమే వస్తున్నాయి. వీధి లైట్ల నిర్వహణ సరిగా లేదంటూ సమస్యలు నివేదించారు.
* ఎన్టీఆర్ సర్కిల్‌లో కొండయ్యపల్లికి చెందిన ప్రముఖులు లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కేసీ కెనాల్‌పై అక్రమ కట్టడాలను అరికట్టి రోడ్డును విస్తరించాలని, డ్రైనేజీ సమస్య ఉందని, ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్ నిర్మించాలని కోరారు.
యువనేతతో అడుగులేస్తున్న తెదేపా నాయకులు శ్రీనివాసరెడ్డి. అమీర్‌బాబు, ఉమాదేవి తదితరులు
డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం
తెదేపా అధికారంలోకి రాగానే.. కడప నగరంలో డ్రైనేజి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని లోకేశ్ అన్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడుతూ... అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేస్తాం. కడపలో వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తాం. లక్షలాదిగా పేదల ఆకలితీర్చిన అన్నా క్యాంటీన్లను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. మట్టి అక్రమ రవాణాతో 2వ డివిజన్‌లోని నానాపల్లె, వైఎస్‌ఆర్ లేఅవుట్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్లు, స్థానిక సంస్థలను పూర్తిగా గాలి కొదిలేశారు. జిల్లా కేంద్రంలో వర్షానికి ఇళ్లు మునిగిపోవడం సిగ్గు చేటన్నారు. అధికార పార్టీ నేతలు మట్టి, ఇసుక అక్రమ తవ్వకాల్లో మునిగిపోయారని ఆరోపించారు. పులివెందులలో రామచంద్రారెడ్డి తమ్ముడి పిల్లలను చదివించే బాధ్యతీ తీసుకుంటామని హామీ ఇచ్చారు. హత్య చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత తెదేపాదని, చీనీచెట్లకు నీరిచ్చి ఆదుకున్నామని తెలిపారు. పులివెందుల్లో మునెమ్మ కుమారుడిని చంపేస్తే.. పిల్లల్ని తెదేపా చదివిస్తోందని తెలిపారు.
ఘనంగా ఏర్పాట్లు
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, సతీమణి మాధవిరెడ్డి సామాజిక వర్గ ప్రతినిధుల సమావేశంలో పాల్గొని ఏర్పాట్లు పరిశీలించారు. సీనియర్ నేత లక్ష్మీరెడ్డి, మన్మోహన్‌రెడ్డి, కార్పొరేటర్ ఉమాదేవి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్ర 1,500 కి.మీ చేరుకున్న సందర్భంగా 1,500 మంది మహిళలకు పసుపు చీరలు అందించారు. నియోజకవర్గ బాధ్యులు అమీర్‌బాబు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్, కృష్ణకిషోర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి ఏర్పాట్లు చేపట్టారు. మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, బీటెక్ రవి, దీపక్‌రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, పార్థసారథిరెడ్డి, వికాస్‌హరి తదితరులు పాల్గొన్నారు.
నేడు కీలక సమావేశం
కడప రాజరాజేశ్వరి కళ్యాణమండపం ఎదుట విడిది ప్రాంగణంలో రాయలసీమ ప్రముఖులతో బుధవారం సాయంత్రం యువనేత నారా లోకేశ్ ‘మిషన్ రాయలసీమ’ పేరుతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాయలసీమ అభివృద్ధికి డిక్లరేషన్ ప్రకటించనున్నారు. సమావేశంలో తెదేపా అధికారంలోకి వచ్చాక రాయలసీమలో చేపట్టబోయే పనులపై కీలక ప్రకటన చేయనున్నారు. రాయలసీమకు చెందిన ప్రముఖులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి