logo

పోలింగ్‌ కేంద్రాలపైనా కన్ను!

పోలింగ్‌ కేంద్రాలపైనా వైకాపా నేతల కన్ను పడింది. తమ అడ్డాలోకి మార్చుకుని పోలింగ్‌ రోజు తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.

Published : 21 Sep 2023 05:11 IST

 తమ అడ్డాలోకి మార్చుకునేందుకు వైకాపా కుటిలయత్నాలు
 నేతల ప్రతిపాదనలకు తలూపుతున్న రిటర్నింగ్‌ అధికారులు

అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం గుదియవాండ్లపల్లె పోలింగ్‌ కేంద్ర భవనం

  •  అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం గుదియవాండ్లపల్లె పోలింగ్‌ కేంద్రంలో 500 మంది వరకు ఓటర్లు ఉండగా, దీనిని 170 మంది ఓటర్లున్న అంకిరెడ్డిగారిపల్లెకు మార్చడానికి ప్రతిపాదించారు. ఈ పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఆరు గ్రామాలుండగా 1,036 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతమున్న కేంద్రం జాతీయ రహదారి పక్కన అన్ని గ్రామాలకు సౌకర్యవంతంగా ఉంది. దుద్యాల పోలింగ్‌ కేంద్రాన్ని మహమ్మద్‌నగర్‌కు మార్చేందుకు ప్రతిపాదించారు. నరసారెడ్డిపల్లె నుంచి దిగువ హరిజనవాడకు పోలింగ్‌ కేంద్రం మార్పునకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైకాపాకు పట్టులేని గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలున్నందున మార్పు చేసేందుకు ఎత్తులు వేస్తున్నారు. కలికిరి, కలకడ, గుర్రంకొండ మండలాల్లో అవసరం లేకున్నా అదనపు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించి తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు.

  •  వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో 21 పోలింగ్‌ కేంద్రాల మార్పునకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వీటిలో అయిదు వరకు మార్పునకు హేతుబద్ధంగా ఉండగా మిగిలినవి నిబంధనలు అతిక్రమించి ప్రతిపాదించారు. వీటిపై తెదేపా ఆధారాలతో సహా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఖాజీపేట బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో రెండు పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఇవి అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండగా, వైకాపా నేత గోదాం వద్దకు మార్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. సాధారణంగా రెండు కిలోమీటర్లకుపైగా దూరం ఉన్న పక్షంలోనే ప్రతిపాదన స్వీకరించాలనే నిబంధన ఉంది. బాలికల ఉన్నత పాఠశాలకు ప్రతిపాదిత ప్రాంతానికి ఒకటిన్నర కిలోమీటరు దూరం మాత్రమే ఉంది.

ఈనాడు, కడప


పోలింగ్‌ కేంద్రాలపైనా వైకాపా నేతల కన్ను పడింది. తమ అడ్డాలోకి మార్చుకుని పోలింగ్‌ రోజు తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణకు ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరిచే ప్రక్రియ నడుస్తోంది. అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో ఇష్టారాజ్యంగా ప్రతిపాదనలు ఇవ్వడం, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు కొంతమంది రిటర్నింగ్‌ అధికారులు ఆమోదముద్ర వేయడం జరుగుతోంది. అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఓటర్ల జాబితా పరిశీలనతోపాటు పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణకు ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. సాధారణంగా అయితే వాగులు, వంకలు పరిగణనలోకి తీసుకోవడం.. పోలింగ్‌ కేంద్రం భవనాలు అనుకూలంగా లేని పక్షంలో మాత్రమే మార్పునకు పరిశీలన చేయాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా ప్రతిపాదించడం, ఆపై ఆమోదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో ముసాయిదా ఓటర్ల జాబితాతోపాటు కొత్త పోలింగ్‌ కేంద్రాలకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. వైకాపాకు అనుకూలంగా పోలింగ్‌ కేంద్రాల మార్పు, అదనపు కేంద్రాల ఏర్పాటు ప్రయత్నాలు రెండు జిల్లాల్లో జరుగుతున్నాయి. పోలింగ్‌ కేంద్రాల ప్రతిపాదనలపై చర్చించడానికి వైయస్‌ఆర్‌ జిల్లాకు సంబంధించి కడపలో గురువారం కలెక్టర్‌ విజయరామరాజు నేతృత్వంలో సమావేశం జరగనుండగా, అన్నమయ్య జిల్లాలో బుధవారం జరిగింది. అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం 1,577 పోలింగ్‌ కేంద్రాలుండగా, వీటి పరిధిలో 13,53,759 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే కొత్తగా ఓటర్ల నమోదు, ప్రత్యర్థుల ఓట్ల తొలగింపులు తదితర అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండగా, పోలింగ్‌ కేంద్రాల మార్పుల్లోనూ నిబంధనలకు వ్యతిరేకంగా అడుగులు పడుతున్నాయి. వీటిపై అందించిన ఫిర్యాదులపై స్థానికంగా న్యాయం జరగని పక్షంలో ఉన్నతస్థాయికి తీసుకెళ్లి అక్రమాలను ఎండగడతామని ప్రజల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని